Bhagyashri Borse about Lenin
'లెనిన్' లో భారతి పాత్రకు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ జీవితాంతం మర్చిపోలేను. ప్రేక్షకులు నన్ను ఓ తెలుగు అమ్మాయిలా ఆదరిస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. 'లెనిన్' విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే
''లెనిన్' విజయం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. 'భారతి' పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది' అని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నారు. అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన 'లెనిన్' చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ బోర్సే సినిమా విజయంతో పాటు తన పాత్రకు లభిస్తున్న స్పందన, సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
'లెనిన్' విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
-ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా గురించి, నా నటన గురించి ఎంతో మంచి మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ విజయం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
ఈ సినిమా విషయంలో మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. మీకు ఇందులో అంతగా నచ్చిన అంశం ఏమిటి?
-ప్రతి సినిమాను ఎంతో ఇష్టంతోనే చేస్తాం. ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. 'లెనిన్' విషయంలో ఒక మంచి కథ దొరికింది. మేమంతా ఈ సినిమాను బలంగా నమ్మాం. మా నమ్మకం నిజం కావడంతో ఈ విజయం మరింత భావోద్వేగంగా అనిపించింది.
-నా కెరీర్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగు అమ్మాయిలానే చూస్తున్నారు. వారి అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞురాలినే.
-నా చివరి సినిమా వరకు హైదరాబాద్‌లోనే ఉంటాను, ఈ పరిశ్రమలోనే కొనసాగుతాను అని చెప్పారు. హైదరాబాద్ మీకు ఎందుకు అంత ప్రత్యేకం?
-తెలుగు సినిమా నాకు నటిగా అవకాశం ఇచ్చింది. నా తొలి సినిమా ప్రయాణం హైదరాబాద్ నుంచే ప్రారంభమైంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమగా ఆదరించారు. తెలుగు అమ్మాయిలాగే నన్ను చూసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్, తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు కథ చెప్పినప్పుడు 'భారతి' పాత్రకు ఇంత మంచి స్పందన వస్తుందని ఊహించారా?
-ఇది ఒక అందమైన కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే నా మనసును హత్తుకుంది. ఈ పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు 'భారతి' పాత్రను ఇంతగా అభిమానించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏది?
-ఒక్కటే చెప్పడం కష్టం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'భారతి' పాత్ర గురించి ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. చాలా రివ్యూల్లో కూడా నా నటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రశంసలు నాకు ఆనందంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయి. ఇకపై ఇంకా మంచి కథలు, మంచి పాత్రలు ఎంపిక చేసుకోవాలనే బాధ్యతను గుర్తు చేశాయి.
-అన్నిటికంటే ముఖ్యంగా నాగార్జున గారు వేదికపై నా నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమా చూసిన తర్వాత మీ అమ్మానాన్నల స్పందన ఎలా ఉంది?
- అమ్మగారు నాకు ఫోన్ చేశారు. తనకు సినిమా చాలా నచ్చింది. నా నటన కూడా ఎంతో బాగా అనిపించిందన్నారు. అయితే నా పాత్ర ముగింపు చూసి ఒక తల్లిగా చాలా ఎమోషనల్ అయ్యారు. అలాంటి ముగింపును ఏ తల్లి కూడా కోరుకోదు కదా. 'భారతి' పాత్రతో ఆమె చాలా భావోద్వేగానికి గురయ్యారు. మా పేరెంట్స్ నా నటనపై చాలా సంతోషంగా ఉన్నారు.
అఖిల్ గారితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
ఇది 'లెనిన్-భారతి' ప్రేమకథ. అందుకే మా ఇద్దరి పాత్రలు తెరపై చాలా సహజంగా కనిపించేలా ప్రతి సన్నివేశంపై ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశాం. అఖిల్ చాలా అద్భుతమైన డ్యాన్సర్, పెర్ఫార్మర్. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం. ఆయనకు ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను.
నాగార్జున గారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
మొదటి నుంచే నాగార్జున గారికి ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉంది. మేమంతా ఎంతో కష్టపడి పని చేశాం. ఆయన ప్రోత్సాహం ఎప్పుడూ మా వెంటే ఉంది.
భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
లార్జర్ దాన్ లైఫ్ సినిమాల్లో మహారాణి, యువరాణి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి చిత్రాల విషయంలో రాజమౌళి గారు మాస్టర్. ఎప్పుడో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని నా కోరిక.
మహిళా ప్రధాన చిత్రాలు చేయాలనే ఆసక్తి ఉందా?
'మా ఇంటి బంగారం' సినిమా చూసిన తర్వాత నిజంగా 'వావ్' అనిపించింది. సమంత గారు అద్భుతంగా నటించారు. మాలాంటి కొత్త నటీమణులకు ఆమె ఒక దారి చూపించారు. అవకాశం వస్తే అలాంటి మహిళా ప్రధాన పాత్రలు కూడా చేయాలని ఉంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి?
ప్రస్తుతం శివకార్తికేయన్‌తో 'సీయోన్' సినిమా చేస్తున్నాను. షూటింగ్ దశలో ఉంది. మరో కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. అలాగే తెలుగులో కూడా కథలు వింటున్నాను. మనసుకు నచ్చే పాత్ర అయితే తప్పకుండా చేస్తాను.