![](../../images5/suriya-gang.jpg)
04 January 2018
Hyderabad
`గ్యాంగ్` సినిమాలో ప్రేక్షకులకు నేను కొత్తగా కనిపిస్తాను - హీరో సూర్య
సూర్య, కీర్తిసురేష్ జంటగా నటించిన చిత్రం 'గ్యాంగ్'. తమిళ చిత్రం 'తానా సెంద కూట్టమ్'ను యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగులో 'గ్యాంగ్' పేరుతో జనవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య పాత్రికేయులతో సినిమా గురించిన విశేషాలను తెలియజేస్తూ...
పాత రోజులు గుర్తుకొచ్చాయి..
ఏ ప్రొఫెషన్‌లో అయినా ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాం. దాని వల్ల కొంత పరిణితి సంపాదిస్తాం. మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటాం. మరొకరి దారిని మనం ఫాలో కాకూడదని మనం అనుకుంటాం. అలా నాకు ఓ పరిణితితో కూడిన ప్రయాణం కొనసాగింది. ఈ సినిమా విషయానికి వస్తే..20 ఏళ్ల సినీ జర్నీ తర్వాత..డైరెక్టర్ కథను రాసుకన్న విధానం, నెరేట్ చేసిన పద్ధతి నచ్చి గ్యాంగ్ సినిమా చేశాను. 'గ్యాంగ్' సినిమాలో నటించడం వల్ల నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ మధ్యలో ఇలాంటి పాత్రను నేనెప్పుడూ చేయలేదు. అయితే కెరీర్ ప్రారంభంలో ఇలాంటి పాత్రలు చేశాను. ఈ సినిమా చేయడం వల్ల పదేళ్లు వయసు తగ్గినట్టు అనిపించింది. విఘ్నేశ్ కథను చెప్పినప్పుడు ఓ ఫ్రెష్‌నెస్‌ను ఫీలయ్యాను. చాలా మంది యువ దర్శకులు విఘ్నేశ్ సన్నివేశాలరచన, స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుందని చెప్పారు. విఘ్నేశ్ దర్శకుడే కాదు...డ్రమ్స్ వాయిస్తాడు, పాటలు రాస్తుంటాడు.
రీమేక్ సినిమానే కానీ..
- బాలీవుడ్ సినిమా 'స్పెషల్ 26' కు రీమేక్ సినిమా 'గ్యాంగ్'. రెండు, మూడు సన్నివేశాలు మాతృకలో ఉన్నట్లే ఉన్నాయి. మిగిలిన సినిమా విఘ్నేశ్ తనదైన శైలిలో కొత్త కథను చెప్పడానికి ప్రయత్నించాడు. చాలా క్యారెక్టర్స్, ఎమోషన్స్, బ్యాక్‌గ్రౌండ్, కారణాలు ఈ సినిమాలో మనకు కనపడతాయి. 1987 బ్యాక్‌డ్రాప్ అనగానే నాకు బాలచందర్‌గారి సినిమాలు, కమల్‌హాసన్ నటించిన సత్య సినిమాలతో నేను కనెక్ట్ అయ్యాను.
నిజ ఘటన ఆధారంగా...
- 1980 దశకంలో నిరుద్యోగం అనేది పెద్ద సమస్యగా ఉండేది. దాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. నేను నా కెరీర్‌ను 1987లో ప్రారంభించడం వల్ల ఈ బ్యాక్‌డ్రాప్‌కు కనెక్ట్ అయ్యాను. నా పాత రోజులకు వెళ్లినట్లుగా నాకు అనిపించింది. ఈ మధ్య లార్జర్ దేన్ లైఫ్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చాను. కానీ ఈ సినిమా రియాలిటీకి దగ్గరగా ఉందనిపించింది. 1980 దశకంలో జరిగిన నిజమైన ఘటన ఓపెరా రొబరి ఆధారంగానే కథను తయారు చేశాడు దర్శకుడు విఘ్నేశ్.
మంచి టీంతో కుదిరింది..
- సినిమాకు అద్భుతమైన టీమ్ కుదిరింది. సీనియర్ నటులు కార్తీక్, రమ్యకృష్ణగారు, సెంధిల్ తదితరుల నటనతో పాటు అనిరుధ్ మ్యూజిక్, దినేశ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అయ్యాయి.
డబ్బింగ్ చెప్పడానికి కారణమదే..
- ఈ సినిమా కోసం నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ఇండియాలోని భాషలన్నింటిలో తెలుగు చాలా మధురమైన భాష అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను. నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు నాకు ఆ విషయం అవగతమైంది. తమిళ డబ్బింగ్‌ను ఎనిమిది రోజుల్లో చెబితే..తెలుగు డబ్బింగ్‌ను ఆరు రోజుల్లో చెప్పేశాను. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ విషయంలో ఎంతో సహకారం అందించారు. ఈ సినిమాలో నా ఉచ్చారణలో తమిళ స్లాంగ్ ఎక్కడైనా వినపడొచ్చు. కానీ భవిష్యత్తులో కచ్చితమైన తెలుగులోనే డబ్బింగ్ చెబుతాను. సాధారణంగా శ్రీనివాసమూర్తిగారు గతంలో నా చిత్రాలకు డబ్బింగ్ చెప్పేవారు. ఇది వరకు సినిమాల్లోని నా పాత్రలు చాలా ఎగ్రెసివ్‌గా ఉండటం వల్ల ఆయనే ఎక్కువగా డబ్బింగ్ చెప్పారు. 'గ్యాంగ్' విషయానికి వస్తే..పాత్ర చాలా జోవియల్‌గా సాగుతుంది..వాయిస్ అగ్రెసివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనే డబ్బింగ్ చెప్పాను. సూర్య సన్నాఫ్ కృష్ణన్‌లో నేను యంగర్ వాయిస్ కావాల్సి రావడంతో అప్పుడు కూడా శ్రీనివాస్ మూర్తిగారికి బదులుగా శశాంక్ డబ్బింగ్ చెప్పారు. 'గ్యాంగ్' టీజర్‌లో నేను చెప్పిన వాయిస్ బావుందని ఫీడ్ బ్యాక్ కూడా రావడంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చి డబ్బింగ్ చెప్పాను.
నా మూలాలను మరచిపోలేదు..
- వైజాగ్, హైదరాబాద్, కారైకూడి, చెన్నై సహా సినిమాను డిఫరెంట్ లోకేషన్స్‌లో షూట్ చేశాం. మేమేదో గొప్ప సినిమా చేశామని చెప్పను కానీ..20 ఏళ్ల తర్వాత నా మూలాల్లోకి వెళ్లి చేసిన భావన కలిగింది. అందువల్ల నాకు కొత్తగా అనిపించింది..రేపు సినిమా చూసే ఆడియెన్స్‌కు సూర్య కొత్తగా కనపడ్డాడే అనిపిస్తుంది. మూలాలకు వెళ్లి చేశానని చెప్పడానికి కారణం నేను నా మూలాలను మరచిపోలేదు. సినిమాల్లోకి రాక మునుపు ఒక ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేశాను. నా తొలి సంపాదన ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు. బస్సులోనే ప్రయాణించేవాడిని. అలా నా తల్లిదండ్రులు నన్ను సాధారణంగానే పెంచారు. కాబట్టి నా మూలాలను నేను మరచిపోలేదు.
తమిళనాడు రాజకీయాల గురించి..
- రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు ఇద్దరూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి వచ్చారు. వీరి చుట్టూ చాలా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలున్నప్పటికీ రీసెంట్‌గా మలేషియాలో జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావడం, రాణించడం అంత సులభం కాదు. ఎలక్షన్స్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.
తదుపరిచిత్రాలు..
- సెల్వరాఘవన్‌గారి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అలాగే కె.వి.ఆనంద్‌గారి దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. హరిగారి దర్శకత్వంలో రెండేళ్లకు ఒక సినిమా చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే చేయడం లేదు. తదుపరి ఆయనతో చేయబోయే సినిమా సింగం సీక్వెల్ మాత్రం చేయడం లేదు.