pizza

నవ్వుతూ బతకాలిరా....
by Srinivas Kanchibhotla

You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2022
Hyderabad

గొప్ప నటులకు వాడే ' సహజమైన నటన ' అనే పొగడ్తలో పరస్పర వైరుద్ధ్యాలు కనపడతాయి. నటించడం అంటేనే అసహజముగా, ఉన్న దానిని దాచుకుని లేని దానిని ఎత్తి చూపించడం అన్నప్పుడు, సహజమైన నటన అంటే ఇటు సహజత్వము అటు నటన రెండూ కత్తులు దూసుకుని పొడుచుకుని చనిపోయి, చివరికి ఏమీ లేని తనమే, ఒక శూన్యమే అని ... కృష్ణ ఒక సహజమైన నటుడు... తన కాలంలో రాజ్యమేలిన దిగ్గజ నటుల మధ్యలో అతను తెచ్చి పెట్టుకున్న నటన తెలియని నిర్మలుడు. రంగులతో పాటు సమయానికి, అవసరానికి తెచ్చి పెట్టుకున్న భావాల్ని మొహం మీద పులుముకునే నటుల మధ్య కృష్ణ నటించడం అంటే ఏమిటో తెలియని, ఎప్పుడూ అలవరచుకోని ఒక విలక్షణ వ్యక్తి. అతని నవ్వులో దాపరికాలు దోబూచులాడవు, అతని మాటలో గూడార్ధాలు మాటునుండి వెక్కిరించవు, అతని తీరు, వ్యవహారంలో తన బాగు కంటే ఎదుటి వాడి బాధని అర్ధం చేసుకునే తత్వం కనపడుతుంది. కృష్ణ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అతని నటన కంటే తన వ్యక్తిత్వం గురించి మాట్లాడే వారే ఎక్కువ. మూడు పదులు దాటిన అతని నటప్రస్థానంలో శతదినోత్సవాల స్ఫురణల కంటే నిర్మాతల సాధక బాధకాలని అర్ధం చేసుకున్నారన్న ఉదంతాలే ఎక్కువ. డబ్బు పూర్తిగా ముడితే కాని డబ్బింగ్ చెప్పను అని భీష్మించుకుని కూర్చుని నిర్మాతల ముక్కు పిండి చివరి అణాపైసల వరకూ కచ్చిగా, నిక్కచ్చిగా లెక్క తేల్చి చూసుకునే నట కోవిదులు కోకొల్లలుగా ఉన్న పరిశ్రమలో, ఆర్ధికంగా నష్టపోయిన సినిమాకి (దానికి పూర్తిగా తనకు డబ్బు ముట్టకపోయినా సరే) బదులుగా ఉచితంగా మరో సినిమా చేసి పెట్టిన నట వితరుణుడు కృష్ణ. గొప్ప, మేటి, మహా నటులు దిగ్విజయంగా వెలిగిపోయిన కాలంలో, నట బిరుదులు పేర్లకి ముందు అప్పనంగా అతింకించుకుని ఆనందించిన రోజులలో, కృష్ణకు మొదటి రోజుల నుండి, తుది శ్వాస విడిచే వరకూ మిగిలిపోయిన మామూలు బిరుదు "మంచి మనిషి". అవును, అతను నటించడు, అతనికి నటన తెలియదు, అతను నటుడు కాదు.

కృష్ణ ప్రభ వెలిగిన రోజుల గురించి చెప్పుకోవాలంటే, తన కంటే ముందు ఆ రోజుల గురించి చెప్పుకోవాలి. ఒకే సంవత్సరంలో కొద్దో గొప్పో పేరున్న నటులు నటించిన చిత్రాలు పదులకు పైగా విడులవుతున్న రోజులు అవి. 60వ దశకం దాక అంతో ఇంతో కళాత్మక విలువలు ప్రతిబింబించిన చిత్రాలు, 70వ, మరీ ముఖ్యంగా 80వ దశకం వచ్చే సరికి పూర్తి స్థాయి వ్యాపార మాధ్యమాలు అయిపోయినాయి. ఊళ్ళో అంతో ఇంతో మాగాణి అమ్మడం, డబ్బు పట్టుకుని మద్రాస్ నగరానికి చేరడం, కాస్త పేరు మోసిన రచయిత దగ్గర కధ కొనుక్కోవడం, ఉన్న ముల్లెకు సరితూగే నటుడు ఎవరో కనుక్కోవడం, వేలు విడిచిన బంధుత్వమో, మాట కాదనలేని స్నేహితమో ఉన్న దర్శకుడిని కలిసి, తెచ్చుకున్న డబ్బుకీ, కొనుక్కున కధకీ, సరితూగే నటుడిని నిర్ణయించి సినిమా "చుట్టేయడమో"... ఇలా ఉండేది తంతు. ఏడాదికి 20 సినిమాలలో హీరో పాత్ర కి ఒప్పుకున్న నటుడికి తను చేసే 6వ సినిమాకీ 18వ చిత్రానికి మధ్య పాత్రకి సంబంధించిన వ్యత్యాసాలు, సూక్ష్మాలు తెలిసి ఉంటాయని ఆశించడం కించిత్తు అత్యాశే. ఆ కాలంలో నటులు అందరూ కర్మ యోగులు - ఫలితంతో పని లేకుండా తమ కర్మని నిర్వర్తిస్తూ పోవడమే తమ బాధ్యత/కర్తవ్యం. అందరూ అలాగే చేశేవారు, కృష్ణ కూడా అలాగే చేశారు. విడుదలైన 20లో సంఖ్యా పరంగా అయినా ఒకటో రెండో విశేష ప్రేక్షక ఆదరణకు గురి అవడం, ఆ విజయమే ఇంధనంగా పక్క ఏడాది మరో 19-20 సినిమాలు చేసుకుంటూ పోవడం. ఇప్పటి కాలంలో అప్పటి సినీ పని పద్ధతులు చెప్పినా నమ్మలేని నిజాలు, ఊహకు కూడా అందని విచిత్రాలు. అటువంటి కర్మక్షేత్రంలో అలుపెరగని కళా కృషీవలుడు కృష్ణ, వేరే వ్యాపారం వ్యాపకం తెలియని పనితర సాధ్యుడు కృష్ణ. చేసిన ప్రతి చిత్రమూ పది మందినీ మెప్పించకపోయినా, తన వైపు వచ్చిన ప్రతి చిత్రమూ చేసుకుంటూ పోయి ఒక రెండు దశాబ్దాల కాలం పాటు వందల మంది సినీ కార్మికుల ఉపాధికి దోహద కారకుడయ్యాడు. రాయక ఒకళ్ళనీ, రాసి ఒకళ్ళనీ ఏడిపించే వాళ్ళు, ముందు డబ్బు ఇస్తామని చెప్పి, పబ్బం గడిచాక ముఖం చాటేసే వాళ్ళు, నమ్మకం అనే మాట మీదే నమ్మకం పోయేట్టుగా వ్యవరించే వాళ్ళు పుష్కలంగా విచ్చలవిడిగా టోకు వారిగా లభ్యమయ్యే సినీ మాయా జగత్తులో, తన క్రమశిక్షణతో నిబద్ధతతో చిత్రాలు త్వరగా పూర్తి చేసుకుంటూ పోయి, అటు విడుదలకు ముందే నిర్మతలకు డబ్బు మిగిల్చి, హెచ్చు చిత్రాల చేయడం ద్వారా పరిశ్రమను పచ్చగా ఉంచి, ఫలితం తారుమారు అయితే తనను నమ్మి వచ్చిన పెట్టుబడిదారీకి భరోసా ఇచ్చి మరొక అవకాశం కల్పించి, తన భాగ్యం కంటే పక్క వాడి సౌభాగ్యం ముఖ్యం అని త్రికరణ శుద్ధిగా నమ్మి, పరిశ్రమను ఒక కాపు కాసిన కళా కల్పతరువు కృష్ణ.

కృష్ణ నటనా కౌశలానికి అతనికున్న విశేష ప్రజాదరణకు ఎటువంటి పొంతనా కుదరదు. నిజం చెప్పాలంటే అతని నటన కన్నా, అతని పాత్రల ఎంపికలే అతనిని అందలం ఎక్కించినాయి. మూస ధోరణి వాచకం, హాస్యానికి తావు నిచ్చే నృత్యాభినయం, వంక పెట్టకపోయినా చెప్పుకోవడానికి పెద్దగాలేని అభినయం - ఈ మిడిమిడి ముడిసరుకులతో సుమారు ఒక దశాబ్దం పాటు కృష్ణ తెలుగు సినీ ప్రపంచానికి మకుటం లేని రాజుగా ఎలా వెలగ గలిగాడు అన్నడి ఒక బేతాళ ప్రశ్న. కృష్ణ శక్తి అతని ప్రతిభ కాదు, అతని వ్యక్తిత్వం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనుకుంటే, అసలు మనిషే మంచి వాడై, అతను ఎందరికో మంచి చేయగల స్థానంలో ఉండి, ఆ స్థానాన్ని ఉపయోగించి అందరికీ ఉపయోగపడితే, కేవలం ఊరు ఒక్కటే కాదు, మొత్తం లోకమే అతనికి పట్టంగడుతుంది, పాదాక్రాంతమవుతుంది. కృష్ణ అశేష ప్రాముఖ్యానికి ఇదే మూల కారణం. అతను కౌబాయ్ గా వేశాడా, 70 మ్మ్ తెచ్చాడా, ఇవన్నీ పక్కన పెడితే, అతను ఎంత మంది గుండెల్లో మిగిలిపోగలిగాడు అన్నదే ప్రస్తుతమవుతుంది. కృష్ణ అనగానే అతను వేసిన పాత్రలు గుర్తుకు రావు, అతను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు గుర్తుకురావు, కృష్ణ అనగానే, స్వచ్చమైన, నిషకల్మష, నిర్మలమైన నవ్వు ముందుకు తోసుకు వస్తాయి. కృష్ణ వ్యక్తి కాడు, వ్యక్తిత్వం. అతను నామావచకం కాదు, అతను ఒక విశేష విశేషణం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved