27 December 2022
Hyderabad
నిలువెత్తు విగ్రహం, నిండైన ఆకారం, చక్కని వర్ఛస్సు, స్పష్టమైన వాచకం, గంభీరమైన స్వరం, భాషా సౌలభ్యం, అభినయ కౌశలం - కథానాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నా, అదృష్టం ఆడిన నాయక-ప్రతినాయక బొమ్మా బొరుసాటలో ఓడిపోయి యాంటీ హీరోలోనే హీరోని చూసుకున్నాడు సత్యనారాయణ. నాలుగు దశాబ్దాల పైగా సినీ వంటకాలలో తీసి పారేయలేనీ కరివేపాకు మన కైకాల. ప్రతీ ప్రతినాయక మేళవింపులో తప్పనిసరి తాళింపు మన సత్యనారాయణ. వీరోచితం నుండి రౌద్రం వరకు, రోమాంచితం నుండి రొమాన్స్-ఇతం వరకు, రాసులు పోసినట్టుండే విభిన్న రసాలను ఒక్కోసారి ఒకే పాత్రలో మేళవించి, రంగరించి, మెప్పించి, రంజింప చేసిన నవరస రసవాది మన కైకాల సత్యనారాయణ. ఒక తరం ప్రేక్షకులకు తను పరిచితుడు కాబడినది, దగ్గర అయ్యింది, గుండెల్లో నిలిచిపోయింది మాత్రం "సత్తి గాడు" పేరుతోనే. రావు గోపాల రావు రావు గోపాల రావే, అల్లు రామలింగయ్య అల్లు రామలింగయ్యే, సత్యనారాయణ మాత్రం "సత్తి గాడే".
పాత్ర రాసిన తీరు పకడ్బందీగా ఉంటే పాత్రధారితో పెద్దగా పని ఉండదు, అన్నో ఇన్నో అభినయ పదాలు వల్లెవేసిన ఏ పాటి నటుడయినా సులభంగా ధరించగలడు, భరించగలడు. కానీ యేడాదికి 200 పైబడి చిత్రాలు నిర్మితమవుతున్న ఆ కాలంలో, వాసి కన్నా రాశి మీదే పరిశ్రమకు మమాకారమెక్కువున్న ఆ రోజులలో, విలనీలో వైవిధ్యం మాట దేవుడెరుగు, అన్ని సినిమాలలో హీరో పాత్రలు కూడా మూస పోసినట్టుండే ఆ తరంలో, ఎన్ని సార్లు అదే పాత్రని ఎన్నో సినిమలలో వేసినా, ఎన్ని సార్లు అదే హీరోల చేతిలో చావుదెబ్బలు తిన్నా, ఎన్ని సార్లు అదే హీరోయిన్ల చేత ఛీత్కరించుకోబడ్డా, ఆరడుగుల ఆజానుబాహువుల నాయకుల నుండి, అంగుష్ట మాత్ర ప్రమాణంలో ఉన్న వాలఖిల్య హీరోల వరకు, తన క్రౌర్యంతో, తన రౌద్రంతో, తన భీభత్సంతో, తన నటనా పటిమతో, ఎదుటి 'హీరో' ప్రమాణం పెంచగలిగిన ఏకైక నటుడు - సత్తి గాడు.
సత్యనారాయణ గొప్పతనమంతా తన ఒదుగుదలలోనే ఉంది. తెలుగే కాదు మిగతా ఏ చిత్ర పరిశ్రమలోనూ ఇంత ఒడ్డూ పొడుగూ ఉన్నవాడు, ఇంత లోతయిన స్వరం ఉన్నవాడు, కళ్ళు ఉరిమితే క్రౌర్యం కురిపించ గలిగిన వాడు అన్నీ తగ్గించుకుని హాస్య పాత్రలకి నప్పిన దాఖలాలు లేవు (యస్వీ రంగారావు గారి అక్కడక్కడ మతిమరుపు పాత్రలు పక్కన పెడితే). ఆ హాస్యం కూడా పాత్ర నించి కాక నూటికి నూరు శాతం పాత్ర పోషణ నుండి వచ్చినదే. కామెడీ-విలనీ అన్న ఒక వినూత్న పద జోడీ ప్రవేశ పెట్టబడింది కైకాల నించే. కామిడీ చేయలంటే తనకున్న ఏకైక ఆయుధం డైలాగ్ మాడ్యులేషన్. అటువంటి పాత్రలలో సత్యనారయణ గొంతులో చిన్నతనపు గోము, పసితనపు చిలిపితనం, పిల్లల ఆకతాయితనం అన్నీ వినిపిస్తాయి. తన సహజ సిద్ధమైన గాంభీర్యతను (ఒక గాయకుడి సాధనలాగా) ఒకట్రెండు స్థాయిలు పెంచి చిన్న పిల్లల ముద్దు మాటల స్థాయిలో నిలిపి ఆ పాత్రలను నప్పించిన గొప్ప వచక చణ సత్యనారాయణ. హీరోగారి ప్రభంజనం ఊపందుకుంటున్న తొలినాళ్ళలో, అటూ ఇటుగా తన ఈడే ఉన్న రావు గోపాల రావు పెద్ద విలన్ గా, అతని కొదుగ్గా తను చిన్న విలన్ గా చేసిన ఫక్తు కమర్షియల్, మాస్ మసాలా రాఘవేంద్ర రావు మార్కు సినిమాలలో, తండ్రి చేత చీవాట్లు, హీరోయినతో నానా పాట్లు, హీరో చేతిలో చావు దెబ్బలూ, ఇవే సతయనారాయణ పాత్రల పౌష్టికాహారం. రావు గోపాల రావు పక్కన ఇంకో విలన్ గా వేయాలన్నా సత్యనారయణే, రావు గోపాల రావు కొడుగ్గా వేయాలన్నా సత్యనారాయణే, హీరోయిన్ తండ్రిగా వేయాలన్నా సత్యనారాయణే, హీరోయిన్ కోసం అర్రులుచాచే అమాయక విలన్ వేయాలన్నా సత్యనారాయణే, ఆరడుగుల హీరోలకు డ్యూప్ వేయలన్నా సత్యనారాయణే, ఆరడుగుల హీరోలకి ఎదురొడ్డి నిలబడాలన్నా సత్యనారాయణే - కైకాల అన్నది తన పెద్ద వాళ్ళ ఇంటి పేరు అయ్యుండవచ్చు, కాని తెలుగు ప్రేక్షక సమాజం ఇచ్చిన, తనకు అన్ని విధాల తగిన ఇంటి పేరు మాత్రం "విలక్షణ నటుడు".
"సూత్రధారులు" చిత్రం సత్యనారాయణ విలనీలో పరాకాష్ట అని చెప్పుకోవాలి. అందులో తెలుగు సినిమా విలన్ కి సహజాతమైన అరుపులు, పెడబొబ్బలు, ఊగుళ్ళూ, రేగుళ్ళూ ఏమీ ఉండవు. ఐదు వందల పై చిలుకు చిత్రాలలో ఒక ధోరణికి అలవాటు పడి కర్కశత్వం అనగానే కళ్ళల్లో ఎర్ర జీర తెచ్చుకుని, పళ్ళు పటపట లాడించి, కంఠస్వరం గద్దించేట్టుగా హెచ్చిస్తూ, నటనలోని అని విభాగాలు మోతాదుకు ఒక మూడు మాత్రలు చేయడం అన్న దానికి దూరానికి జరిగి "సూత్రధారులు"లో కైకాల నటన కనుబొమల ముడి, పెదవుల బిగింపుల మధ్యనే నడుస్తూ ఉంటుంది. సామాజికంగా కింద ఉన్న వారి మీద తన పాత్ర చేసే తొక్కుబాటు అణిచివేత దౌర్జన్యపు చర్యలు, ఎన్నో తరాలుగా పళ్ళెటూళ్ళల్లో వేళ్ళూనుకుపోయిన పెత్తందారీ విష సంస్కృతికి ప్రతినిధిగా, సత్యనారాయణ అభినయం, గ్రామాలలో వర్గ వివక్షలంత, సమాజంలో ఆర్ధిక అంతరాలంత, మనుషుల మధ్య కక్ష కార్పణ్యాలంత సహజంగానూ ఉంటుంది. అదే విశ్వనాథ్ గారి "శృతిలయల్లో" సంగీత వారసత్వం నిలబెడతాడనుకున్న కొడుకుని కోల్పోయి అనాధ పిల్లల్ని తెచ్చుకుని, పెంచుకుని, సంగీత శ్రష్టలుగా తయరుచేసే తండ్రి లాంటి గురువు, గురువు లాంటి తండ్రి పాత్రలో, జీవితంలో అన్ని ఆటుపోటులు ఎదుర్కొన్న పాత్రగా కైకాల గొంతులో వినబడే మార్దవం, కల్లోలం తీరినాక కడలి కుండే ప్రశాంతతను తలపిస్తుంది. "సిరిసిరిమువ్వ" లో తన ఆరడగుల ఆకారన్ని ఒక అవకరం చాటున దాచిపెట్టి, నిస్సహాయ తండ్రిగా కూతురికి జరిగే అనయాన్ని ప్రతిఘటించలేని పూజారి పాత్రలో కాని, "శారద" లో చెల్లి ఆరోగ్య పరిస్థిని బయట చెప్పలేక కుమిలిపోయే అన్న పాత్రలో కాని, సత్యనారాయణ నట విశ్వరూపం బయటపడతాయి.
డైలాగు, అందునా పౌరాణికా డైలాగు అనగానే "ఆగాగు ఆచార్యా దేవా ఏమంటివి ఏమంటివి" అన్నది గీటురాయిగా నిలబడిపోయి నట్టే, డైలాగ్ డెలివరీలో తెలుగు పరిశ్రమలో కొలబద్దలుగా మిగిలిపోయిన వారు ముగ్గురే - యస్వీయార్, ఎన్@టీయార్, మరియూ కైకాల. బ్లాక్ & వైట్ లో ఎన్@టీయార్ కి సమ ఉజ్జీ అయితే, అటు బ్లాక్ & వైట్ లోనూ, ఇటు కలర్ రోజుల్లోనూ ఎప్పటికీ ఎన్@టీయార్ కి మాటకు మాటకు, పద్యానికి పద్యం, దర్పానికి దర్పం దూసి ఎదురు నిలబడ గలిగిన శక్తి, సత్తువ, పటిమ ఉన్నది ముమ్మాటికీ కైకాలకే. ఇక యమధర్మరాజు అంటే సత్యనారాయణను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా ఆ పాత్రకి ఎవరూ ఊహించలేని, ఎక్కడా లేని మనవత్వాన్ని సంతరించి పెట్టాడు సతయనారాయణ. పౌరాణిక పలుకులో ఉండవలసిన స్పష్టత, ఉచ్చారణ, గొంతు, వీటన్నిటికీ మించి భాష మీద పట్టు, సత్యనారాయణ చేసిన అవిరళ కృషికి నిదర్శనంగా నిలుస్తాయి. నిండైన విగ్రహం ప్రకృతి వరం కావచ్చు, కానీ ఆ నిండైన విగ్రహానికి ఎత్తైన కిరీటం పెట్టి, బరువైన గద నిచ్చి, రారాజుని ధిక్కరించే భీముడిగా రౌద్రం, లేక భీముడి పై హుంకరించే దుర్యోధనుడిగా అహం వినిపించాలంటే ప్రకృతి వరాలు, పెద్దల ఆశీర్వాదాలే సరిపోవు. పదం నలిగి, పదబంధనాల మెలికెలలో పలుకు పాదరసంలా ప్రవహించాలంటే, నాలుకను నూరి, పలు వరసలలో దానిని సాన బెట్టి, గొంతు కావాటాల వెనుక ఎవరికీ కనపడని ఎడతెగని ఉచ్చారణ శిక్షణ నెరుపుతూ ఉండాలి. దాని ఫలితమే ఒక రెండు దశాబ్దాల పాటు పౌరాణిక చిత్రాలలో తన పాత్ర, ప్రమేయం, స్థానం లేని చిత్రమే లేకపోవడం, తీయలేకపోవడం, లేకుండా తీయడానికి సాహసించ లేకపోవడం. అంత మేమకం అయిపోయాడు పౌరాణికంతో సత్యనారాయణ.
తనకన్నా ఎన్నో రెట్లు పరిమాణం లోనూ, ప్రమాణలలోనూ తక్కువయిన నటులు కూడా తారలుగా వెలిగిపోతూ, పాత్రపరంగా వారి ఎదురుగా తనని తక్కువ చేసుకుని నటించ వలసి వచ్చినప్పుడు కూడా, ఎటువంటి సంకోచాలకు తావివ్వకుండా చిన్న బుచ్చుకోకుండా తనని చిన్న చేసుకోవడం ద్వారం ఎంతో పెద్దరికం చూపించిన హుందా నటుడు కైకాల సత్యనారాయణ. చిన్న నటులకు ఒక చుక్కానిగా మేటి నటులతో తలపడినప్పుడు మేరు నగధీరుడిగా ఆ తరంలోఅయినా ఈ తరంలోఅయినా ఏ పాత్రలో అయినా ఒడుపుగా కుదురుగా నేర్పుగా ఒదిగిపోగలగిన మట్టి మనిషి మన కైకాల. అగ్గిపెట్టెలో పట్టగల పట్టు చీరను నేసే నేతగాళ్ళ చరిత్ర సృష్టించిన పనితనానికి ఏమాత్రం తీసిపోనిది ఆరడుగుల శరీరాన్ని రావణ బ్రహ్మగా - బుల్లబ్బాయిగా, కానిస్టేబుల్ గా - కరుడు కట్టిన నేరగాడిగా, భర్తగా - భ్రాతగా, తండ్రిగా - తాతగా, విలన్ గా - కమేడియన్ గా, అమాయకుడిగా - జగత్ జెంత్రిగా, ఏ పాత్రలో అయినా అవలీలగా ఇట్టే ఇమిడ్చి పెట్టగలిగిన కైకాల సత్యనారాయణ నేర్పరితనం!
కనుమెరుగైన ఇంతటి విలక్షణత ఇక కనుమరుగయ్యింది! తెర మెరుగు చేసిన తన మేటి నట తీరు ఇక తెరమరుగయ్యింది! మరొక తార రాలింది! ఇలలో రాలి అలలో మరింత వెలుగులు పంచేదుకు తారా పథానికి చేరుకుంది!