5 July 2018
Hyderabad
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వారాహి చలనచిత్రం పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'విజేత'. రజని కొర్రపాటి నిర్మాత. ఈ సినిమా జూలై 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె. సెంథిల్‌కుమార్‌తో ఇంటర్వూ...
'విజేత'లో పార్ట్ అయ్యానలా...
- సంక్రాంతికి నేను రాజమౌళిగారి ఫామ్‌హౌస్‌కి వెళ్లాను. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సాయికొర్రపాటిగారు 'ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారండీ!' అన్నారు. నేను 'ఎదైనా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ ఉంటే చేయాలనుకుంటున్నాను సార్' అన్నాను. 'అదేంటి బాహుబలి అంత పెద్ద సినిమా తర్వాత కూడా వెయిట్ చేస్తున్నారు' అని సాయిగారు అన్నారు. 'మంచి ప్రాజెక్ట్ చేయాలండీ' అని నేను అన్నాను. అప్పుడాయన 'ఓ కొత్త దర్శకుడు నాకొక కథ చెప్పాడు. కథ చాలా బావుంది. సెన్సిబుల్, ఎమోషనల్ కథ.. వినండి.. నచ్చితే చేయండి' అని సాయిగారు అన్నారు. రాకేశ్‌గారు వచ్చి కథ చెప్పారు. అందులో అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. రియాలిటీకి దగ్గరగా.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. తండ్రికొడుకుల మధ్య నడిచే సినిమా. మధ్య తరగతి కుర్రాడి కథ. మన జీవితంలో మనకు కావాల్సిన విషయాలు సిచ్యువేషన్స్‌ను బట్టి మారుతుంటాయి. దర్శకుడు రాకేశ్ సన్నివేశాలను చాలా కొత్తగా మలిచారు. నేను ఐతే నుండి ఈగ, మగధీర, బాహుబలి వంటి సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేశాను. ఆ చిత్రాల్లాగానే నాకు మంచి పేరు తెచ్చే చిత్రంగా విజేత నిలుస్తుంది.
నచ్చితేనే చేస్తాను...
- అన్ని సినిమాలు పేరు కోసమే చేయలేం. ఉదాహరణకు నేను గోల్కొండ హైస్కూల్ సినిమా చేసేటప్పుడు నాకేదో గొప్ప పేరు వచ్చేస్తుందని చేయలేదు. నేను ఇష్టపడే ఆటల్లో క్రికెట్ ఒకటి. కాబట్టి ఆ సినిమా చేశాను. నా హృదయానికి నచ్చడంతో చేశాను. అలాగే విజేత కూడా నాకు నచ్చడం వల్లే చేశాను.
ప్రతిదీ చాలెంజింగ్...
- ప్రతి సినిమా చాలెంజింగ్‌గానే ఉంటుంది. బాహుబలి సినిమా చేసేటప్పుడు ఆ సినిమా స్థాయిలో చాలెంజింగ్‌గా అనిపించింది. చిన్న సినిమాలు చేసేటప్పుడు ఆ స్థాయిలో చాలెంజింగ్ అంశాలుంటాయి. అది దర్శకుడి విజన్ నుండి కావచ్చు.. నిర్మాత వైపు నుండి కావచ్చు. ఈ సినిమా చేస్తున్న సమయంలో నా కెరీర్ బిగినింగ్‌లో చేసిన ఐతే వంటి సినిమా గుర్తుకు వచ్చింది. బాహుబలి తర్వాత మరో గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌గానే భావించాను. ఏ సినిమా అయినా నేను చేయొచ్చు అనే నమ్మకాన్ని నాలో కలిగింది.
హీరో కల్యాణ్‌దేవ్ గురించి...
- కల్యాణ్‌దేవ్‌లో నటుడిగా చాలా పరిణితిని గమనించాను. తొలిరోజున అతను షూటింగ్ వాతావరణాన్ని కంఫర్ట్‌గా ఫీల్ అయినట్లు అనిపించలేదు. రాను రాను తను సెట్ అయిపోయాడు. కోడి సాంగ్‌ను చివరలో చిత్రీకరించాం. ఆ సమయానికి తనలో కంఫర్ట్ లెవల్స్ బాగా పెరిగాయి. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పుడు ఆయన గొప్ప నటుడు కాకపోచ్చు కానీ... భవిష్యత్‌లో మంచి నటుడు అనే పేరుని సంపాదించుకుంటాడు. ఎందుకంటే నటనలో తను తీసుకునే జాగ్రత్తలు అలా ఉంటాయి. తను ఏదైనా త్వరగా నేర్చేసుకుంటాడు.
దర్శకుడు రాకేశ్ శశి గురించి...
- రాకేశ్ శశికి తను ఏం చేయాలనుకుంటున్నాడనే దాని పట్ల క్లారిటీ ఉంటుంది. దాని వల్లే తను సులభంగా హ్యాండిల్ చేయగలిగాడు. ప్రతి డైరెక్టర్ యూనిక్. ఆ సినిమాకే తనే కెప్టెన్. ప్రతి డైరెక్టర్ తన స్టయిల్‌లో కథను చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఓ కెమెరామెన్‌గా నా స్వంత స్టయిల్లో కాకుండా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని తెరపై చూపెడితే చాలని అనుకుంటాను.
బాలీవుడ్ అవకాశాలు కూడా...
- బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయి. దఢక్ సినిమా చేయమని అన్నారు. అలాగే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుండి అవకాశాలు వచ్చాయి. అయితే నేను ఎదురు చూసే కథలు నాకు రావడం లేదని అనిపించింది. దాంతో నేను అటు వైపు వెళ్లలేదు. బాహుబలి తర్వాత హిందీలో తప్పకుండా సినిమాలు చేయాలనే ఆసక్తి తగ్గింది. ఎందుకంటే వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మనమే సినిమాలు చేస్తున్నాం. అలాగని హిందీ సినిమాలు చేయనని కాదు.. నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను.
తెలుగు సినిమాలకు గోల్డెన్ ఎరా..
- ఇప్పుడు తెలుగు సినిమాలకు సువర్ణాధ్యాయం నడుస్తుంది. బాహుబలి, ఘాజీ, రంగస్థలం, అర్జున్ రెడ్డి, గరుడు వేగ, మహానటి.. ఇలా వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా కొత్తదనం ఉన్న సినిమాలను చూస్తున్నారు. దాంతో ఫిలిమ్ మేకర్స్ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే రోజు తప్పకుండా వస్తుంది.
నేను డైరెక్టర్ అవుతాను...
- ప్రతి ఒక టెక్నీషియన్‌కి డైరెక్టర్ కావాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఏ టెక్నీషియన్ అయినా డైరెక్టర్ చెప్పే కథకు తమ వంతు సహకారాన్ని మాత్రమే అందిస్తారు. మరి అలాంటి పై స్థానంలోని డైరెక్టర్ కాకూడదని ఎవరు అనుకోరు కదా.. కాబట్టి నేను డైరెక్టర్ అవుతాను. కానీ ఎప్పుడు అవుతానో ఇప్పుడే చెప్పలేను. వెంటనే డైరెక్షన్ చేసేయాలని ఆశ లేదు.