ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు రచయితగా, దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, తొలి రెండు పాటలు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్‌లో మరో గ్రాండ్ సెలబ్రేషన్‌కు ‘రియాలిటీ’ సిద్ధమైంది.
మ్యూజికల్ ప్రమోషన్స్‌ను కొనసాగిస్తూ మేకర్స్ తాజాగా సినిమాలోని సందడిగా సాగే సంగీత్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాకినాడలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో సాంగ్ ను లాంచ్ చేశారు.
పెళ్లి వేడుకల్లో ఉండే పండగ వాతావరణాన్ని ఈ పాటలో అందంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే బీట్స్‌తో హై ఎనర్జీ పార్టీ ట్రాక్‌ను అందించారు. కిరణ్ అబ్బవరం తన సాంగీత్ వేడుకకు అతిథులను ఆహ్వానించడంతో పాట ప్రారంభమవుతుంది. పెద్దవాళ్ల నుంచి యువత వరకు అన్ని వయసుల వారు ఈ వేడుకలో భాగం కావడంతో పాట మొదటి నుంచే సందడి వాతావరణం నెలకొంటుంది.
సురేష్ గంగుల రాసిన ఈ పాటలో సంగీత్ వేడుకల్లో ఉండే అసలైన సరదా, అల్లరి కనిపిస్తుంది. జంట మధ్య సరదా ఆటపట్టింపులు, బావా మరదళ్ల మధ్య చిలిపి సరదాలు, యూత్‌ఫుల్ అల్లరి, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, పెళ్లి వేడుకల్లో ఉండే ఆనందాన్ని పాటలో చక్కగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో తన మ్యూజిక్ మాడ్యులేషన్స్‌తో పాటను ఆద్యంతం కలర్‌ఫుల్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు.
వేదవతి భాగవతరిణి, కుంచె రఘు, రోహిణి సొర్రాట్, శ్రీకృష్ణ, సాహితి చాగంటి, నల్గొండ నర్సన్న ఈ పాటకు వోకల్స్ అందించారు. వీరి ఎనర్జిటిక్ వాయిస్ పాటలోని సెలబ్రేషన్ మూడ్‌ను మరింత పెంచింది. బీట్‌కు తగ్గట్టుగా వారి వాయిస్ పాటను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.
విజయ్ పొలాకి కొరియోగ్రఫీ సంగీత్ వేడుకల బ్యాక్‌డ్రాప్‌కు చక్కగా కుదిరింది. కుటుంబంలోని అందరూ డ్యాన్స్‌లు చేస్తూ వేడుకలో భాగం కావడం పాటకు మరింత విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. కిరణ్ అబ్బవరం, దేవిక భట్ వేడుకలకు లీడ్ చేయగా, పూజిత పొన్నాడ కూడా డ్యాన్స్‌లో జాయిన్ అయ్యారు. సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ కూడా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీంతో ఈ పాట ఒక అందమైన ఫ్యామిలీ సెలబ్రేషన్‌లా మారింది.
పెప్పీ బీట్స్, కలర్‌ఫుల్ విజువల్స్, ఎంటర్‌టైనింగ్ కొరియోగ్రఫీ, కుటుంబ సభ్యుల సందడితో రూపొందిన ఈ సాంగ్ పెళ్లిళ్లు, సంగీత్ వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో బెస్ట్ చాయిస్ గా నిలవనుంది.
ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైన్ చూస్తుండగా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, రాజేష్ కామారసు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ‘రియాలిటీ’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కాకినాడ రావడం, మీ అందరి మధ్య ఈ సాంగ్‌ను లాంచ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. విశ్వాస్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులు అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే నేను ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా హాయిగా సినిమా చేయగలిగాను. అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఈ ఈవెంట్‌కు మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు హీరో. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ‘భజగోవిందం’, ‘రుత్తు’ పాటలకు మీరు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. పెళ్లి వేడుకల్లో అయినా, మరే ఇతర వేడుకల్లో అయినాసంగీత్ పాటను ప్లే చేయండి. ఫ్యామిలీ, యూత్ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఈ పాట ఉంటుంది. ఒకే పాటకు అన్ని జనరేషన్స్ వాళ్లు డ్యాన్స్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాటను రూపొందించాం. ఈ పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. భీమ్స్ గారు ఈ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఎన్నో వెర్షన్స్ చేశారు. సురేష్ గారు చాలా అద్భుతమైన లిరిక్స్ రాశారు. మా హీరోయిన్ దేవిక చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. సురేష్ అన్నకు థాంక్యూ. నిజంగా ఒక తమ్ముడిలాగే నన్ను చూసుకున్నారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే ఫస్ట్ క్రెడిట్ మా నిర్మాత సుధాకర్ గారికే ఇస్తాను. ఎంత అడిగితే అంత, ఏం కావాలంటే అది ఇచ్చి సపోర్ట్ చేశారు. నిజంగా ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా చూసుకుంటారు. నా సినిమా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది. ‘రాజా వారు రాణి గారు’ సినిమా నవంబర్ 29న రిలీజ్ అయింది. తెలియకుండానే ఆరేళ్ల జర్నీ పూర్తయింది. ఈ జర్నీలో మీరు నాకు చెప్పలేనంత ప్రేమ ఇచ్చారు. నన్ను ఆదరిస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.‘కె., కే ర్యాంప్ , ‘చెన్నై లవ్ స్టోరీ’తో మూడు బ్లాక్‌బస్టర్లు కొట్టాం. ఈసారి మరింత ప్రేమతో, మీరంతా మరింత గర్వంగా ఫీల్ అయ్యేలా ఈ సినిమాతో విజయాన్ని అందుకోబోతున్నాం. ఇది మా సినిమా అని గర్వంగా బయటకు వస్తారు. ‘రియాలిటీ’ అనేది మనందరి కథ. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ మీ అందరికీ నచ్చింది. మీ రెస్పాన్స్‌ను నేను చూస్తున్నాను. డిసెంబర్ 25న మీరందరూ థియేటర్స్‌కు రండి. డిసెంబర్ 24న బాలయ్య గారు, నాగార్జున గారు వస్తున్నారు. డిసెంబర్ 25న మీ అందరి కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయను. మీ ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. డిసెంబర్ 25న మీరందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. లవ్ యు ఆల్.
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అందరికీ అభినందనలు. సాంగీత్ పాట చాలా వైబ్రెంట్‌గా ఉంది. మ్యూజిక్ వింటుంటే చాలా ఉత్సాహం వస్తోంది. ఇంత చక్కని పాట అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి అభినందనలు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్లు ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేయడం చాలా కొత్తగా ఉంది. చాలా మంచి టీమ్ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. కిరణ్ గారి ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు నేను ముఖ్య అతిథిగా వెళ్లాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ‘రియాలిటీ’ సినిమా కూడా అంతకుమించి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారి నటన చాలా సహజంగా ఉంటుంది. మన పక్కింటి కుర్రాడిలా అనిపిస్తారు. ఇప్పుడు దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుధాకర్ గారు ఎంతో శ్రద్ధతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. ‘భజగోవిందం’ పాటకు మీరు ఇచ్చిన ప్రేమను గుండె నిండా దాచుకున్నాను. ఆ తర్వాత ‘రుతు పాట’కు కూడా అంతే ప్రేమను అందించారు. ఇప్పుడు సంగీత్ పాట రిలీజ్ అయినప్పుడు కూడా మీరు ఇచ్చిన ప్రేమ నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. మీరు నా పాటలను విజయవంతం చేయడం వల్లే నేను మరిన్ని పాటలకు మ్యూజిక్ చేయగలుగుతున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు హీరో కిరణ్ అబ్బవరం గారికి, అలాగే మా నిర్మాత సుధాకర్ గారికి ధన్యవాదాలు. ఈ పాటలో చాలా చక్కని ప్రయోగం చేశాం. ఐదు ట్యూన్స్‌ను ఒకే పాటలో తీసుకురావడం చాలా కొత్త ప్రయోగం. ఇందులో ఉన్న ప్రతి మాట మీకు వినిపించేలా చేయడానికి అహర్నిశలు కష్టపడ్డాం. కిరణ్ గారితో కలిసి పనిచేయడం చాలా గర్వంగా ఉంది. ఆయన నిరంతరం ఒక మిషన్‌లా పనిచేస్తుంటారు. ఈ పాటకు మీరు ఇస్తున్న ఆదరణ చూస్తుంటే కాకినాడ నుంచి ఈ పాట ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్టుగా అనిపిస్తోంది. మా పాట రచయితకు, సింగర్స్‌కు, మా మ్యూజిక్ టీమ్‌కు అందరికీ థాంక్యూ.
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. నా తొలి సినిమాకే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ గారికి థాంక్యూ. ఇందులో పాటలన్నీ ప్రేక్షకుల హృదయాలకు చేరాయి. కిరణ్ గారితో సినిమా కోసం పనిచేయడం, ఆయన్ని కలిసిన ప్రతిసారీ చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే దేవిక చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. మా నటీనటులు, టెక్నీషియన్లు అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. డిసెంబర్ 25న చాలా గట్టిగా కొట్టబోతున్నాం. ప్రేక్షకుల సపోర్ట్‌తో చాలా మంచి సక్సెస్ సాధిస్తామనే నమ్మకం ఉంది.
హీరోయిన్ దేవికా భట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ పాట మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నా తొలి సినిమా. మీ అందరి ప్రేమ, ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. ఇంత గొప్ప సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా హీరో కిరణ్ గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.