pizza

Global Star Ram Charan becomes first Indian celebrity to be awarded the AMBASSADOR for INDIAN Art & Culture at the Indian Film Festival of Melbourne
ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఇండియ‌న్ ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అవార్డ్ అందుకోనున్న‌ తొలి ఇండియ‌న్ సెల‌బ్రిటీ గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్

You are at idlebrain.com > news today >

19 July 2024
Hyderabad

ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్(ఐఎఫ్ఎఫ్ఎం) 15 ఎడిష‌న్‌కు గెస్ట్ ఆఫ్ హాన‌ర్ అవార్డును గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అందుకోనున్నారు. మెల్‌బోర్న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఇండియ‌న్ సినీ అవార్డుల‌కు రామ్ చ‌ర‌ణ్ త‌న స్టార్ పవ‌ర్‌ను జోడించ‌టం అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర పరిశ్ర‌మలో భారీ విజ‌యాల‌ను ద‌క్కించుకుని రామ్ చ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకున్నారు. IFFM అనేది ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ వేడుక‌లు 15-25 ఆగస్టు 2024 వరకు జరగ‌నున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ న‌టించిన RRR చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించ‌ట‌మే కాదు, అందులోని ‘నాటు నాటు..’ పాట‌కు ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇది ఇండియ‌న్ సినిమాకు ఎంతో గ‌ర్వ కార‌ణంగా నిలిచింది. ఇది రామ్ చ‌ర‌ణ్‌కు విజ‌యాన్ని అందించ‌టంతో పాటు భార‌తీయ సినిమాపై తిరుగులేని ప్ర‌భావాన్ని చూపించింది. అలాగే రామ్ చ‌ర‌ణ్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ద‌క్కింది.

ఇండియ‌న్ సినిమాల్లో లెజెండ్రీ న‌టుడైన చిరంజీవి త‌న‌యుడిగా రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు త‌న‌దైన ముద్ర వేశారు. ఆయ‌న ఇండియ‌న్ సినిమాకు చేసిన కృషి అసాధార‌ణ‌మైన‌ది. అలాంటి న‌టుడు IFFMలో పాల్గొన‌టం అనేది ఆయ‌న‌కు మ‌రింత గుర్తింపును తెచ్చి పెట్ట‌ట‌మే కాదు ఇండియ‌న సినిమాకు చేసిన స‌పోర్ట్‌కు మ‌రో మెట్టుకు ఎక్కించేలా ఉంది.

ఈ IFFM వేడుక‌ల్లో గౌర‌వ అతిథిగా ఉండ‌టంతో పాటు.. ఇండియ‌న్ సినిమాకు ఆయ‌న చేసిన సేవ‌కుగానూ ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చ‌ర్ అంబాసిడర్‌గా అందుకోనున్నారు. ఈ ఫెస్టివ‌ల్‌లో చ‌ర‌ణ్ పాల్గొన‌టం అనేది ఆయ‌న గౌర‌వాన్ని మ‌రింత‌గా పెంపొందిస్తోంది. త‌ద్వారా చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మలో త‌న అద్భుత‌మైన ప్ర‌యాణాన్ని ఇది తెలియ‌చేస్తుంది.

ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ‘‘ మ‌న భార‌తీయ చిత్రాల్లోని వైవిధ్యాన్ని, గొప్ప‌దనాన్ని ఇలాంటి ఓ అంత‌ర్జాతీయ వేదిక‌గా ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌టం ఆనందంగా ఉంది. అలాంటి ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావ‌టం అనేది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. ఈ వేదిక‌పై మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌పున నేను ప్రాతినిద్యం వ‌హించ‌టం ఆనందంగా ఉంది. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్ర‌ముఖుల‌తో క‌నెక్ట్ కావ‌టం అనేది మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. ట్రిపులార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుందో అంద‌రికీ తెలుసు. ఆ సినిమాను ఆద‌రించిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మెల్‌బోర్న్‌లో ఆ సినిమాకు సంబంధించిన క్ష‌ణాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకోవ‌టం నాకు మాట‌ల్లో చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగిస్తోంది. మెల్‌బోర్న్‌లో మ‌న జాతీయ జెండాను ఎగుర‌వేసే అద్భుత‌మైన అవ‌కాశం కోసం నేను ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

IFFM డైరెక్టర్ మితు బౌమిక్ లాంగ్ మాట్లాడుతూ ‘‘IFFM 15 ఎడిషన్ సినీ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొనబోతుండటం అందరిలో ఆస‌క్తిని పెంచ‌టంతో పాటు మాకెంతో గౌర‌వంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టుడిగా ఆయ‌న క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఇండియ‌న్ సినిమాలో ప్ర‌భావంతమైన న‌టుల్లో ఒక‌రిగా నిల‌బెట్టింది. ఆయ‌న్ని మెల్‌బోర్న్‌కు సాద‌రంగా స్వాగతించ‌టానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఆయ‌న విజ‌యాల‌ను ఇక్క‌డ మ‌రింత ఘ‌నంగా జ‌రుపుకోబోతున్నాం’’ అన్నారు.

ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన‌బోతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. అలాగే అంద‌రికీ మ‌ర‌చిపోలేని అనుభూతిని క‌లిగిస్తుంద‌ని క‌మిటీ తెలియ‌జేసింది. ఈ 15వ ఎడిష‌ను చాలా వైభ‌వంగా ఓ మైలురాయిలా నిల‌చిపోయేటట్లు సెల‌బ్రేట్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సద‌ర‌న్ హెమీస్పియ‌ర్‌లో జ‌రిగే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో IFFM ఒక‌టి.

రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌ను రామ్ చ‌ర‌ణ్ పూర్తి చేశారు. శంకర్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ క‌థానాయిక‌. త్వ‌ర‌లోనే RC16ను ప్రారంభించ‌నున్నారు. ఇందులో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌. అలాగే RC17 సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved