మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ నాయికలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్రవరి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సీరత్ కపూర్‌తో ఇంటర్వ్యూ...
* `టచ్ చేసి చూడు` గురించి చెప్పండి?
- `టచ్ చేసి చూడు` అనే పదాలకు ఉన్నది ఉన్నట్టు అర్థం తీసుకోకండి. `టచ్ చేసి చూడు` అంటే టచ్ చేసి చూడడం కాదు. కాకపోతే మనసులను తాకడం అని అర్థం.
* మీ పాత్ర గురించి చెప్పండి?
- చాలా వైవిధ్యంగా ఉంటుందండీ. మామూలుగా చూసే రొటీన్ పాత్రల్లాగా అనిపించదు.
* అంటే.. ఏ విధంగా?
- అబ్బాయిలను డామినేట్ చేసే పాత్రన్నమాట. మామూలుగా మనం అమ్మాయిలను డామినేట్ చేసే అబ్బాయిల పాత్రలను చూస్తుంటాం కదా. ఇది దానికి వేరుగా అన్నమాట. మనసులో ఏం ఉంటే అది చేసుకుంటూ వెళ్లే అమ్మాయిగా నటించాను. ఎక్కడా ఇబ్బందిపడలేదు. రవితేజగారు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. . మామూలుగా ఖాకీని చూడగానే ఎవరికైనా భయం ఉంటుంది కదా. కానీ నాకు అలాంటి భయాలేమీ ఉండవు. సినిమా మొత్తం సీన్లు చాలా బావుంటాయి.
* మీ కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ని ఎలా తీసకుంటారు?
- ఈ ఏడాది చాలా బావుంది నాకు. . రన్‌రాజా రన్ కూడా పెద్ద హిట్ సినిమానే కదా. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు కురిసే సినిమాలు చేయాలి అని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఫలితాలు తారుమారవుతుంటాయి. అంత మాత్రానికే నేను ఇబ్బందిపడను. కాకపోతే నేను నటించే ప్రతి సినిమానూ, ప్రతి పాత్రనూ మంచి ఎక్స్ పీరియన్స్ అని అనుకుంటాను. ఆ పాత్రల వల్ల ఎంతోమంది అనుభవజ్ఞులను కలిశానని అనుకుంటాను. అంతే కానీ జయాపజయాలగురించి నేను పట్టించుకోను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా. రాజుగారిగది2 నుంచి టచ్ చేసి చూడు వరకు ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ చాలా బావుంది. ఇలాంటి సినిమాలు కదా నేను చేయాల్సింది అని కూడా అనిపిస్తోంది.
* ఇద్దరు హీరోయిన్లున్న ఈ సినిమాలో చేయడం ఎలా అనిపించింది?
- ఇద్దరికీ ప్రాధాన్యత ఉంటుంది. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అన్నట్టు ఏమీ ఉండదు. టచ్ చేసి చూడు అనే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా సాగుతుంది. సెకండ్ లీడ్ తరహా పాత్ర కాదు. రవితేజగారితో ఇంత త్వరగా పనిచేయాల్సి రావడం చాలా ఆనందంగా ఉంది. సోలో లీడ్ ఉన్న సినిమాలు చేయడానికే మొగ్గుచూపుతాను. నిజంగా నా పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే నేను చేయను.
* ఈ సినిమాలో మీకు ఎన్ని పాటలు ఉంటాయి?
- ఒక పాట ఉంటుంది. మాస్ సాంగ్. ఇంకా విడుదల కాలేదు. టాలీవుడ్‌లో నేను చేసిన తొలి మాస్ సాంగ్ అది. ఆ పాటకు షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. పాట చాలా బాగా వచ్చింది. పాటను విడుదల చేయగానే నేను తప్పకుండా షేర్ చేస్తాను.
* రవితేజగారితో పనిచేయడం ఎలా అనిపించింది?
- ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. కొత్త విషయాలకోసం పరుగులు తీస్తారు. ఇన్నేళ్లు సినిమా పరిశ్రమలో ఉన్నామన్న అహంకారం, రిలాక్స్డ్ గా ఉండటం.. ఆయనకు తెలియదు. ఆయన సెట్లోకి వస్తే సెట్‌కి జీవకళ ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. తనతో పనిచేసే ఆర్టిస్టులతో చాలా కో ఆపరేటివ్‌గా ఉంటారు. చాలా పాజిటివ్‌గా ప్రవర్తిస్తారు. సీన్ బెటర్‌బెంట్ కోసం కూడా కో ఆర్టిస్టులతో మాట్లాడుతారు. ఎదుటివారిని గౌరవించడం తెలిసిన వ్యక్తి. స్క్రీన్ మీద ఆయన లో కనిపించే ఎనర్జీ కేవలం కెమెరా ముందు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. కెమెరా వెనుక కూడా ఆయన అంతే ఎనర్జీతో ఉంటారు. నటిగా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా.
* మామూలుగా రవితేజ సినిమాల్లో ఆయన హీరోయిన్లలను టీజ్ చేస్తుంటారు. కానీ ఇందులో మీరు ఆయన్ని టీజ్ చేశారన్నమాట..?
- నిజంగా చెప్పాలంటే అలాంటిదే. కానీ ఈ పాత్రను చేయడానికి ముందు కాస్త నెర్వస్‌గానే ఫీలయ్యాను. కానీ రవితేజగారు తన కో ఆర్టిస్ట్ కి ఇచ్చే ప్లేస్‌ని చూసి కాసింత భయం తగ్గింది. సినిమా చాలా బాగా వచ్చింది.
interview gallery
* మీరు రియల్‌లైఫ్‌లో కూడా డామినేటింగ్గా ఉంటారా?
- లేదండీ. ఉన్నదున్నటి మాట్లాడుతాను కానీ, ఈ సినిమాలోని పాత్రలా అంత గట్టిగా మాట్లాడేరకాన్ని కాదు.
* ఇప్పటికే తెలుగు తెరమీద చాలా పోలీస్ స్టోరీలు వచ్చాయి.. వాటిలో ఈ సినిమా ఎలా వైవిధ్యంగా ఉండబోతోంది?
- ఈ సినిమాలో రవితేజగారు పోలీస్‌గా చేశారు. థియేటర్లకు వచ్చే మాస్ జనాలకు ఇట్టే కనెక్ట్ అవుతారు. సినిమా ఎగ్జిక్యూషన్‌లోనూ, డైలాగుల్లోనూ, విజువల్ గానూ సినిమా గొప్పగా ఉంటుంది. తప్పకుండా రీచ్ అవుతుంది.
* ఏమైనా సోషల్ మెసేజస్ ఉన్నాయా?
- నిజంగా చెప్పాలంటే నేను ఇంకా సినిమా చూడలేదు. చూడాలి. ట్రైలర్స్, టీజర్స్ బట్టి పోలీస్ ఆఫీసర్ గట్స్ ని చెప్పే సినిమా అవుతుందని చెప్పొచ్చు.
*మీ పాత్ర ఫస్టాఫ్‌లో ఉంటుందా? సెకండాఫ్‌లో ఉంటుందా?
- నా రోల్ సెకండాఫ్‌లో ఎంటర్ అవుతుంది. రాశిఖన్నా రోల్ ఫస్టాఫ్‌లో ఉంటుంది. నేను ఎడిట్ తర్వాత సినిమా ఇంకా చూడలేదు. నాకు, రాశికి మధ్య సన్నివేశాలు లేవు. ఇద్దరి ప్లాట్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి.
*కథను ఎంచుకునేటప్పుడు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
- కచ్చితంగా మంచి కథ, కథలో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉందని ఆలోచిస్తాను. కేవలం నా పాత్ర గ్లామర్‌కే పరిమితం కావాలని అనుకోను.
*తదుపరి చిత్రాలు?
- రానాతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధుతో ఓ సినిమా చేస్తున్నా. దీనికి రవికాంత్ పేరెపు దర్శకుడు. మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాను. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.