pizza
Sai Madhav Burra interview (Telugu) about NTR Biopic
ఇష్టపడి రాస్తాను కాబట్టి నాకెప్పుడూ కష్టం అనిపించ‌దు - సాయిమాధ‌వ్ బుర్రా
You are at idlebrain.com > news today >
Follow Us

26 December
Hyderabad

నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను 'యన్‌.టి.ఆర్‌' పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఎన్‌.బి.కె.ఫిలింస్ బ్యాన‌ర్‌పై నందమూరి బాలకృష్ణ టైటిల్‌ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌ 'యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు'.. 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాలో తొలి భాగం `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` చిత్రాన్ని జ‌న‌వ‌రి 9న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాట‌ల ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఇంట‌ర్వ్యూ...

'యన్‌.టి.ఆర్‌' సినిమాకు వర్క్‌ చేయడం ఎలా భావిస్తున్నారు?
- ఆ విషయం నేను మాటల్లో చెప్పలేను. చిన్నప్పటి నుండి రామారావుగారికి నేను పిచ్చి అభిమానిని. నేను ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ రాస్తానని కనీసం కలలో కూడా ఊహించలేదు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆయన ఆశీర్వాదం, భగవంతుని అనుగ్రహం వల్ల సినిమాలోని ప్రతి సీన్‌ అత్యద్భుతంగా వచ్చింది.

'యన్‌.టి.ఆర్‌' కోసం ఎలాంటి రీసెర్చ్‌ చేశారు?
- రామారావుగారిని అబ్జర్వ్‌ చేయడం, నేర్చుకోవడం, పరిశోధించడం, ఇవన్నీ సినిమా కోసం సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో ఒక ఫ్లోలో జరిగిపోతాయి. చిన్నప్పట్నుండి యన్‌టిఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ళ గురించి తెలుసుకోవడమే జీవితాశయంగా పెట్టుకున్నాను. బయోపిక్‌ కోసం కొంత రీసెర్చ్‌ చేశాను. ఆ పరిశోధన అనేది నా జీవితంలో ఒక భాగం.

యన్‌.టి.ఆర్‌. చిత్రం అంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఉంటుంది కదా! వారి అంచనాలను అందుకుంటుందా?
- ఆ మహానుభావుడు గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉన్నట్లే.. ప్రతి కథకి ఒక సోల్‌ ఉంటుంది. ఒక మనిషి జీవితంలో లక్షల ఇన్సిడెంట్స్‌ జరుగుతాయి. అవన్నీ సినిమాలో చూపించలేం. ఎలాగైతే 'గాంధీ'గారి బయోపిక్‌ నుండి సమాజానికి కావాల్సిన అంశాలు తీసుకున్నామో.. అలా ఏదైతే సమాజానికి అవసరమో, ఆ విషయాలు ఖచ్చితంగా ఈ బయోపిక్‌లో ఉండి సినిమా సంపూర్ణంగా ఉంటుంది.

ఇంత తక్కువ టైమ్‌లో రెండు భాగాలు ఎలా షూట్‌ చేయగలిగారు?
- అవునండీ. 'యన్‌.టి.ఆర్‌. కథానాయకుడు', 'యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు' రెండు భాగాలు కలిపి 70 రోజుల్లో పూర్తి చేశాం. యన్‌.టి.ఆర్‌. కథ ఎలా ఒక చరిత్రగా నిలిచిపోయిందో, ఈ సినిమా మేకింగ్‌ కూడా ఒక చరిత్ర.

'యన్‌.టి.ఆర్‌' గురించి మీ అభిప్రాయం?
- ఆయన ఒక విజేత. ఈరోజు ఏ పథకాలైతే అమలవుతున్నాయో చాలా వరకు ఆయన ప్రవేశపెట్టినవే. రాజకీయాల్లో ఆయన ఒక సంచలనం. లంచం అనేదే తెలియదు. ఆయన కథలో ఉన్న ఆత్మను ఎలివేట్‌ చేయడానికి మావంతు ప్రయత్నం చేశాం.

interview gallery



'యన్‌.టి.ఆర్‌' బయోపిక్‌ అంటే డైలాగ్స్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది కదా?
- ఈ సినిమాలో అద్భుతమైన మాటలు రాయాలని ప్రాణం పెట్టి రాశాను. డైలాగులు అద్భుతంగా అనిపిస్తేనే క్రిష్‌గారికి చూపించడం జరిగింది. ఆయనకూ అవి అత్యద్భుతంగా ఉంటేనే సినిమాలో పెట్టడం జరిగింది.

యన్‌.టి.ఆర్‌లా బాలకృష్ణగారి నటన గురించి?
- ఈ సినిమాలో బాలకృష్ణగారి నటన చూస్తుంటే హండ్రెడ్‌ పర్సెంట్‌ రామారావుగారిని చూస్తున్నట్లే అద్భుతంగా ఉంటుంది. సెట్‌లో బాలకృష్ణగారి నటన చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు రామారావు గారేమోనని భ్రమపడి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి.

డైలాగ్స్‌ విషయంలో బాలకృష్ణగారి సలహాలు ఏమైనా తీసుకున్నారా?
- బాలకృష్ణగారి నుండి విలువైన సలహాలు, సమాచారం తీసుకోవడం జరిగింది. ఆయన సలహాలు, సూచనలు సినిమా బాగా రావడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇక.. డైలాగ్స్‌ విషయంలో మా మధ్య ఎప్పుడూ డిస్కషనే లేదు. ఆయన రచయితకి ఇచ్చే గౌరవం మాటల్లో చెప్పలేనిది.

ఈ చిత్రంలో సిగ్నేచర్‌ డైలాగ్స్‌ ఏమైనా ఉన్నాయా?
- ఖచ్చితంగా ఉంటాయి. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో 'సమయం లేదు మిత్రమా...' డైలాగ్‌ రాసేటప్పుడు అది సిగ్నేచర్‌ డైలాగ్‌ అవుతుందనుకోలేదు. కానీ సిగ్నేచర్‌ డైలాగ్‌ అయ్యింది. అలాగే ఇందులో ఆయన బయోపిక్‌కి డైలాగ్‌లు రాస్తున్నాను.. అనుకోకుండా నిజంగా యన్‌.టి.ఆర్‌గారికే డైలాగ్‌లు రాస్తున్నాను అనే ఫీలింగ్‌తోనే రాశా. ఈ సినిమాలో సి.ఎస్‌.ఆర్‌, రేలంగిలాంటి హేమాహేమీలతో పాటు చంద్రబాబునాయుడు, వై.ఎస్‌.ఆర్‌లాంటి రాజకీయ నాయకులకు మాటలు రాసే అదృష్టం దక్కింది.

'యన్‌.టి.ఆర్‌'గారు చాలా సినిమాల్లో నటించారు కదా? ఆయన చేసిన అన్ని పాత్రలు ఇందులో చూపించారా?
- యన్‌.టి.ఆర్‌గారు 300కి పైగా చిత్రాల్లో నటించారు. అన్నింటిని రిఫరెన్స్‌ తీసుకోవడం కష్టం కనుక సంఘటనల ఆధారంగా చేసుకొని చాలా పాత్రలు చూపించే ప్రయత్నం చేశాం.

బయోపిక్‌ చిత్రాలకు మాటలు రాయడం సౌలభ్యంగా అన్పిస్తుందా?
- నేను మాటలను చాలా ఇష్టపడి రాస్తాను కాబట్టి నాకెప్పుడూ కష్టం అన్పించదు. బయోపిక్స్‌లో వారి జీవితాల్లోకి వెళ్ళి, వారి మనసుల్లోని భావాలను అర్థం చేసుకొని రాయడమనేది అద్భుతమైన ఫీల్‌. డైలాగులు రాయడమంటే తపస్సు చేస్తున్నట్లే అని నేను భావిస్తా.

కమిట్‌ అయిన చిత్రాలు?
- చిరంజీవిగారి 'సైరా' సినిమా షూటింగ్‌ జరుగుతోంది. 'ఆర్‌ ఆర్‌ ఆర్‌'కి కూడా డైలాగ్స్‌ రాస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved