Pallaburusu Pre Release Press Meet
‘పళ్ళ బురుసు’ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది: ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్నగారు ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాం. నాన్నగారు సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం. మొన్ననే 'లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నా ‘కింగ్ 100’ కూడా రాబోతోంది. ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ చాలా బిజీగా ఉంటుంది. ఇకపై మరింత జోరుగా సినిమాలు చేయబోతున్నాం. ‘పళ్ళ బురుసు’ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నా తల్లిదండ్రులను నేను చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు చూసుకున్నారు. మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలి. అమల తన పేరెంట్స్ ని అద్భుతంగా చూసుకుంటుంది. తనతో ఎప్పుడూ చెబుతుంటాను.. తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని. తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ముఖ్యం. ఉదయ్ నాకు కథ చెప్పినప్పుడు ఇదే విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఈ కథను అతను చాలా ఎంటర్టైనింగ్‌గా చెప్పాడు. సుధాకర్ రెడ్డి గారు, శంభూతాత పాత్రలో అద్భుతంగా చేశారు. మురళీధర్ గౌడ్ గారి నటన కూడా చాలా బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చక్కని నటన కనబరిచారు. చాలా మంచి టీమ్‌వర్క్‌తో చేసిన సినిమా ఇది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. పవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్‌ను నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. ఈ సినిమాకు కూడా ఆయన చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే, నేను తప్పకుండా కథ వింటాను. అన్నపూర్ణ కాలేజీకి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు తెలంగాణ కల్చర్‌పై ఎందుకు ఒక సినిమా తీయకూడదని అడిగారు. పళ్ళ బురుసు నేపధ్యానికి సంబంధించిన చక్కని కథ. ఆగస్టు 14 మా అమ్మగారి పుట్టినరోజు. అమ్మానాన్నల ఆశీస్సులు ఈ సినిమాపై ఉంటాయని నాకు నమ్మకం ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
నిర్మాత వివేక్ కృష్ణాణి మాట్లాడుతూ: అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం నాకు ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా జర్నీలో వారితో కలిసి భాగం కావడం మరింత ఆనందంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ నా జీవితంలో చాలా ప్రత్యేకమైన సంస్థ ఉంది. దర్శకుడు ఉదయ్ తన గొప్ప విజన్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సుప్రియ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నాగార్జున గారికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆగస్టు 14న అందరం థియేటర్లలో కలుద్దాం.
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ: “ఈ కథ మొదటిసారి విన్నప్పుడే సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాను. చాలా స్వీట్ స్టోరీ. ఇలాంటి కథను చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ కొత్త కథలనే వెతుకుతుంది. ఈసారి ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య ఉండి ఉంటే కచ్చితంగా ‘మంచి పని చేశావు’ అని చెప్పేవారు. కొత్తవాళ్లతో పాటు సీనియర్ యాక్టర్స్ కలిసి చేసిన సినిమా ఇది. ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో చాలా లోతైన సందేశం కూడా ఉంది. ఈ సినిమా చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది.”
డైరెక్టర్ ఉదయ్ చౌహన్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. నాకు పునర్జన్మనిచ్చిన అమ్మలాంటి ప్రొడక్షన్ హౌస్‌లు అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్‌కి థాంక్యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారికి వీరాభిమానిని. ఆయన సినిమాల ప్రభావం నాపై ఎంతో ఉంది. అలాంటి నాగార్జున గారికి నా కథ చెప్పే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ అవకాశం వచ్చినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో నాకు మాత్రమే తెలుసు. సుప్రియ గారు ఈ కథ వినగానే కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పారు. నాగచైతన్య గారు కథ విని చాలా స్వీట్‌గా ఉందని అన్నారు. అలాగే ప్రసాద్ గారికి కథ చెప్పగానే రైటింగ్‌ను చాలా మెచ్చుకున్నారు. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలు, సన్నివేశాలను నేను పరిశీలించిన అంశాలను ఇందులో చూపించాను. ‘పళ్ళ బురుసు’ అంటే టూత్ బ్రష్. పొద్దున్నే నిద్రలేచిన వెంటనే మనం పళ్లు తోముకోవడానికి ఉపయోగించే ఒక వస్తువుతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న విషయాన్ని పెద్ద కథగా మార్చాలి, అందులో కొత్తదనం, తాజాదనం తీసుకురావాలి అనే ఆలోచనతో చేశాను. కథ రాసుకున్న తర్వాత ఇలాంటి కథను చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎవరికి చెప్పాలి అని ఆలోచన ప్రతి రచయితకూ ఉంటుంది. నాగార్జున గారు ఈ కథ వినగానే అంగీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రసాద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సుధాకర్ రెడ్డి గారు, మురళీధర్ గారు, గోమతి, ప్రజ్వల్ అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఆగస్టు 14న మీరందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరి మనుసులని హత్తుకునే సినిమా ఇది.
మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ: “నాగేశ్వరరావు గారి సినిమాలు, రామారావు గారి సినిమాలు చూసి పెరిగిన నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇలాంటి అవకాశం వస్తుందని జీవితంలో ఊహించలేదు. ఇలాంటి గొప్ప సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ‘పళ్ళ బురుసు’ సినిమా మీ అందరినీ అలరిస్తుందని, ఆనందపరుస్తుందని నమ్ముతున్నాను. అలాగే ఇందులోని కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ‘శివ’ సినిమా విడుదలైనప్పుడు మేమందరం బళ్లు కట్టుకుని థియేటర్‌కు వచ్చి సినిమా చూశాం. నాలాంటి గ్రామీణ కళాకారులకు ఈరోజు స్టేజ్ మీద నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మహానుభావులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు 79. ఇది హీరోగా నాకు మూడో సినిమా. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి. నన్ను నమ్మి, నా కోసం పెట్టుబడి పెట్టిన మహానుభావులందరికీ నమస్కారం. నాగేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆశీర్వాదం మా మీద ఉంటుంది. ‘పళ్ళ బురుసు’ అనే పేరు వినడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ సినిమా చూడటానికి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు.
ప్రజ్వల్ మాట్లాడుతూ: “నాగార్జున గారికి థాంక్యూ. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నటించే అవకాశం, ఇలాంటి సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి సినిమా. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
గోమతి మాట్లాడుతూ: “నేను ఈ సినిమాతో నటిగా పరిచయం అవుతున్నాను. అన్నపూర్ణ స్టూడియో నాకు హోమ్‌లాంటిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ థియేటర్లలో చూడాలి. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.”
మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ మాట్లాడుతూ: నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రత్యేకమైన, చాలా అరుదైన సినిమాలను ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఈ సినిమాను మేమంతా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మా టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ: “నాగార్జున గారి ఎదురుగా నిలుచుని మాట్లాడటం చాలా గొప్ప ఆనందంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక సినిమాకు అన్ని పాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటలు రాస్తున్నప్పుడు ఒక పల్లె గురించి రాస్తున్న అనుభూతి కలిగింది. డాక్టర్ ఉదయ్ గారికి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరి మనసులను గెలుచుకుంటుంది' ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు,