pizza

K. Niharika Dasari about Raja The Raja
'రాజా ది రాజా' అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. తొలి సినిమాకే రుత్విక్ ఎంతో ఛాలెంజింగ్ పాత్ర చేశాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. జూలై 17న ప్రేక్షకులంతా థియేటర్లలో సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను: నిర్మాత కె. నిహారిక దాసరి

You are at idlebrain.com > news today >

13 July 2026
Hyderabad

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నిర్మాతగా మారాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది?
నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. రుత్విక్‌కు సినిమాలంటే చాలా ప్యాషన్. అమెరికాలో ఫిల్మ్ కోర్స్ చేశాడు. అదే సమయంలో ఒక షార్ట్ ఫిల్మ్‌లో అబ్బాయి, అమ్మాయి రెండు రకాల పాత్రలు చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత తనపై నాకు మరింత నమ్మకం పెరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి తన కోసం కొన్ని కథలు కూడా వచ్చాయి. కానీ ఒక మంచి ఛాలెంజింగ్ పాత్రతో హీరోగా పరిచయం చేయాలనుకున్నాం. అలా 'రాజా ది రాజా' కథ మా దగ్గరకు వచ్చింది.

ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
-ఇది చాలా బలమైన కథ. ఇందులో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఏ నటుడికైనా ఇది పెద్ద ఛాలెంజ్. రుత్విక్ ఆ రిస్క్ తీసుకుని ఈ సినిమా చేశాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం వంద శాతం కష్టపడ్డారు. కథ పరంగా కూడా మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత మేము అనుకున్నదానికంటే ఇంకా బాగా వచ్చిందనే సంతృప్తి కలిగింది.

ట్రైలర్ చూసిన తర్వాత 'మగధీర'తో పోలుస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
-సినిమా తీస్తున్నప్పుడు మాకు అలాంటి ఆలోచన రాలేదు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత చాలామంది 'మగధీర' వంటి గొప్ప సినిమాతో పోల్చడం ఆనందంగా అనిపించింది. అయితే రెండు కథలకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూసిన తర్వాత అసలు ట్విస్ట్ మీకే తెలుస్తుంది.

రుత్విక్ గురించి?
రుత్విక్‌కు తనపై చాలా ఆత్మవిశ్వాసం ఉంది. ప్రేక్షకులను అలరించగలననే నమ్మకంతో సినిమా చేశాడు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచే స్కూల్‌లో స్కిట్స్ చేసేవాడు. చదువు పూర్తయ్యాక తనకు ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చాడు.

-తను చాలా ప్యాషనేట్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ ప్యాషన్‌ను గుర్తిస్తారు. అలాగే ఒక మంచి నటుడిగా ఆయనను ఆదరిస్తారని నమ్ముతున్నాను.

-ఈ సినిమా కోసం రుత్విక్ మెథడ్ యాక్టింగ్ చేశాడు. మొదట్లో నాకు అది అర్థం కాలేదు. కానీ ఒక సీన్ పూర్తయ్యాక యూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. అలాగే సినిమాలో ఉన్న రిస్కీ యాక్షన్ సన్నివేశాలన్నీ తానే స్వయంగా చేశాడు. షూటింగ్ సమయంలో నాకు చాలా భయమేసేది. తొలి సినిమాకే ఇలాంటి రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదు. ప్రేక్షకులు తప్పకుండా అతని కష్టాన్ని గుర్తిస్తారని నమ్ముతున్నాను.

భవిష్యత్తులో కూడా నిర్మాణం కొనసాగిస్తారా?
-ఖచ్చితంగా కొనసాగిస్తాను. ఇండస్ట్రీలో అందరూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా స్వాగతించారు. ట్రైలర్, టీజర్‌కు ఎంత మంచి స్పందన వచ్చిందో, సినిమా కూడా అంతే మంచి ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను.

షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది?
దాదాపు 80 రోజులకు పైగా షూటింగ్ చేశాం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్లు కూడా నిర్మించాం. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది.

హీరోయిన్, ఇతర నటీనటుల గురించి?
-ఈ పాత్రకు విశాఖ ధిమాన్ పర్ఫెక్ట్ అనిపించింది. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది.
అలాగే సాయికుమార్ గారు, నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు మాకు ఎంతో సహకరించారు. మేము ఇండస్ట్రీకి కొత్తవాళ్లమనే భావన ఎక్కడా రాకుండా ఎంతో ప్రోత్సహించారు.

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా విడుదల కావడం ఎలా అనిపిస్తోంది?
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మాకు వంద శాతం సపోర్ట్ చేస్తున్నారు. వారు మా సినిమాను విడుదల చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. రవి గారికి, నవీన్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాము.

ప్రేక్షకులు ఈ సినిమాలో ఏమి ఆశించొచ్చు?
ఇది ఒక మంచి ఫీల్‌గుడ్ మూవీ. అన్ని వయసుల ప్రేక్షకులకు నచ్చే సినిమా. నాలుగు పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. హీరో, హీరోయిన్ జంట కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇద్దరూ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా, క్యూట్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది.

నిర్మాతగా మారిన తర్వాత జీవితం ఎలా మారింది?
చాలా మారింది. నా కుటుంబం, స్నేహితులు ఎంతో సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా అత్తగారు నన్ను చాలా ప్రోత్సహించారు.

దర్శకుడు అనిల్ గురించి?
అనిల్ చాలా క్రియేటివ్ వ్యక్తి. ఈ సినిమా కథ, షూటింగ్ విషయంలో చాలా హోమ్‌వర్క్ చేశారు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో సినిమాను తెరకెక్కించారు.

చివరిగా... ప్రేక్షకులకు ఏం చెబుతారు?
ఈ సినిమాను మేమంతా ఎంతో కష్టపడి తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. జూలై 17న అందరూ థియేటర్లలో 'రాజా ది రాజా' చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
s