30 October 2018
Hyderabad
విజయ్, ఎ.ఆర్.మురగదాస్ కాంబినేషన్‌లో 'తుపాకీ', 'కత్తి', వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. మురుగదాస్, విజయ్ కలయికలో తమిళంలో వస్తున్న చిత్రం 'సర్కార్'. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, కథానాయికలు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిథి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ....
స్ట్రయిట్ తెలుగు మూవీస్‌లో అవకాశాలు రాలేదా?
వచ్చాయండి.. చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నాకు ఏదీ ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు. అలాగని తెలుగు సినిమాలు చేయనని కాదు. తమిళంలో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలను గమనిస్తే నా పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తమిళం తర్వాత మలయాళం, కన్నడ సినిమాలంటూ బిజీ అయిపోయాను. తెలుగుపై ఫోకస్ పెట్టలేదు. 'పందెంకోడి 2'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు విజయ్ 'సర్కార్'లో నటించాను. ఇలా ఇప్పుడే తెలుగు సినిమాల్లో నా ప్రయాణం ప్రారంభమైంది.
హీరోయిన్‌గానే కాదు నెగటివ్ షేడ్స్ కూడా చేసేస్తున్నారుగా?
- ఓ నటి అన్ని పాత్రలను చేయాలనకుంటున్నాను. అందుకనే నాకు నచ్చితే హీరోయిన్‌గానే కాదు.విల్లిగా అయినా.. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా చేయడానికి నేను సిద్ధమే. 'పందెంకోడి 2'లో పూర్తిస్థాయి నెగటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్‌లో నటించాను. 'సర్కార్'లో రాజకీయ నాయకురాలిగా కనపడతాను. సాధారణంగా మురగదాస్‌గారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాస్తుంటారు. అలాగే సర్కార్ కోసం నా పాత్రను చాలా స్ట్రాంగ్‌గా మలిచారు.
'సర్కార్'లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నేను స్మార్ట్‌గానే ఉన్నాను(నవ్వుతూ...).... సర్కార్‌లో నా పాత్ర గురించి చెప్పలేను. కానీ పొలిటిషియన్ పాత్రలో కనపడతాను. ఓటుకు ఉన్న విలువేంటనేది 'సర్కార్' చిత్రంలో తెలుస్తుంది. అలా ఓటు గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను.
ప్రారంభంలోనే తెలుగులో డబ్బింగ్ ఎందుకు చెప్పుకోవాలనుకున్నారు?
- నటిగా మనం చేసే పాత్రలోని ఎమోషన్స్‌ను ఆడియెన్ వరకు క్యారీ చేయాలంటే మనమే డబ్బింగ్ చెప్పుకోవాలనిపించింది. అదీగాక నేనే డబ్బింగ్ చెప్పుకుంటే కాస్త వైవిధ్యం ఉంటుంది కదా. అందుకే డబ్బింగ్ చెప్పాను. కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఓ చాలెంజింగ్‌గా అనిపించింది.
నాన్న(శరత్‌కుమార్)తో సినిమా ఎప్పుడు?
- నాన్నతో 'పాంబన్' అనే సినిమాలో నటిస్తున్నాను. నటిగా ఆయనతో కలిసి నటిస్తున్న తొలి చిత్రమదే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. ఆయన పేరుని ఎక్కడా వాడుకునే ప్రయత్నం చేయలేదు
'సర్కార్' వివాదమదమేంటి?
- 'సర్కార్' సినిమా కథకు సంబంధించిన వివాదం చూస్తే.. మురగదాస్, వరుణ్ రాజేంద్రన్ రాసిన కథ ఒకేలా ఉన్నాయి. అంతే కానీ.. వరుణ్ కథను మురగదాస్‌గారు తీసుకోలేదు. అయితే కథ ఒకేలా ఉండటంతో టైటిల్ కార్డ్స్‌లో వరుణ్ రాజేంద్రన్‌కు థాంక్స్ కార్డ్ వేద్దామని మురగదాస్‌గారు నిర్ణయించుకున్నారు.
మీ టూ ఉద్యమం గురించి చెప్పండి?
- నాకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఏడాది క్రితమే చెప్పాను. ఇప్పుడు మీ టూ రూపంలో చాలా మంది చెబుతున్నారు. ఈ మీ టూ ఉద్యమం రెండేళ్ల క్రితం యు.ఎస్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు ఇండియాలో నడుస్తుంది. 'నేమ్ దెమ్ అండ్ షేమ్ దెమ్' అనేదే మీ టూ కాన్సెప్ట్. దీంతో తప్పు చేసిన వాళ్లకి ఎక్కడ మన పేరు వస్తుందో అనే భయం ఉంది. అయితే సౌత్ ఇండియాలో సైలెంట్‌గా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ టూ ఉద్యమం అవసరమే. ఎందుకంటే తదుపరి జనరేషన్ వచ్చేసరికి సెక్సువల్ హారాష్ మెంట్ అనే సమస్య తగ్గిపోతూ వస్తుంది. ఇలా అన్ని రంగాలకు సంబంధించినవారు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల సమస్యలు లేవు అని అంటున్న వారందరూ అబద్ధం చెబుతున్నట్లే. పాత తరానికి చెందిన నటీమణులు కూడా ఈ విషయం స్పందించాల్సిన అసవరం ఎంతైనా ఉంది.
విశాల్‌తో పెళ్లి గురించి..?
- ఆయన పెళ్లి గురించి నేనెలా చెప్పను. ఆయనే చెప్పాలి. మంచి అమ్మాయి దొరికితే నేను ఆయనకు పెళ్లి చేసుకోమని చెబుతాను. ఆయన పెళ్లి గురించి నన్ను అడగొద్దు. నేను విశాల్‌తో డేటింగ్ చేయడం లేదు. ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. అందుకే ఓ సందర్భంలో నేను తన సోల్ మేట్ అని కూడా చెప్పి ఉంటారు. మాకిద్దరికీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. మేం పెళ్లి చేసుకోవడం లేదని హెడ్డింగ్ పెట్టి అందరూ వార్తలు రాస్తే బావుంటుంది.
పదిహేనేళ్ల తర్వాత వరలక్ష్మి ఎలా ఉండొచ్చు?
- మరో పదిహేనేళ్ల తర్వాత నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. జయలలితగారంటే నాకు ఎంతో ఇష్టం. ఓ మహిళై తనను తాను తక్కువగా చూసుకోకుండా స్వతంత్య్రంగా ఓ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించారు. ఆమెను నా ఇన్‌స్పిరేషన్‌గా భావిస్తుంటాను. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. అందరూ దూరం నుండి చూసి రాజకీయాలంతా మురికి కూపం అంటుంటారు. అందరూ మురికి అని అంటే రంగంలోకి దిగి ఎవరు క్లీన్ చేసేది. మనమే చేయాలి.
రజనీ, కమల్ రాజకీయ రంగ ప్రవేశంపై మీ అభిప్రాయం?
-రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా విషయాలు వారు మాట్లాడవచ్చు. అయితే రేపు కార్యాచరణలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రానికి ఎవరు ముఖ్యమనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారు.
జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి కదా?
- నిజవే.. జయలలితగారు మరణించిన తర్వాత రాజకీయాల్లో ఓ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్‌లో కుదురుకోవడానికి చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో చిన్న కన్‌ఫ్యూజన్ కూడా కనపడుతుంది. ఆ ప్రయత్నాలను నేను తప్పు పట్టను. అయితే మన రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారనేదే ముఖ్యం. ఆ గ్యాప్‌ను పూర్తి చేసేది ఎవరు అనేది తెలియడానికి వేచి చూడాలి. కాలమే సమాధానం చెబుతుంది. ప్రజలు రేపు ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని ఓటింగ్ ద్వారా తెలియజేస్తారు.
తదుపరి చిత్రాలు...
తెలుగులో చేయడం లేదు కానీ మంచి అవకాశం వస్తే స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తాను. అలాగే తమిళంలో ఈ ఏడాది ఏడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.