రవితేజ హీరోగా నటించిన చిత్రం `అమర్ అక్బర్ ఆంటోని`. శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఈ చిత్రం గురించి శ్రీనువైట్ల మంగళవారం విలేకరులతో చాలా విషయాలను చెప్పుకొచ్చారు. ఆ విశేషాల సమాహారం ఇది...
* నాకు `అమర్ అక్బర్ ఆంటోనీ` మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నేను చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాను.
* మామూలుగా ఎవరైనా మిస్టేక్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. అలా నేర్చుకోవడం నాకూ అవసరం. లేకపోతే అక్కడే ఉంటాం. నేను ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంలో రియలైజ్ అయ్యాను. అందుకే పీక్స్ లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో.. అలాగే చేశా. అంతకు మించి పనిచేశా.
* ఈ సినిమా మొత్తం యు.ఎస్.లో జరుగుతుంది. అందుకే నేను, రవితేజ కాంబినేషన్‌లో సినిమాను మొదలుపెడుతున్నామని చెప్పగానే నాకు ఐదుగురు నిర్మాతలు వచ్చారు. వారిలో నేను మైత్రీ మూవీస్‌కి పనిచేశా.
* ఈ సినిమాకు బాగా ఖర్చయింది. స్నో ఫాలింగ్ సమయంలో, సమ్మర్‌లో రెండు బంచ్‌లకింద ఈ సినిమా చేశాం. అయితే నిర్మాతలు వారు పెట్టిన ఖర్చుకు తగ్గ ఔట్‌పుట్ వచ్చిందని ఆనందంతో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
* కథకు తగ్గ టైటిల్ అమర్ అక్బర్ ఆంటోనీ. ఒకరోజు ఏదో ఆలోచిస్తూ పడుకుంటే రాత్రి 11కి ఈ టైటిల్ నచ్చింది. వెంటనే రవితేజకు ఫోన్ చేశా. తను అమితాబ్‌కి పెద్ద ఫ్యాన్. వినగానే టైటిల్ ఓకే అన్నాడు. నాక్కూడా ఇదే పర్ఫెక్ట్ అనిపించింది.
* నేనెప్పుడూ సినిమాల్లో పనికోసమే ఆరాటపడ్డా. నేను చేస్తున్న సినిమా చిన్నదా, పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించలేదు. నా తొలి సినిమా రూ.38లక్షల్లో చేశా. ఆ తర్వాత అలా చేస్తూ చేస్తూ ఒక స్థాయికి వచ్చాను. ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఫ్లాష్‌లాగా ఆలోచన వస్తే నేను చిన్న బడ్జెట్ చిత్రాన్ని చేయడానికి వెనకాడను.
* నేనెప్పుడూ కీర్తి కోసం పాకులాడలేదు. నేను లోలో ఉన్నప్పుడు కూడా అందుకే పెద్దగా బాధపడింది లేదు. ఇప్పటిదాకా నేనెవరినీ వెళ్లి సినిమాలు ఇవ్వమని అడగలేదు. కుదిరినప్పుడే చేశాను.
* రవితేజ, నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. నేను లోలో ఉన్న ప్రతిసారీ తను నాకు ట్రబుల్ షూటర్ అయ్యాడు. నేను తనని హీరోగా, తను నన్ను దర్శకుడిగా ఎప్పుడూ చూడలేదు. మేమిద్దరం కలిస్తే అల్లరిగా ఉంటుంది.
interview gallery
* ఇందులో లయగారి పాప యాక్ట్ చేశారు. పాపకు తల్లిగా ఇంకెవరినైనా చూద్దామని అనుకుంటున్నప్పుడు మేమే లయగారిని చేయమని అడిగాం. ఆమె.. లేదండీ మేం చేయడం లేదు.. అని అన్నారు. ఎలాగూ, పాపతో మీకు కన్వీనియెంట్గా ఉంటుందని అడిగితే సరేనన్నారు. ఆమెతో పాటు నటి అభిరామి కూడా చేశారు.
* జెన్నిఫర్ లోపెస్ మేన్షన్ చాలా బావుంటుంది. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఇల్లు అది. యు.ఎస్.లో అలాంటి మేన్షన్‌లు చాలా అరుదుగా ఉంటాయి. దాన్ని మన తెలుగు వ్యక్తి మల్లారెడ్డి కొన్నారట. నన్ను మామూలుగా తీసుకెళ్లి చూపించారు. నాకు నచ్చింది. ఇక షూటింగ్ జరిగినన్ని రోజులు మేం అక్కడే ఉన్నాం.
* సునీల్‌ది ఇందులో చాలా మంచి పాత్ర. ఎంత బావుంటుందంటే అప్పుడెప్పుడో పాత సినిమాల్లో సునీల్‌ని చూసినంత ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
* నాయిక ఇలియానా డబ్బింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ పాత్రను రాసుకున్నప్పుడు హీరోగా రవితేజ, హీరోయిన్‌గా ఇలియానా అని అనుకునే రాసుకున్నా. అయితే ఇలియానా తెలుగు సినిమాలు చేయడం లేదని మైత్రీ మూవీస్ వారు అన్నారు. కానీ మళ్లీ అప్రోచ్ అయితే ఆమె ఒప్పుకున్నారు.
* నాకు సినిమాలు తప్ప ఇంకేమీ తెలియదు. ఎప్పుడూ సినిమాలు చూస్తుంటా. బాహుబలి, దంగల్ ఇవన్నీ నచ్చాయి.
* నాకు హిందీలో సినిమా చేయాలని ఉంది. ఇంతకు ముందు రెండు సార్లు చేయాల్సింది. కానీ ఎందుకో కుదరలేదు. అయితే అమర్ అక్బర్ ఆంటనీ రైట్స్ ని ఈ సారి నా దగ్గరే ఉంచుకున్నా. చూడాలి.
* నాలాంటి దర్శకులకు బ్రాండ్ అనేది వరమూ, శాపమూ. రెండూ. మంచి బ్రాండ్‌ని నిలబెట్టుకోవడానికి ఆ దిశగా చాలా కృషి చేయాలి. నేను ఇప్పుడు ఆ పనుల్లోనే ఉన్నా. తప్పకుండా మంచి కృషి చేస్తా.
* ప్రస్తుతానికి నా దగ్గర అన్నీ లైన్లలోనే ఉన్నాయి. మంచి కథ కుదిరినప్పుడు ఇంకో సినిమా గురించి అనౌన్స్ చేస్తా. తొందరేమీ లేదు.