4 October 2018
Hyderabad
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం `అరవింద సమేత` మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 11న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ...
* వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందాండీ?
- ఎస్.. పూర్తిగా కంప్లీట్ అయ్యింది.
* ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం తర్వాత.. షూటింగ్‌కు రమ్మడం...?
- నిజానికిమేం సినిమా రిలీజ్ ఫిక్స్ కాలేదు. ఆగస్ట్ 29 తర్వాత సినిమాను సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని అనుకున్నాం. జనవరిలో వేరే సినిమాలు ఉండటం వల్ల మార్చిలో సినిమాను విడుదల చేయాలని నేను, చినబాబుగారు ఫిక్స్ అయిపోయాం. కానీ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం జరిగిన రోజు ఆయనతోనే ఉన్నాం. ఆయన అప్పుడేం మాట్లాడలేదు కానీ.. రెండో రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌గారే ఫోన్ చేశారు. 'ఎట్టి పరిస్థితుల్లో మనం అక్టోబర్ 11కే వస్తున్నాం. ఈ విషయాన్ని చినబాబుగారికి కూడా చెప్పండి' అని అన్నారు. 'ఇప్పుడేం పరావాలేదు.. పదిరోజుల తర్వాత మాట్లాడుకుందాం' అని అన్నాను. 'పదిరోజులా! అంత లేదు.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది.. పూజా కూడా ఇక్కడే స్టే చేస్తుంది. మూడు రోజుల వరకు నేను బయటకు రాకూడదు' అన్నారు. నాలుగో రోజు ఆయన సెట్‌కు వచ్చారు.
* రాయలసీమ నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలమైంది.. మిమ్మల్ని ఈ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథ రాసుకోడానికి ఎగ్జయిట్ చేసిన అంశాలేంటి?
- నిజానికి ముందు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామని అనుకోలేదు. రెండు మూడు ఐడియాలు గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది. ఒక గొడవ జరిగే ముందు.. గొడవ జరిగే సమయంలో విషయాలు గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే అది చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. గొడవ అయిపోయిన తర్వాత మనం పెద్దగా పట్టించుకోం. కానీ గొడవ తర్వాత సర్దాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు భారతంలో యుద్ధ పర్వం తర్వాత.. మిగతా పర్వాలను పెద్దగా ఎవరూ చదవం. పురాణాలను చెప్పేవాళ్లు కూడా ఆ విషయాను పెద్దగా వర్ణించరు. అందుకు కారణం అంత బాధకరమైన అంశాలను జనాలకు చెప్పకూడదనే. అంత బాధాకరమైన విషయాలను చెబితే జీవితంపైనే ఉన్న ఆసక్తి పోతుంది. అందుకనే ఆ విషయాలను ఎవరూ టచ్ చేయరు. ఘటన జరగడానికి ముందు.. తర్వాత యాక్షన్ మిక్స్ అవడంతో ఎమోషన్స్‌కు మనం కనెక్ట్ అవుతాం. ఇంతకు ముందు సక్సెస్ అయిన ఫ్యాక్షన్ సినిమాలను గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. పోయినవాళ్ల ఫ్యామిలీలు.. ఉన్నవాళ్ల ఫ్యామిలీల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.. కచ్చితంగా కొత్త యాంగిల్ అవుతుందనిపించింది. ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. గొడవల్లో ఇప్పటి వరకు ఆడవాళ్లను ఎవరూ ఇన్‌వాల్వ్ చేయలేదు. ఎందుకనో మనం ఇంట్లో ఆడవాళ్లను పెద్దగా పట్టించుకోం. అలా కాకుండా వాళ్లని కన్‌సిడర్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను కథగా రాసుకుని ఎన్టీఆర్‌కు చెప్పాను. తనకు బేసిక్‌గా ఈ ఆలోచన నచ్చింది.
* హెవీ ఎమోషన్స్‌ను ఆడియెన్స్ తీసుకుంటారా?
- ఏదైనా హెవీగా ఉన్నా కూడా ఆడియెన్స్‌కు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తప్పించుకోవడానికి ఇష్టపడటం లేదు. ఉదాహరణకు ప్రథమ సాహిత్యమైనా, కావ్యసాహిత్యమైనా ఒక మంగళంతో మొదలై.. మంగళం మధ్యలో జరిగి.. మంగళంతో పూర్తి కావాలి. కానీ ఇప్పుడు సమాజంలో మంగళం ఎక్కడ ఉంది. టీవీ చూస్తే.. అమంగళం వింటూనే ఉన్నాం. ఇలాంటి అమంగళం సమయంలోనే మనుషులు తెలియకుండా బలంగా తయారైయ్యారు. ఇది వరకటి కంటే రాటు దేలారు. ఇది వరకు మన సాహిత్యాలను చూస్తే మన ముఖ్య అంశం రొమాన్స్ మాత్రమే ఉండేది. అందుకు కారణం అప్పటి మనుషులు మంచి ఉన్నతంగా జీవించి ఉంటారు. అందుకనే రొమాన్స్ గురించే మాట్లాడి ఉండొచ్చు. ఇక షేక్‌స్పియర్ సమయంలో ట్రాజెడీ గురించి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో జనాలపై అంతటి అప్రెషన్ ఉండేది. ఆ రాచరికం పెయిన్‌ను నాటకంగా చూసుకుని చప్పట్లు కొట్టారు. రెండో వరల్డ్‌వార్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఫైనాన్స్ క్రైసిస్ లేకుండానో.. ఆర్మీ లేకుండానో.. ఓ వికంలాగుని పాత్రధారి లేకుండానో సినిమాలు లేవు. సలీమ్ జావేద్ టైమ్‌లో విపరీతమైన నిరుద్యోగం రాజ్యమేలుతున్న రోజులవి. అందుకనే మనకు ఓ యాంగ్రీ యంగ్‌మేన్ కావాల్సి వచ్చింది. ఇలా టైమ్‌ను బట్టి ఎమోషన్స్ మారుతుంటాయి. కాబట్టి ఈ సందర్భంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడటం నాకు కరెక్టే అనిపించింది.
* అత్తారింటికి దారేది క్లైమాక్స్ తర్వాత ఎమోషనల్ కంటెంట్ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరిగిందా?
- నేను ఫ్రాంక్‌గా చెప్పాలంటే అలా అనుకోను. నాకు అంత గుర్తుండవు. నేను సినిమా తీస్తున్నప్పుడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా. ఒకసారి మిక్సింగ్ అయిన తర్వాత ఏదీ గుర్తుండదు. 29వ తారీఖు మద్యాహ్నం తర్వాత తీశాం.. వంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటా. అప్పుడది అవసరం. ఒక్కసారి మిక్సింగ్ కాగానే ఇక అవసరం ఉండదనుకుంటానేమో... నాకేమీ గుర్తుండవు.
* పెనిమిటి సాంగ్ ను పెట్టాలని ఎందుకనిపించింది?
- ఐడియా స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎగ్జయిట్ చేసిన ఐడియా అది. ముందు అందరిలాగానే హీరోయిజమ్ ఉండాలని మొదలుపెడతాం. ముందు హీరోయిజమ్, హీరోని ఎలా ఇంప్రెస్ చేయాలని ఆలోచిస్తాం. ఆ తర్వాత ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన కొన్నిసార్లు మంచిదవుతుంది. కొన్నిసార్లు చెడ్డదవుతుంది. కొన్నిసార్లు ఎలాంటి టర్న్ తీసుకోకుండా ఫ్లాట్‌గా ఉంటుంది. అందువల్ల ఈ సారి ఈ టర్న్ కుదిరింది. ఆ యాంగిల్ మీద పెద్ద వెయిట్ వేయకుండా చేశాం.
* కోబలి రిసంబలెన్స్ ఉంటుందా?
- అలాంటిది ఏమీ లేదండీ. దాన్ని పూర్తి రాగా, పాటలు లేకుండా, ప్యారలల్‌గా చేద్దామని అనుకుంటున్నాం.
* ఆ సినిమాకు చేసిన రీసెర్చి ఈ సినిమాకు ఏమైనా ఉపయోగపడిందా?
- అప్పట్లో నేను కొంతమంది రాయలసీమ కవులను కలిశాను. తిరుమల రామచంద్రగారి సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. నాకు భరణిగారు హంపి నుంచి హరప్పా దాకా ఉందని ఇచ్చారు. అక్కడ లాంగ్వేజ్, పడికట్టు ఏది తెలియాలన్నా ఇది చదివితే చాలని చెప్పారు. నేను అప్పటికే నామిని సాహిత్యానికి పెద్ద ఫ్యాన్‌ని. కాకపోతే ఆయన తాలూకు చిత్తూరు జిల్లా భాగం. అక్కడ కరువు ప్రాంతం. అక్కడ ఫ్యాక్షన్, కక్షలు, కార్పణ్యాలు లేవు. నాకు కడప, అనంతపూరు ఏరియాల్లో.. ఫ్యాక్షన్ ఉంది. ఇక్కడున్న కరువు ఫోర్స్డ్ కరువు. పాలెగాడు చరిత్రలుగానీ, వేటపాలెం లైబ్రరీలో జరిగిన కొన్నిగానీ చేశాం. పెనిమిటి పాట కూడా ప్రాసెస్‌లో ఉంది కాబట్టి కుదిరింది. అందరి ఆడవాళ్లకీ హీరో మదర్‌ని సింబలైజ్ చేశాం. నేను చెప్పగానే అందరికీ నచ్చిన కాన్సెప్ట్ ఇది. 60 పర్సెంట్ అందులో మాంటేజెస్ ఉంటాయి. 40 పర్సెంట్ ఎన్టీఆర్ పాడుతున్నట్టు ఉంటుంది. ప్రమోలో చూసినవన్నీ ఆయన పాడినవే ఉన్నాయి.
* యాక్షన్ సినిమాల్లో హీరో బోధించాలి.. అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా?
- బోధించలేదు. ఈ జనరేషన్ కి సంబంధించిన ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. మనిషి జీవితకాల సంఘటనని పూర్తి చేసేది కాన్వర్జేషనే. ఇద్దరు మనుషులు కొట్టుకునేది, పరిచయమయ్యేది, ప్రేమించుకునేది అన్నీ మాటల వల్లనేగా. అలాంటి మాటలు ఇద్దరు కూర్చుని మాట్లాడుతున్నట్టు చూపించాం.
* కేరక్టర్ యాటిట్యూడ్ కూడా ఉంటుందేమోగా...
- ఫస్టాఫ్‌లో హీరోకి పెద్దగా మాటలు లేవనడం కరెక్ట్. ఎందుకంటే ఆ పెయిన్‌లో ఏం మాట్లాడుతారు? అలా మాట్లాడటానికి ఏమీ ఉండదుగా... అందుకే సెకండాఫ్‌లో కాస్త తేరుకున్న తర్వాత ఒకటి రెండు సీన్లలో మాట్లాడుతాడు.
* ఫ్యాక్షన్, యాక్షన్ అయినా.. మీరనేసరికి.. మాటలు, సరదా అని .ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా?
- బిగినింగ్‌లో కొంత ఉంటుందండీ. కానీ ఫోర్స్డ్ గా మాత్రం లేదు. ఇంతకు ముందు బ్రహ్మానందంగారి లాంటి వారిని పట్టుకొచ్చి ఒక ఐటెమ్ చేసేవాళ్లం కదా.. అలా ఐటమ్ చేయదలచుకోలేదు. కొంచెం స్ట్రిక్ట్ గా కథ ఏం చెబుతుందో అదే విందామని అనుకున్నా.
* మీ ఫ్యాన్స్ ఫీలవుతారేమో..?
- సినిమాకు ఫ్యాన్స్ ఉంటారు గానీ, మనకుంటారని నేననుకోను.
* రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ అని చూపిస్తారు. కానీ అక్కడి మనుషులు మారారట. ఇప్పుడు అక్కడ అంత ఫ్యాక్షనిజం లేదట కదా?
- లేదు. వరుసగా అన్ని కారులు రావడం వంటివి లేవు. సగిరిపొద్దు, పాపోడు.. ఇలాంటి భాషను కూడా పట్టుకునే ప్రయత్నం చేశాం. అక్కడున్న అందాన్ని కూడా గ్లోరిఫై చేసే ప్రయత్నం చేశాం. హింసను మాత్రమే చూపించలేదు.
* జగపతిబాబు పాత్రను క్రూయల్‌గా చూపించే ప్రయత్నం చేశారు?
- కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారు. కొన్ని పాత్రలు ముందే నిండుగా ఉంటాయి. మనం గ్లాసులో అమృతం పోద్దామనే అనుకుంటాం. కానీ వాడు మందుగానే మంచినీళ్లు పోసుకుని వచ్చి ఉంటాడు. వాడిని మనమేం చేయలేం. అలాంటప్పుడు మనకు ఇరిటేట్‌గా ఉంటుంది. వినని వాళ్లను చూస్తే పళ్లు బిగించాలనిపిస్తుందిగా. `విన్రా ఎందుకు.. ` అనే ఫీలింగ్ అనుకుంటాం కదా.
* నాన్నమ్మ కేరక్టర్ గురించి చెప్పండి?
- ఆవిడ గురించి ఎన్టీఆర్ చెప్పగానే చాలా సంతోషంగా అనిపించింది. ఈ పాత్రకు ఎలాంటి ఇన్‌ఫ్లుయన్స్ లు లేవు. ఇది పూర్తిగా మన కథ. ఆవిడ ముందే డైలాగులు తీసుకుని నేర్చుకుని వచ్చారు.
* ఎన్టీఆర్‌తో 12 ఏళ్ల అనుబంధం.. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యాక ఎలా అనిపించింది?
- నాన్నకు ప్రేమతో నుంచి మొదలైంది... ఆయనేమో ఆ సినిమా చేస్తున్నారు. నేనేమో అ..ఆ.. చేస్తున్నా. అప్పటి నుంచి సీరియస్‌గా సినిమా చేయాలనే థాట్ వచ్చింది. తప్పకుండా చేద్దామని అనుకుని అప్పటి నుంచే బలంగా కూర్చున్నాం. నాతో ఉన్న సమస్య అంటే రాత్రి నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది.. లేచి కూర్చుని సూపర్ అని రాసుకుంటా. నిద్రలేచి చూస్తే నాకే సిగ్గుగా ఉంటుంది. ఈ ఐడియా ఎందుకు రాశానా? అని. అఫ్‌కోర్స్ నేను తీసిన సినిమాలు చాలా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది కానీ.. ఇప్పుడు కూడా అనిపించింది.
* హిట్లు, ఫ్లాప్‌లు వచ్చినప్పుడు ఎలా ఉంటారు?
- పెద్ద పట్టించుకోను. నాకు ఏదైనా కొత్తగా చూసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే కిక్ వస్తుంది. హిట్, ఫ్లాప్‌లు పట్టించుకోనంటే అబద్ధమే. పట్టించుకుంటా. కానీ ఓ.. పిసికేసుకోను. నాకు అత్తారింటికి దారేది వచ్చినప్పుడు అలాగే ఉంటా. అజ్ఞాతవాసి వచ్చినప్పుడూ అలాగే ఉంటా. ఫ్లాప్ అయినప్పుడు బాధపడతా. కాకపోతే ఓ రెండు, మూడు రోజులు.. అంతే. అయిపోయిన తప్పులు మనకు తెలుస్తాయి. చూడకూడదనుకుంటే ఎప్పటికీ చూడం. తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. దానికి ఎక్కువ సమయం పట్టదు.
* అజ్ఞాతవాసి కొన్నాళ్ల తర్వాత వచ్చి ఉంటే బావుండేదని మీరు ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ చేసినట్టున్నారు?
- నేనెప్పుడూ ఎవరికీ చెప్పలేదే. ఖలేజాకు కూడా నేనప్పుడు చెప్పలేదు. ఖలేజా నాకు ఇష్టమైన సినిమా అని ఎవరైనా అన్నా నేను బ్లాంక్‌గా చూస్తా. నేను అలాంటి రియక్షన్ తీసుకోలేదు. నాప్రొడ్యూసర్‌కి లాస్ అయింది కాబట్టి నేను అజ్ఞతవాసి రెమ్యూనరేషన్ బ్యాక్ ఇచ్చా. మిగిలిన వాళ్లు ఎవరూ నా దగ్గరకు వచ్చి అడగలేదు. ఇదివరకు కూడా ఇన్‌స్టెంట్‌గా రియాక్షన్ ఉండేది. కాకపోతే అది మనం చెప్పడానికి పక్కన ఫ్రెండో, వైఫో, పిల్లలో ఉండేవారు. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది. వెంటనే అందులో టైప్ చేసి పెట్టేస్తున్నాం. కాకపోతే ఇది రికార్డ్ అయిపోతుంది. అప్పుడూ, ఇప్పుడూ మనుషులు మారలేదు. అలాగే ప్రవర్తిస్తున్నారు. అది ఉంటుంది. డస్ట్ బిన్ మెళ్లో వేసుకుని తిరగడం దేనికి.. ఫ్లవర్ బొకే అయితే తిరుగుతాం. సినిమా నచ్చడానికి లక్ష కారణాలుంటాయి. నచ్చకపోవడానికి లక్ష కారణాలుంటాయి. దాని గురించి మనం ఏమీ మాట్లాడలేం. మాట్లాడేకొద్దీ మనం వీక్ అవుతామే తప్ప, ఇంకేమీ జరగదు.
* ఎన్టీఆర్ మిమ్మల్ని డియర్ ఫ్రెండ్ అని అన్నారు. ఇంతకు ముందు మహేశ్‌తోనూ ఫ్రెండ్లీగానే ఉండేవారు. ఆ ట్రిక్ ఏంటి?
- ట్రిక్ ఏదీ లేదు. ఇప్పుడు మీతో ఎలా ఉన్నానో.. వాళ్లతోనూ అలాగే ఉన్నా. నేను తెలివితేటలు చూపిస్తే వాళ్లు ఇంకెన్ని తెలివి తేటలు చూపించాలి. నేను పనిచేసిన ఎవరూ కూడా తక్కువ వాళ్లు కాదు. సురేశ్‌బాబుగారు, స్రవంతి రవికిషోర్, అల్లు అరవింద్.. స్టాల్ వార్ట్స్ అన్నమాట. ఎన్నో ఎత్తు పల్లాలను చూసినవారన్నమాట. మనం వెళ్లి కూర్చుని మొదలుపెట్టగానే మన మైండ్‌లో ఏముందో.. స్క్రిప్ట్ సేల్ చేయడానికి వస్తున్నాడా..? కథ చెప్పడానికి వస్తున్నాడా కూడా చెప్పేయగలడు.. మాట్లాడటం మొదలుపెట్టగానే. కాబట్టి వాళ్లని సేల్ చేయకూడదు.
* మీ హీరోయిన్ల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు?
- వాళ్లు చెబుతానన్నారు కాబట్టి చెప్పించాను. చెప్పనంటే మనమేం చేయలేం. షూటింగ్ పూర్తి కాగానే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తే ఏమీ చేయలేం. ఏదో షూటింగ్‌లో ఒక సీన్ బాగా చేయగానే వెంటనే ఓకే అని అన్నారంటే నేను నమ్మను. నేను దేన్నీ మొమెంటరీగా నమ్మను. నాలుగైదు రోజుల తర్వాత కూడా అదే ఫీలింగ్ ఉంటే అప్పుడు చూద్దాంలే అని అనుకుంటా. అప్పుడు మళ్లీ వాళ్లు చెబితే ఓకే అంటాను. మా హీరోయిన్ ఇంట్రస్ట్ తో చెప్పింది.
* సునీల్‌ని మీరు పిలిచారా? ఆయనే వచ్చారా?
- మామూలుగా గతరెండేళ్లుగా అతను అంటూనే ఉన్నాడు. నేను ఇందులో బంధీనైపోయాను. ఎలాగైనా బయటపడాలి. ఏదో ఒకటి చేయాలి అని.. అప్పుడు నేనన్నా.. అది నేచురల్‌గా జరుగుతుంది. నువ్వు పెద్ద దాని గురించి ఆలోచించకు అని. నీ చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ అన్నీ ముందు పూర్తి చెయ్. ఆ తర్వాత హీరోగా కొత్తవేవీ ఒప్పుకోవద్దు. అప్పుడు నేచురల్‌గా ఎందుకు జరగదో చూద్దాం అని అన్నా. నేచురల్‌గానే మా కన్నా ముందే సిల్లీఫెలోస్ మొదలైంది. విడుదలైంది. ఎప్పుడైతే సునీల్ మెంటల్‌గా దాన్నుంచి బయటికి వచ్చాడో, అప్పుడే ఆటోమేటిగ్గా అందరికీ తెలిసిపోయింది. అలాంటివి మనం చెప్పాల్సిన పనిలేదు. అందరికీ ఇట్టే తెలిసిపోతాయి.
* రైటర్‌గా శాటిస్‌ఫేక్షన్ ఉంటుందా? డైరక్టర్ శాటిస్‌ఫై అవుతారా?
- నన్ను నేను రెండుగా విభజించి చూసుకోవాల్సిన అవసరం లేదు. రాముడు-భీముడు సినిమాలో లాగా నేను ఇద్దరిని కాదు. నేను అతడులాంటి సినిమాలు తీసినా అందులో డైలాగులు బాగా రాశాననే అంటారు. అంత మాత్రాన దాన్ని నెగటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగనిదాన్ని కిరీటంగా భావించాల్సిన పనిలేదు.
* మాటలమాంత్రికుడు అనేది కిరీటమా?
- యాంకర్లు మాట్లాడటం మొదలుపెట్టగానే నేను స్టేజ్ ఎక్కేస్తాను. వాళ్లు నాలుగైదు లైన్లు రాసుకుంటే మొదటి లైన్లోనే నేను స్టేజ్ మీదకు వెళ్తా.
* * వరల్డ్ సినిమాను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
- భీమవరం నుంచి వచ్చినప్పుడు నేను కూడా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. అలాగే తీయాలనుకునేవాడిని. కానీ వాళ్లకు సింగిల్ జోన్రా ఉంటుంది. కానీ మనదగ్గర అలా కాదు. మనం ఒకే సినిమాలో అన్నిటనీ చూడ్డానికి అలవాటు పడిపోయాం. అందువల్ల మన దగ్గర అది అంత తేలిక కాదు. ఆ ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టేవారు ఎవరో ఒకరు రావాలి. మాకు మాత్రం తీయాలని ఉండదా అని ప్రతి ఒక్కరం చెబుతుంటాం. అందులో నేనేమీ అతీతుణ్ణి కాదు. కాకపోతే ప్యాట్రన్‌ని బద్ధలు కొట్టాలి. లవకుశ కలర్‌లో విడుదలైన 12 సంవత్సరాల దాకా కూడా కలర్‌లో మనం తీయలేదు. అప్పటికి హిందీ, తమిళ్.. అన్నీ కలర్‌లోకి వెళ్లాయి. తమిళ్‌లో కొత్తవాళ్లతో తీసిన కాదలిక్క నేరమిల్లై కలర్‌లో ఉంటుంది. తెలుగులో పెద్ద హీరోలతో తీసిన సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటాయి. అంటే అప్పటికి మనకు కలర్ అంటే భయం. ఆ ప్యాట్రన్ బ్రేక్ చేయడానికి భయం. కానీ ఇప్పుడు మనం ఆ భయాన్ని బ్రేక్ చేస్తున్నామని అనిపిస్తోంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆ బ్రేక్ ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది.
* ఇప్పుడు మీరు సింగిల్ జోన్రా సినిమాలు తీయడానికి సిద్ధమేనా?
- అందరూ తీయాలి. వేరే దారిలేదు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీ ఉండేది. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అప్పుడు సినిమాకే రావాలి. ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉంది. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఓకామెడీ షోని హోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనం కామెడీ కోసం ఓ ఐటమ్ పెట్టామనుకోండి. జనాలు తిడతారు. ఎందుకు నువ్వు కామెడీ కోసం టైమ్ వేస్ట్ చేస్తున్నావు. కథ చెప్పొచ్చు కదా అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్లకు కామెడీ ఉంటుంది. అది షిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ చాలా పర్సలైజ్ గా రావడం వల్ల వచ్చే నాలుగైదు ఏళ్లలో ట్రెమండస్ రెవల్యూషన్ ఉంటుంది.
* మీరు 16 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టున్నారు..
- నాకు గుర్తులేదు. నేను డేట్లు గుర్తుపెట్టుకోను. అందుకే సుఖంగా ఉన్నా.
* కొత్త కుర్రాళ్లని అబ్జర్వ్ చేస్తుంటారా?
- నేను ప్రతి సినిమానూ థియేటర్కి వెళ్లి చూస్తా. మంచి సినిమాను చూసినప్పుడల్లా నాకు జెలసీ వస్తుంది. నా మీద నాకు కోపం వస్తుంది. ఇంకా బాగా తీయాలనిపిస్తుంది.
* అలా అనిపించిన సినిమలేంటి?
- అర్జున్ రెడ్డి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం, ఆర్ ఎక్స్ 100, పెళ్లిచూపులు, గూడచారి వంటివన్నీ...
* అన్నీ హిట్స్ ఫిల్మ్స్ చెప్పారు..
- అన్నీ హిట్ సినిమాలు నచ్చాలనేం లేదు. నేను కొన్ని హట్ సినిమాలను వదిలేశాను. అది గమనించండి. నన్ను కాంట్రవర్సీల్లోకి లాగకండి. `గూఢచారి` వెరీ ఎప్రిషియేటెడ్ మూవీ. అంత లిమిటెడ్ రిసోర్సస్‌తో ఒకే జాన్రాలో, అంత టైట్‌గా చెప్పడం మామూలు విషయం కాదు.
* `అ..ఆ` సినిమా కూడా చిన్నగానే మొదలైంది. కానీ పెద్దదైందిగా..?
- నాకు బడ్జెట్ గురించి నా నిర్మాతలు ఎప్పుడూ చెప్పరు.
* కానీ ఓ దర్శకుడికి బడ్జెట్ గురించి తెలియాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా?
- కొంచెమే ఉండాలి సార్... ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువుంటే కథ రాసేటప్పుడే ఇటలీలో జరిగే కథ.. ఇండియాలోకి.. ఇంకెక్కడో జరిగేది ఇంట్లోకి.. ఇలా మెల్లగా మారిపోతుంది.
* సినిమా చేసేటప్పుడు నిర్మాతలకు ఆన్సరబులిటీ ఉండాలిగా..?
- మనం బాగా తీస్తే తప్పకుండా వర్కవుట్ అవుతుంది సార్. 1962లో సంగం సినిమా చేశారు. యూరప్‌లో దాదాపు 60 రోజులు షూటింగ్ చేశారు. క్రూ ఎంత మంది వెళ్లి ఉంటారు? అప్పుడు 120 మంది క్రూ వెళ్లారు. ఇంకొకరి డబ్బులు కూడా కాదు. సొంత సినిమాలు చేశారు. ఇప్పుడు బాహుబలి సినిమా పేపర్ మీద చెబితే తీస్తారా అసలు మీరు నిర్మాతలైతే..
* అంటే రిజల్ట్ ముఖ్యం కాదా?
- రిజల్ట్ ముఖ్యంకాదు.. జర్నీ కూడా ముఖ్యమే కదా. ఏదో ఒక కాలమ్ రాశారనుకుందాం. అది సరిగా రానంత మాత్రాన మీరు పనికి రారంటే ఎలా? ఎన్ని చదువుకుని, ఎన్నో కలలతో ఊరి నుంచి రావడం, ఇక్కడ కలిసిన వ్యక్తులు... ఈ ప్రయాణం.. ఇదంతా చాలా ముఖ్యం కదా. అది 90 పర్సెంట్. ఫైనల్ టిప్ 10 శాతం. అదే రిజల్ట్.
* రాధాకృష్ణగారితో మీ జర్నీ ఎక్కువగా ఉంది?
- రవికిశోర్‌గారితో కూడా చాలా సినిమాలు చేశాను. ఆ తర్వాత రాధాకృష్ణగారితో చేశాను.
* ఆ జర్నీ కంఫర్ట్ ఏంటి?
- కంఫర్ట్ అని మీరే చెబుతున్నారు కదా.. అంతే.
* ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ప్రెజర్ ఉందా?
- మన చేతిల్లో ఏమీ లేదు సార్. కాకపోతే సినిమా మొదలుపెట్టడానికి ముందు ఆలోచించా. కానీ ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత జర్నీ ఎగ్జయిట్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ ఉండనే ఉంది. ఒకరోజు ఓ మంచి సీన్ వస్తే నాకు ఎంజాయ్‌గా ఉంటుంది.
* మీ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నట్టున్నారు?
- ఎన్టీఆర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేను బేసిగ్గా మీడియా షై. ఇంతకు ముందు నేను పనిచేసిన హీరోలు కూడా మీడియా షై. నాకు కెమెరాలు, మనుషుల్ని చూడగానే ఇక్కడి నుంచి పారిపోతే బెటర్ అనుకుంటా.
* ఇద్దరి స్టయిల్స్‌లో ఎవరు కనపడతారు?
- నాతో పనిచేసే హీరో బలాన్ని వాడుకుంటూనే రిపీటేషన్ మోడ్‌లోకి వెళ్లకుండా ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తాను. స్టార్స్‌కు ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.
* అనిరుధ్‌ను రీప్లేస్ చేయడానికి కారణం?
- నిజానికి ముందు అనిరుధ్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాం. అయితే తనకు తెలుగు సినిమా అర్థం కావడానికి... తన సంగీతం నాకు అర్థం కావడానికి కాస్త గ్యాప్ తీసుకుంటే మంచిదని నేనే తనకి చెప్పాను. అందువల్ల తన ప్లేస్‌లో థమన్‌ను తీసుకున్నాం. భవిష్యత్‌లో తనతో తప్పకుండా సినిమా చేస్తాను.
* మహిళ ప్రాధాన్యత ఉన్న టైటిల్సే పెడతున్నట్లున్నారుగా?
- అలాంటి టైటిల్స్ పెట్టాలని నేను ఎప్పుడూ ప్లాన్ చేసుకోను. హీరోయిన్స్‌ను గ్లామర్‌గా చూపించమని డైరెక్టర్స్ అడిగినా నాకు తెలియదనే చెప్పేస్తాను. ఎందుకంటే నాకు అలా చూపెట్టడం తెలియదు. నేను ట్రై చేయలేదు.
*మహేశ్‌తో సినిమా అని వార్తలు వస్తున్నాయి కదా?
- కుదరట్లేదండి.. ఇద్దరం బిజీగా ఉంటున్నాం.
*మీ నెక్ట్స్ సినిమా అల్లు అర్జున్‌తో అంటున్నారు?
ఇంకా ఏమీ ఫైనలైస్ కాలేదు. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ‘అరవింద సమేత..’ గురించి మాత్రమే మాట్లాడుకుందాం!
*మీ సినిమాలు వేటిలోనూ విలన్లను హీరోలు చంపరు. పగ, ప్రతీకార నేపథ్యంలో సినిమా కనుక ‘అరవింద...’లో పంథా మార్చారా?
ఎవరో చెబితే నాకూ తెలిసింది. నా సినిమాల్లో విలన్లను హీరోలు చంపరు అనేది. కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. అవి మనకు తెలియకుండానే మన వర్క్‌లో కనిపిస్తాయి. నేను ఆర్గ్యుమెంట్ నమ్మను. ఆర్గ్యుమెంట్ వలన మనుషులు మారతారని నేను నమ్మను. అలాగే, ఒకరి దగ్గరకు వెళ్లి, ‘నేనిది కాదండీ’ అని చెప్పడం వలన మనుషులు మారతారని నేను నమ్మను. ఫైట్ వలన మనుషులు నెగ్గుతారని నేను నమ్మను. ఇద్దరు కొట్టుకుంటే బలంగా ఉన్నవాడు నెగ్గుతాడు. బలహీనుడు నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడా? ఒప్పుకుని వెళ్తాడా? వెళ్లరు సార్! పళ్లు బిగించి కొరుకుతూ శాపనార్థాలు పెట్టుకుని వెళతారు. సో... మనుషులు కొట్టుకోవడం వలన నెగ్గరు. నేను దాన్ని నమ్మను.
* ఇంతకీ విలన్‌ని చంపారా? లేదా?
రండి. సినిమా వేస్తా... చూడండి. రెండు రోజులు కూడా ఆగలేరా?
* తమన్ చాలా లోతైన మనిషి అన్నారు. కారణం ఏంటి?
ఓ విషయంలో తమన్ గురించి మాట్లాడుతూ నేను షాక్ తిన్నా. ఒక సినిమా గురించి మాట్లాడుకుంటుంటే... ‘దట్ ఫిల్మ్ ఈజ్ నాట్ హంగ్రీ ఫర్ బ్యాగ్రౌండ్ స్కోర్ సార్’ అన్నాడు. వెంటనే అతనివైపు తిరిగి చూశా. ఏమన్నావ్? అని అడిగా. ఆ సినిమా బ్యాగ్రౌండ్ అడగట్లేదని అన్నాడు. నేను షాకయ్యా. అటువంటి మాట మాట్లాడినవాడు ఎంత లోతైన వాడు అయ్యు ఉంటాడు? ఇటువంటి సర్‌ప్రైజ్‌లు తమన్ చాలా ఇచ్చాడు. అప్పుడు అనుకున్నా... మనకు పైకి కనిపించే మనిషి లోపల చాలా లోతైన వ్యక్తి ఉంటాడు. తమన్ వయసుకి మంచి లోతైనవాడు. చిన్నప్పట్నుంచి సినిమాలు చూడటం, సినిమాల్లో పెరగటం వలన సినిమా అతడికి సెకండ్ నేచర్. చాలా నేచురల్‌గా సినిమాల గురించి మాట్లాడతాడు. అందువల్ల, కథ చెబితే సరిపోయింది. నేను తమన్‌కి కొన్ని విషయాలు మాత్రమే చెప్పా. ‘బేసిగ్గా నీ పాటల్లో ఎక్కువ హిందీ ఉంటుంది. సో... పాటల్లో హిందీ వద్దు. ఎందుకంటే.. ఈ సినిమాకి అది కుదరదు. పాటల్లో తెలుగు మాత్రమే ఉండాలి. ఇంకొకటి.. సాంగ్ అండ్ డ్యాన్స్ నంబర్లు ఉండే సినిమా కాదు. సో... వాటికి వెళ్లవద్దు. ఆ భయాలు తీసేద్దాం. స్టార్ హీరో కాబట్టి కచ్చితంగా ఒక డ్యాన్స్ నంబర్ ఉండాలని నువ్ భయపెట్టవద్దు’ అని తమన్‌కి చెప్పా. నావైపు నుంచి రిక్వెస్ట్‌లు ఇవేనని చెప్పా.
* మీరు దేవీశ్రీ ప్రసాద్‌తో ఎందుకు చేయడం లేదు?
నిజం చెప్పాలంటే... పెద్ద కారణం ఏమీ లేదు. యాక్చువల్లీ... ఐ లవ్ దేవి! ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు. ఇది నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే. ఇప్పుడు విలేకరులు ఇదివరకు పని చేస్తున్న సంస్థలో మానేసి కొత్త సంస్థలోకి ఎందుకు వచ్చారంటే గొడవలే అయ్యి ఉండాలా? అక్కర్లేదు. మార్పు కోసమే. నాలో మార్పు కోసం కొత్త సంగీత దర్శకులతో చేస్తున్నా. అలాగని దేవి ఒకే మ్యూజిక్ చేస్తున్నాడని నేను అనడం లేదు. అలా చేస్తే... దేవి ఇన్ని హిట్లు ఎందుకు ఇస్తాడు? ఇవ్వలేడు కదా! ‘అ ఆ’ బడ్జెట్‌కి దేవి ఎక్కువ.
* ‘అ ఆ’కి చేసిన మిక్కీ జే మేయర్‌తో మళ్లీ ఎందుకు చేయలేదు?
‘అ ఆ’కి అనిరుధ్ చేయాలి. అతడితో మాట్లాడి, కూర్చుని ఒక మ్యూజిక్ సిట్టింగ్ కూడా వేశాం. తరవాత అనిరుధ్‌తో చేయడం కుదరలేదు. అప్పుడు బీప్ సాంగ్ గొడవలో అనిరుధ్ ఇరుక్కున్నాడు. చాలా రోజులు లీగల్ సమస్యల్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 40 నుంచి 50 రోజుల వరకూ వాటితో సరిపోయింది. అప్పుడు అతను ‘నేనింకా మిమ్మల్ని వెయిట్ చేయిండం కరెక్ట్ కాదు. ప్లీజ్ గో ఎహెడ్’ అన్నాడు.
* అనిరుధ్‌తో మరోసారి ఉండొచ్చా?
నేను ఎన్ని సినిమాలు తీస్తానో నాకే తెలియదు. నాకున్న బద్దకానికి, నాకున్న స్లో పేస్‌కి ఎన్ని సినిమాలు చేస్తానో? ప్రపంచంలో అందరితో నాకు చేయాలని ఉంటుంది.
* మీరు 16 ఏళ్లలో 10 సినిమాలు చేశారు?
ఎందుకండీ... ఈ లెక్కలు! నలుగురి నా బద్దకాన్ని చూపడం కాకపోతే!
* వెంకటేశ్‌తో సినిమా ఉంటుందన్నారు!
అవును. ఆయనతో సినిమా చేయాలి. అయితే.. ఇద్దరికీ ‘వావ్’ అనిపించే కథ దోరకలేదు. రెండుమూడు అనుకున్నాం. రెండోరోజు ఉదయానికి పక్కన పెట్టేశా.
* ఈ సినిమాతో నటుడిగా ఎన్టీఆర్ లోతు తెలిసిందా?
ఆయన లోతు ఎంతనేది ఎప్పుడో తెలుసు. ‘అతడు’ టైమ్‌లో తప్ప తమన్‌తో నాకు పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఎప్పుడైనా ఫోనులో మాట్లాడేవాణ్ణి అంతే. హలో అంటే హలో అనడమే. అతనూ విపరీతమైన బిజీ. అందువల్ల, పెద్దగా కలవలేదు. అతనికి చాలా పనులు ఉంటాయి కదా. 50 సినిమాలు చేశాడు.
* 100 రోజులు ప్లాన్ చేస్తే.. 70 రోజుల్లో సినిమా పూర్తయ్యిందట!
నాతో వంద రోజులు ప్లాన్ చేస్తే 110 రోజులు అవుతుందనుకోండి. ఎన్టీఆర్‌తో చేస్తే ఫాస్ట్‌గా చేస్తాడు. ఆయన టెక్నిక్ ఏంటంటే ఎక్కువసార్లు కథ వింటాడు. ప్రతి సీన్ అనుకుని, అనుకుని మైండ్ సిస్టమ్‌లోకి వెళ్లిపోయి ఉంటుంది. ఒక సన్నివేశం వివరిస్తే... ‘అదేగా! ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. నేనిలా మాట్లాడతా. ఈ సీనే కదా’ అంటాడు. మొత్తం సీన్ మనకి చెప్పేస్తారు. ఆటోమేటిక్‌గా డైలాగులు చూడగానే చెప్పేస్తారు. డిస్కషన్లో లేనివి రెండు మూడు డైలాగులు యాడ్ అవుతాయి. ఏ షాట్ పెట్టినా ఫుల్ సీన్ చేసేస్తారు. వెరీ ఫాస్ట్.
* ‘త్రివిక్రమ్ మార్క్ సినిమా’ అంటే మీకు అడ్వాంటేజ్ అనుకుంటారా? లేదా ఎలా ఫీలవుతారు? దాన్నుంచి బయటపడటానికి ట్రై చేస్తారా?
టిపికల్ క్వశ్చన్. ప్రతిసారి ట్రై చేస్తుంటాం. ఒక్కోసారి కుదురుతుంది. ఒక్కోసారి కుదరదు.
* హరికృష్ణ మరణం తరవాత చివరి 30 రోజులు మీరేలా షూటింగ్ చేశారు? ఎన్టీఆర్‌కి మీరెలాంటి ధైర్యం ఇచ్చారు?
నేను ఆయన పక్కన నిలబడ్డానని చెప్పడం ఆయన మంచితనం గానీ... నిజం చెప్పాలంటే ఆయనే మా పక్కన నిలబడి సినిమా పూర్తి చేశారు. అది నిజం! ఇందులో మోహమాటం ఏం లేదు. ఓపెన్‌గా చెబుతున్నా. హరికృష్ణగారి మరణం తరవాత ఎన్టీఆరే సెకండ్ డే ఫోన్ చేసి, ‘నేను వస్తాను. మీరేం వర్రీ అవకండి’ అని చెప్పారు. ‘మీరు కంగారు పడకండి. బాధ పడకండి’ అని మేము చెప్పింది తక్కువే. ఎందుకంటే... మాటలతో చెబితే తగ్గే విషాదం ఏమీ కాదు. అందువల్లే, ప్రీ రిలీజ్ వేడుకలో నేను ఒక్క మాటే మాట్లాడాను. ‘అంత పెద్ద విషాదంనుంచి అంత త్వరగా బయటకు వచ్చారు’ అని. తన విషాదాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకున్నారు. మిగతా ఎవరికీ పంచి పెట్టలేదు.
* పవన్ రాజకీయాల్లోకి వెళడం వలన ఆయనకు దూరం కావడం వంటివి?
ఏం లేదు. పదేళ్ళ నుంచి మేం అలాగే ఉన్నాం. మేమిద్దరం అసలు సినిమాల గురించి మాట్లాడుకోం.
* సినిమాలు చేయమని మీరు పవన్‌కి సలహా ఇచ్చారా? రాజకీయాల్లోకి సలహాలు ఇస్తారా?
ఎంత అమాయకంగా ప్రశ్నలు అడుగుతారండీ! మీకు తెలియదు... ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు చెప్పడు. అందరూ తెల్లారిన తరవాత పేపర్‌లో చదువుకోవడమే.
* ఆయన ప్రతి స్పీచ్ స్ర్కిప్ట్ మీదే అంటున్నారు?
(నవ్వుతూ) ఇదొక నాకు బోనస్ ఇది! నాకు ఒక సినిమా స్ర్కిప్ట్ రాయడానికి సంవత్సరం పడుతుంది. రాజకీయాలనకు, నాకు సంబంధం లేదు. నేను పేపర్ కూడా చదవను. న్యూస్ ఛానల్స్ చూడను.
.......
* మీ ఫ్రెండ్ షిప్ ఎలా ఉంది?
జీవితంలో నేను ఒక్కసారి ఎవరికైనా ఫ్రెండ్ అయితే ఫ్రెండే. నా భీమవరం ఫ్రెండ్స్ ఇప్పటికీ వాళ్లే నా ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక ఎవరు ఫ్రెండ్స్ అయితే వాళ్లే ఫ్రెండ్స్. అందరితో నేను బావుంటాను. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్... ఒక్కసారి నా జర్నీ స్టార్ట్ అయితే చచ్చేవరకూ ఆగదు. నేను ఏది నమ్ముతాను అంటే.. భార్య ఇచ్చే సలహాలు భర్త ఎన్ని వింటాడు. అలాగని, భార్యను ఎందుకు వదలడు? ఆ రిలేషన్‌షిప్‌లో ఒక సెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది. స్నేహితులుగ గానీ... కుటుంబం గానీ... సలహాలు ఇవ్వాలనో, ఎడ్యుకేట్ చేయాలనో కాదు. ఇట్స్ సెన్స్ ఆఫ్ కంఫర్ట్. స్నేహితుడు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. మనల్ని జడ్జ్ చేయకుండా మన భావాల్ని పంచుకోవాలి. పవన్, మహేశ్, ఎన్టీఆర్... ఈ స్థాయికి వచ్చిన వ్యక్తులకు సలహాలు ఏం ఇస్తాం. 18 ఏళ్ళ వయసులో సూపర్‌స్టార్ అయ్యి, 20 ఏళ్ళ వయసులో ‘సింహాద్రి’ చేశాడంటే మెంటల్‌గా ఎంత బలం ఉండాలి. ఆడుతూ పాడుతూ ఉండే వయసులో, వ్యామోహాలకు లోనయ్యే వయసులో అంత పెద్ద సినిమాలు చేశారంటే మనం ఏం సలహాలు ఇవ్వాలి. వాళ్లు మనకు సలహాలు ఇచ్చే స్థితికి రాకుండా ఉంటే చాలు.