దర్శకుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్కశైలి. ఇండస్ట్రీలోకి వచ్చే యువ దర్శకులు చాలా మంది కమర్షియల్ దర్శకులుగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అన్నీ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అంత సులువైన పనికాదు. ఈ తరం స్టార్ డైరెక్ట్‌ర్స్‌లో వి.వి.వినాయక్‌కి కమర్షియల్ డైరెక్టర్‌గా చాలా మంచి పేరుంది. అందుకే మెగాస్టార్ చిరంజీవి నుండి ఇప్పటి సాయిధరమ్ తేజ్ వరకు ఆయనతో సినిమాలు చేశారు. సాయిధరమ్‌తేజ్ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వి.వి.వినాయక్ తెరకెక్కించిన సినిమా 'ఇంటిలిజెంట్'. ఫిబ్రవరి 9న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా వినాయక్‌తో ప్రత్యేక ఇంటర్యూ ఐడిల్ బ్రెయిల్ పాఠకుల కోసం...
*ఇంలిజెంట్' సినిమా ఫస్ట్ కాపీ చూశారా?
- సినిమా ఫస్ట్ కాపీని నాతో పాటు యూనిట్ అంతా కలిసి చూశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కచ్చితంగా సూపర్‌డూపర్ హిట్ అవుతుంది. బేసిక్‌గా మంచి హ్యుమర్, కామెడీ, యాక్షన్‌తో ఎలిమెంట్స్‌తో రూపొందిన కమర్షియల్ మూవీ. ఇప్పటి వరకు ఆకుల శివ నాకు మూడు కథలను ఇచ్చాడు. ఆ మూడు కథలతో చేసిన సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. 'నాయక్' తర్వాత నాతో పాటు తమన్ వర్క్ చేసిన సినిమా ఇది. అద్భుతమైన ట్యూన్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్‌ను అందించారు. సినిమాలో నాలుగే సాంగ్స్ ఉంటాయి. సిచ్యువేషన్స్‌కు తగ్గట్లే సాంగ్స్ ఉండాలనిపించి, అందుకు తగినట్లే సాంగ్స్‌ను ప్లాన్ చేశాను. సినిమా మంచి స్పీడ్‌తో రన్ అవుతుంది. ముఖ్యంగా డాన్సులు అదిరిపోతాయి. జానీ, శేఖర్ మాస్టర్స్ ముందుగానే రిహార్సల్ చేయించి దాన్ని షూట్ చేసి అందులో బెస్ట్ తీసుకుని తర్వాత ఒరిజిల్ షూట్‌కు వెళ్లాం.
* సి.కల్యాణ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి..?
- సి.కల్యాణ్‌గారు, నేను బ్రదర్స్‌లా ఉంటాం. ఆయన నన్ను ఓ గాజు బొమ్మలా చూసుకున్నారు. అన్‌కాంప్రమైజ్‌డ్‌గా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా ఒక పెద్ద హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను.
* కల్యాణ్‌తో మీరు సినిమా చేయాలనేది మీ నాన్నగారి కోరిక అని మీరు ఓ సందర్భంలో అన్నారు కదా..! అసలు సి.కల్యాణ్‌తో మీనాన్నగారికి పరిచయమెలా ఏర్పడింది?
- నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి నాకు, సి.కల్యాణ్‌గారితో మంచి అనుబంధం ఉంది. అదెలాగంటే సాగర్‌గారి దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు.. మేం ఎప్పుడైనా రాజమండ్రి వస్తే నాన్నగారు వచ్చి సాగర్‌గారిని, నన్ను కలుస్తుండేవారు. అలా మా నాన్నగారితో కల్యాణ్‌గారికి పరిచయమైంది. తర్వాత నేను దర్శకుడిగా మారిన తర్వాత ఆ అనుబంధం ఇంకా బలపడింది. దాదాపు రోజు నాన్నగారు, కల్యాణ్‌గారు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండేవారు.
* తేజు నటన ఎలా ఉంటుంది?
- సాయిధరమ్ తేజ్ తన స్టయిల్లో చాలా బాగా చేశాడు. తను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటితో పోల్చితే ఈ సినిమాలో సాంగ్స్ చాలా బావుంటాయి. అలాగే కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌లో కూడా చక్కగా నటించాడు. సాంగ్స్‌లో చిరంజీవిగారిలా తేజు అనిపిస్తాడు.
* 'ఇంటిలిజెంట్' కాన్సెప్ట్ ఏంటి? ఎమైనా మెసేజ్ ఇస్తున్నారా?
- 'ఇంటిలిజెంట్' టైటిల్‌కు తగ్గట్లే సినిమాలో చిన్న మైండ్ గేమ్ ఉంటుంది. సినిమా చూస్తే అదేంటో తెలుస్తుంది. ఒకప్పుడు స్నేక్ గ్యాంగ్ అనే న్యూస్ మనం వినే ఉంటాం. అలాంటి కాన్సెప్ట్‌తో పాటు సమాంతరంగా నడిచే మరో కథ కూడా ఉంటుంది. దీనికి ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ చేసి చేశాం. తనకు సపోర్ట్ చేసిన ఒక వ్యక్తి కష్టాలు పాలైనప్పుడు అది చూసిన తేజు ఎంత వరకు పోరాడాడు. ఆ వ్యక్తి ఫ్యామిలీని ఎంత వరకు నిలబెట్టాడనేదే ప్రధానమైన కథ.
* లావణ్య త్రిపాఠిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి?
- తేజుకి కాజల్ వంటి పెద్ద హీరోయిన్స్‌ను ముందుగా అనుకోలేదు. తన ఏజ్‌కు తగ్గ హీరోయిన్స్ సరిపోతారా? లేదా? అని చూస్తే వారితో ఆల్ రెడీ చేసేసి ఉన్నాడు. లావణ్యతో ఇంకా నటించలేదు. తేజు, లావణ్య కాంబినేషన్ ఫ్రెష్‌గా ఉంటుందని తననే హీరోయిన్‌గా తీసుకున్నాం.
* సాయిధరమ్‌కి 'ఇంటిలిజెంట్' ఎలాంటి ఇమేజ్‌ను తెచ్చి పెడుతుంది?
- నాతో పనిచేసిన హీరోలందరికీ ఇమేజ్ టర్న్ అవుతుందని నేను ముందుగా అనుకోలేదు. కానీ అయ్యింది. అలాగే 'ఇంటిలిజెంట్' సినిమా తేజుకి ఎలా టర్న్ అవుతుందో చూడాలి. అయితే డెఫనెట్‌గా ఎంత పెద్ద కథనైనా తేజు హీరోగా మోయగలడు అనే ఫీలింగ్ ఇచ్చే సినిమాగాతనకు పెరొస్తుంది.
* హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
- జాలీ జాలీగా తిరిగే పాత్రకు ఓ బాధ ఎదురైతే అక్కడి నుండి తన ప్రయాణం ఎలా కొనసాగుతుంది. అక్కడ నుండి ఆ బాధ్యతను ఎలా తీసుకెళ్లాడనేదే సినిమా. ఈ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.
* చిరంజీవి సాంగ్ రీమిక్స్ చేయాలనే ఆలోచన ఎవరిది?
- నాకు చిరంజీవిగారి పాటల్లో చమకు చమకు సాంగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాను తేజుతో అనుకోగానే చమకు చమకు పాటను రీమిక్స్ చేయాలని అనుకున్నాను.
* ఇంటిలిజెంట్' సినిమాను ఎన్ని లోకేషన్స్‌లో చిత్రీకరించారు?
- 'ఇంటిలిజెంట్' సినిమాను మొత్తంగా చూస్తే పర్టికులర్‌గా ఇన్ని లోకేషన్స్ అని నేను చెప్పలేను. చాలానే ఉన్నాయి. ఓమన్, అబుదాబి దేశాల్లో పాటలను చిత్రీకరించాం.
* ఓ సీనియర్ దర్శకుడిగా.. ఈ సినిమాలో మీకు టఫ్ జాబ్ ఏదనిపించింది?
- సినిమా అంటేనే టఫ్ జాబ్. ప్రతి సీన్ టఫ్‌గానే భావిస్తాను. ప్రతి సీన్‌ను ఛాలెంజింగ్‌గానే తీసుకుని చేస్తాను.
* మీ కథలన్నీ రెగ్యులర్ ఫార్మేట్‌లోనే ఉంటాయా? రిస్క్ చేయరా?
- బేసిక్‌గా నా సినిమాలన్నీ రెగ్యులర్ ఫార్మేట్‌లోనే ఉంటాయి. అలాగని రిస్క్ తీసుకోనని కాదు. నేను కథ విన్నప్పుడు ఇది బావుంది. కచ్చితంగా సినిమా ఆడుతుందనిపించిన కథలతోనే సినిమాలు చేస్తాను.
* మెగాఫ్యామిలీ హీరోలతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
- చిరంజీవిగారు లెజెండ్రీ నటుడు. ఆయనతో సినిమా అంటే ఓ టెన్షన్ ఉంటుంది. ఇక రామ్‌చరణ్, బన్ని, తేజు వంటి నటులతో సినిమా అంటే కాస్త రిలాక్స్‌డ్‌గానే చేసుకుంటాను. తేజు సౌమ్యుడు, మంచి విలువలున్న వ్యక్తి. బన్నితో కూడా మంచి అనుబంధం ఉంది. చరణ్, బన్నితో నాకు 'ఠాగూర్' సినిమా నుండి పరిచయం ఉంది.
* మీరు వేరే వ్యక్తుల కథలపై ఆధారపడే సినిమాలు చేస్తున్నట్లున్నారు కదా? ఆకుల శివ కథలపైనే ఆధారపడుతుంటారని బయట వార్తలు వస్తున్నాయి?
- నేను కేవలం నా కథలతోనే సినిమా డైరెక్ట్ చేయాలనుకోను. ఎందుకంటే 'మనం ఇతరుల కథతో సినిమా తీసినప్పుడు మనలో వేరే యాంగిల్ కూడా ఓపెన్ అవుతుంద'ని ఓ సందర్భంలో రాఘవేంద్రరావుగారు చెప్పారు. అదే నేను బయట వ్యక్తుల కథతో సినిమా చేయకపోతే, ఓ ఫ్యాక్షన్ డైరెక్టర్‌గానే గుర్తుండిపోయేవాడిని. అలాంటిది నేను 'కృష్ణ', 'అదుర్స్' వంటి సినిమాలు చేయడం వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ కూడా నాలో ఎలివేట్ అయ్యింది. ఇక దర్శకుడిగా నాకు ఇది 17వ సినిమా. అందులో శివ నాకు మూడు సినిమాలకు మాత్రమే కథలను ఇచ్చాడు. మూడు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. వేరే వాళ్ల కథలను కూడా వింటుంటాను. నచ్చినప్పుడే ఆ కథలతో సినిమాలు చేస్తాను.
* దర్శకుడిగా మీరు చాలా కథలను వింటుంటారు కదా! రొటీన్ కథలను వినేటప్పుడు మీకెలా అనిపిస్తుంది?
- ఇలా అనిపిస్తుందని కచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను కానీ.. కొన్ని కథలను వింటే సోదిగా అనిపిస్తుంది. కొన్ని కథల్లో కొన్ని పోర్షన్స్ బావున్నట్లు అనిపిస్తాయి. కానీ మొత్తంగా చూస్తే.. కథ నచ్చదు.
* తెలుగులో సినిమా కథలకు కొరత ఉందా? వేరే సినిమాలను కాపీ కొట్టడమెందుకు?
- తెలుగులో మంచి కథలు రావడం లేదా? అంటే కచ్చితంగా 'అర్జున్ రెడ్డి' వంటి డిఫరెంట్ కథలతో సినిమాలు వచ్చి సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమాల కథలను హాలీవుడ్ సినిమాల నుండి తీసేసుకున్నారని అంటుంటారు. ఒకప్పుడు కూడా అలా చేసేవారేమో.. అయితే అప్పుడు ఇంత రేంజ్‌లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల తెలుసుండకపోవచ్చు. ఎప్పటి నుండి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడమో, కాపీ కొట్టడమో జరుగుతున్నాయి. అంతే కానీ కొత్త కథలు రావడం లేదని కాదు. మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు.
* మీరు రాజకీయాల్లోకి వస్తారని వస్తున్న వార్తలపై మీ స్పందనేంటి?
- నేను పాలిటిక్స్‌లోకి వస్తాననే దానిపై చాలా వార్తలు వినపడుతున్నాయి. కానీ అందులో వాస్తవం లేదు. కొడాలి నానిగారు ఓ ప్రెస్‌మీట్‌లో సరదాగా అన్న విషయాన్ని చిలవలు పలువలుగా చేసి వార్తలు రాసేశారు. అంతే తప్ప.. నేను ఎవరినీ అప్రోచ్ కాలేదు. నన్నెవరూ అప్రోచ్ కాలేదు. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల ఇలాంటి వార్తలు వస్తుంటాయి. నేను అటువంటి వార్తలను చదివి ఊరుకున్నాను తప్ప, వాటిపై రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం నాకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదు. ఆసక్తి కూడా లేదు. నేను డైరెక్టర్‌ని అవుతానని ముందుగానే అనుకోలేదు. అలా విధి నేను రాజకీయాల్లోకి రావాలనుందని అనుకుంటే దానికి నేను బాధ్యుడ్ని కాను.
* కొత్త వారితో, మీ ప్రొడక్షన్‌లో సినిమా ఎప్పుడు ఉంటుంది?
- కొత్త వాళ్లతో సినిమా చేయాలనే ఆలోచనైతే ఉంది కానీ..దానికి రెండేళ్ల సమయం పడుతుంది. అలాగే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే విషయంపై ఇప్పుడే చెప్పలేను దానికి కూడా రెండేళ్ల సమయం పట్టొచ్చు.
* మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు మీ మార్కులో లేవని విమర్శలు వచ్చినప్పుడు మీకెమనిపిస్తుంది?
- సినిమా అంటేనే టెన్షన్. ప్రతి సినిమాకు ఒకేలానే ఎఫర్ట్ పెడుతాను. నేనే కాదు...దర్శకులందరూ అంతే. కొందరు సినిమా చూసి వినాయక్ ఈ సినిమా చేయలేదేమో అని అంటుంటారు. అదెలా అనుకుంటారో తెలియదు. అంటే ప్రతి సినిమాలో సుమోలు లేపితేనే, పెద్ద చేజింగ్ ఉంటేనే నేను డైరెక్ట్ చేసినట్లా. సిచ్యువేషన్స్ డిమాండ్ చేయకుండా సుమోలను ఎలా గాల్లో లేపుతాను.
* ఏదైనా సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలోనే సినిమా సక్సెస్ కాదని అనిపిస్తుందా? అలా అనిపిస్తుందని కొంత మంది నటీనటులు అంటుంటారు కదా.. మీరేమంటారు?
- ఏదైనా సినిమా చేసేటప్పుడు ఇది అడుతుంది.. ఇది ఆడదు అని ఎవరూ అనుకోరు. ప్రతిరోజూ తర్వాతి రోజు సీన్ ఏంటనే టెన్షన్‌తోనే ముందుకెళుతుంటాం. ఒకవేళ సినిమా పూర్తి కాకుండానే సినిమా హిట్ అయిపోతుంది.. కాదు అని చెప్పేస్తారంటే వాళ్లు బ్రహ్మ దేవుళ్లై ఉంటారేమో.
* హీరో, దర్శకుడు.. వీరిలో ఎవరు గొప్ప?
- అందరి కన్నా సినిమానే గొప్పది. దాని పట్ల ఎవరైతే భయభక్తులతో ఉంటారో వాళ్లే గొప్ప అని నా అభిప్రాయం. హీరో గొప్ప, దర్శకుడు గొప్ప అని చెప్పలేం. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్కరి వల్ల హైప్ ఏర్పడుతుంది.
interview gallery
* తెలుగు సినిమా కాంబినేషన్స్‌పైనే ఆధారపడిందని వస్తున్న విమర్శలున్నాయి కదా! మీరేమంటారు?
- సినిమా అంటేనే వ్యాపారం. డబ్బులు పెట్టడం. రాబట్టుకోవడం. ఇక కాంబినేషన్స్‌పై తెలుగు సినిమా ఆధారపడిందని అంటుంటారు. ఈ కాంబినేషన్స్‌లో సినిమా చేయడం అనేది ఇప్పుడే కొత్తగా ఏం జరగడం లేదు. ఎప్పటి నుండో జరుగుతున్నదే. సినిమాపై హైప్స్ తెచ్చుకోవాలంటే కాంబినేషన్స్ కావాల్సిందే.
* 'బాహుబలి' సినిమా తర్వాత మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా?
- 'బాహుబలి' వంటి సినిమాను చేయాలంటే అంత భారీ బడ్జెట్... భారీ తారాగణం.. ఎక్కువ టైంస్పాన్ అవసరం. ఓ రకంగా చాలా గుండె ధైర్యం ఉండాలి. రాజమౌళిగారి మొండితనం వల్ల.. భయపడకపోవడం వల్లే బాహుబలి మన ముందుకు వచ్చింది.
* మీ పిల్లలు సినిమాలు చూస్తారా? వారికి సినిమాలతో ఎలాంటి అనుబంధం ఉంది?
- ప్రస్తుతానికి ఇద్దరూ చదువుకుంటున్నారు. అబ్బాయి తొమ్మిది తరగతి, అమ్మాయి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ సినిమాలు బాగానే చూస్తుంటారు. అందులో నేను డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉంటాయి.
* దర్శకుడిగా బిజీగా ఉండే మీరు.. మీ పిల్లలతో సమయాన్ని ఎలా గడుపుతారు?
- నేను ప్యూర్ ఫ్యామిలీ మేన్. కచ్చితంగా పిల్లలతో ప్రతిరోజూ గంట కానీ రెండు గంటలు సమయాన్ని స్పెండ్ చేస్తాను. చదువుల విషయంలో నేను వారిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాను. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండీషన్స్ పెట్టను. పద్ధతిగా ఉండాలని కోరుకుంటాను.
* 'అదుర్స్ 2' ఎప్పుడు ఉండొచ్చు?
- 'అదుర్స్ 2' కథపై ఒకట్రెండుసార్లు వర్కవుట్ చేశాం కానీ కుదరలేదు. అయితే 'అదుర్స్ 2' సినిమా చేయాలనైతే కోరిక బలంగా ఉంది.
* తదుపరి చిత్రమేంటి?
- నా నెక్స్‌ట్ సినిమా ఏంటో కూడా నేను చెప్పలేను. అలాంటిది నేను మల్టీస్టారర్ చేస్తానా? లేదా? అని ముందే ఎలా చెప్పగలను. యాక్సిడెంటల్‌గా జరిగితే తప్ప నేను చెప్పలేను.