pizza

Jagapathi Babu about Peddi
'పెద్ది'లో చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది. పెద్ది ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. పెద్దితో పరిశ్రమ గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది: వెర్సటైల్ స్టార్ జగపతి బాబు

You are at idlebrain.com > news today >

27 May 2026
Hyderabad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వెర్సటైల్ స్టార్ జగపతి బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

'పెద్ది'లో అప్పలసూరి పాత్ర చాలా కొత్తగా కనిపిస్తోంది.. అది ఎలా సాధ్యమైంది?
-ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుంది. ఆయన ఆ పాత్రను అలా ఉండాలని కోరుకున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ ని డిజైన్ చేశారు. మొదటిసారి ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. గెటప్ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఈ సినిమా మొత్తం జగపతి బాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు.

-నాకు ఈ పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎమోషనల్‌గా, పెర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ నాకు చాలా నచ్చిన పాత్ర ఇది. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం.

-లెజెండ్ తర్వాత చాలా సినిమాలు చేశాను. కానీ వాటిలో గుర్తుపెట్టుకునేవి ఓ ఆరు వుంటాయి. ఆ జాబితాలో 'పెద్ది'లో చేసిన అప్పలసూరి నంబర్ వన్ స్థానంలో ఉంటుంది.

ఇందులో మీది తండ్రి పాత్రనా?
- తండ్రి పాత్ర కాదు. చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర చేశాను. నాకు, రామ్ చరణ్ పాత్రకు మధ్య బ్యూటీఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.

అప్పలసూరి పాత్రకు డబ్బింగ్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది కదా?
-నిజంగా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఒక ఛాలెంజ్. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఆ పాత్రలో మ్యాజిక్ ఉంది. ఆ యాసలో కూడా మ్యాజిక్ ఉంది. అలాంటి పాత్ర దొరికినప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను.

-ఈ సినిమాకు డబ్బింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరోజంతా కూర్చుని రెండు డైలాగులు మాత్రమే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పలసూరి బయటకు రావాలంటే అతని వాయిస్ తోనే రావాలి. ఆ పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకెవ్వరూ కనిపించకూడదు అనేది నా ప్రయత్నం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 'పెద్ది' మరో ఎత్తు.

బుచ్చిబాబు గారికి, సుకుమార్ గారికి మధ్య మీరు గమనించిన సారూప్యత ఏమిటి?
-ఆర్టిస్ట్‌గా నాకు కిక్ ఇచ్చే దర్శకులు వాళ్లు. బుచ్చిబాబు ఈ సినిమాతో నాపై చాలా పని పెట్టారు. సుకుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక విషయం చెబుతాను... 'పుష్ప' డబ్బింగ్ సమయంలో నేను కూర్చొని డబ్బింగ్ చెబుతున్నాను. అప్పుడు సుకుమార్ గారికి ఒక వాయిస్ మెసేజ్ పంపాను. ఎలా అర్థమైందో తెలియదు కానీ, "సార్... నిలబడి డబ్బింగ్ చెప్పండి" అన్నారు.

-నిజంగా ఆయనకు ఎలా తెలిసిందో ఇప్పటికీ అర్థం కాదు. డబ్బింగ్ థియేటర్‌లో నడవడం కుదరదు. కానీ చివరకు ఒక మైక్ తీసుకొచ్చి నేను నడుస్తూ ఉండగా రికార్డ్ చేశారు. అక్కడ ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. డబ్బింగ్‌లో కూడా మనం పాత్రలో జీవించాలి. బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరూ పూర్తి క్లారిటీతో ఉంటారు. దర్శకుడికి క్లారిటీ ఉంటే నటుడి పని చాలా సులభమవుతుంది.

అప్పలసూరి పాత్రలో ప్రత్యేకత ఏమిటి?
-ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరి లాంటి ఎమోషన్, లుక్, డెప్త్ ఏ పాత్రలోనూ లేదు. నేను ఎందుకు ఇంత బలంగా చెబుతున్నానో మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమా చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను.

-పాత్ర ఎంతసేపు ఉంటుంది అనేది ముఖ్యం కాదు. ఉన్నంతసేపు ఎంత ప్రభావం చూపిస్తుంది అనేదే ముఖ్యం. అప్పలసూరి పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది.

'రంగస్థలం' తర్వాత మళ్లీ రామ్ చరణ్‌తో పనిచేశారు. ఆ అనుభవం ఎలా ఉంది?
-రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పలకరింపులోనే ఒక ఆప్యాయత ఉంటుంది. వ్యక్తిగా చాలా మంచివాడు. మా కుటుంబం మొత్తం చరణ్ ని ఇష్టపడతారు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చూసి ఆశ్చర్యపోయాను. దెబ్బలు తిన్నారు, రక్తం కారింది. ఎక్కడా డూప్ ఉపయోగించకుండా స్వయంగా చేశారు. 'రంగస్థలం' నుంచి చరణ్ నటుడిగా నిరంతరం ఎదుగుతూనే ఉన్నారు. ప్రతి సినిమాకు మరింత అందంగా కనిపిస్తున్నారు. ఆయనకు అలాంటి మంచి పాత్రలు వస్తున్నాయి.

డైరెక్టర్ బుచ్చిబాబు గురించి?
బుచ్చిబాబు చాలా ప్రేమగా, వినయంగా ఉంటారు. అందరూ ఆయనను ఇష్టపడతారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారు. 'రంగస్థలం' రోజుల నుంచే నాకు ఆయన పరిచయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది.

నిర్మాత సతీష్ కిలారు గురించి?
నిజంగా సతీష్ గారు అదృష్టవంతుడు. రామ్ చరణ్ ఎప్పుడో ఇచ్చిన మాటను గుర్తుంచుకుని ఈ సినిమా ఆయనకు చేశారు. అక్కడే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. సతీష్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ప్రేమతో పనిచేశారు.

ప్రోస్థెటిక్ మేకప్ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
-ప్రోస్థెటిక్ మేకప్‌లో చాలానే సవాళ్లు ఉంటాయి. చర్మంపై దద్దుర్లు, మొటిమలు వచ్చేవి. వాటికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది. ప్రతిరోజూ మేకప్‌కు దాదాపు మూడు గంటల సమయం పట్టేది. అయినా ఈ పాత్ర కోసం చేసిన శ్రమ మొత్తం విలువైనదిగా అనిపించింది.

ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి?
రెహమాన్ గారు ఇచ్చిన ప్రతి పాట ఒకదానికంటే మరొకటి పెద్ద హిట్ అయ్యింది. అక్కడే సినిమా సగం సక్సెస్ అయినట్టే.

- పెద్ది ఈరోజు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లాంటి సినిమా. గట్టిగా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. ఒక నటుడుగా నేను కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. మంచి క్యారెక్టర్ దొరికింది అనే సంతోషం ఉంది.

డీవోపీ రత్నవేలు గురించి?
-రత్నవేలుతో పనిచేయడం ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన అర్టిస్టిక్ కేర్ తో, టెక్నికల్ పరంగా అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుంటారు. సెట్‌లో ఆయన ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

ఈ సినిమాలో మీకు కష్టంగా అనిపించిన అంశం ఏదైనా ఉందా?
-ఈ సినిమాను ఎంతో ఇష్టంతో చేశాను. అయితే డబ్బింగ్ మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఇప్పటివరకు డబ్బింగ్ కోసం నేను ఎక్కువ కష్టపడిన సినిమా 'అరవింద సమేత'. ఆ పాత్ర కోసం చాలా శ్రమపడ్డాను. కానీ 'పెద్ది'లో అప్పలసూరి పాత్ర కోసం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి చాలా సమయం, శ్రమ పెట్టాను.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల గురించి?
-ప్రస్తుతం సోనీ లివ్ కోసం 'బ్లాక్ అండ్ వైట్' అనే భారీ వెబ్ సిరీస్ చేస్తున్నాను. చాలా పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న ప్రాజెక్ట్ అది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved