`
pizza

Shruti Haasan about Veera Simha Reddy and Waltair Veerayya
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు లాంటి లెజెండ్స్ తో కలసి నటించడం నా అదృష్టం: హీరోయిన్ శృతిహాసన్ ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >
Follow Us

10 January 2023
Hyderabad

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య'.. ఈ రెండు చిత్రాలలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయిగా నటించింది. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య' చిత్రాల విశేషాలని పంచుకున్నారు శ్రుతి హాసన్.

ఈ సంక్రాంతికి డబల్ ట్రీట్ ఇస్తున్నారు కదా.. ఎలా అనిపిస్తోంది ?
నిజానికి ఇది నేను ఊహించలేదు. నా కెరీర్ లో ఇలా జరగడం రెండోసారి. ఏడేళ్ళ క్రితం నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయి. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఒక సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి ఇద్దరు లెజెండరీ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. చాలా ఆనందంగా వుంది. ఈ విషయంలో చాలా అదృష్టంగా ఫీలౌతున్నా.

రెండు సినిమాల్లో ఏ క్యారెక్టర్ బావుందో అనే పోలికలు అభిమానుల్లో వస్తాయి కదా ? ఈ విషయంలో ఒత్తిడి ఉందా ?
పోలికలు పెట్టుకునే అవకాశం లేదండీ. ఎందుకంటే రెండు భిన్నమైన కథలు. భిన్నమైన పాత్రలు. వీరసింహా రెడ్డిలో నా పాత్ర ఫన్ ఫుల్ గా వుంటుంది. వాల్తేరు వీరయ్యలో కంప్లీట్ డిఫరెంట్. రెండు పాత్రలు సవాల్ తో కూడుకున్నవి. వాల్తేరు వీరయ్యలో నా పాత్రని దర్శకుడు బాబీ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ విషయంలో ఆయనకి థాంక్స్ చెప్పాలి. వీరసింహారెడ్డి విషయానికి వస్తే నా పాత్రలో కామెడీ వుంటుంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఏ పాత్రకు ఆ పాత్రే ప్రత్యేకం.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో ఫైట్ కూడా వుందని విన్నాం ?
అవునండీ. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్ గురించి ఇప్పుడే చెప్పేస్తే ప్రేక్షకులకు థ్రిల్ పోతుంది. (నవ్వుతూ)

చిరంజీవి, బాలకృష్ణ గారు చాలా మంచి డ్యాన్సర్లు.. వారితో డ్యాన్స్ చేయడం కష్టం అనిపించిందా ?
చిరంజీవి, బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. వారిద్దరూ చాలా మంచి డ్యాన్సర్లు. సుందరి పాట చాలా వైడ్ గా రీచ్ అయ్యింది. శ్రీదేవి చిరంజీవి పాట కూడా అద్భుతంగా వచ్చింది.

ఇందులో ఒక పాట చాలా వేడిలో మరో పాట విపరీతమైన చలిలో తీశారు కదా.. సవాల్ గా అనిపించిందా ?
వేడి మనకి సవాల్ కాదు. కానీ చలిని మాత్రం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ చలికి తట్టుకోవడం ఒక కోట్ తో సరిపోదు నాలుగు కోట్స్ కావాలి. యూనిట్ అంతా నాలుగైదు లేయర్ల కోట్స్ వేసుకున్నారు. చిరంజీవి గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అయితే ఫైనల్ గా అవుట్ పుట్ చూసేసరికి మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం.

రెండు సినిమాలలో వున్న ప్రత్యేకత ఏమిటి ?
రెండు ప్రత్యేకమైన సినిమాలు. కథలు, పాత్రలు, ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా వుంటాయి. రెండు సినిమాలకి డిఫరెంట్ ప్లస్ పాయింట్స్ వున్నాయి.

ఈ రెండు సినిమాలు చేస్తున్న దర్శకుడు హీరోలకి అభిమానులు. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అవ్వడంపై మీ అభిప్రాయం ?
అభిమాని దర్శకుడు అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ వుంటుంది. చిన్నప్పటి నుండి ఒక హీరోని ఆరాధించడం వలన వారిలోని బలాలు అభిమానైన దర్శకుడికి తెలుస్తుంది. దీనికి నాన్న గారి(కమల్ హాసన్) విక్రమ్ సినిమా నిదర్శనం. లోకేష్ కనకరాజ్ నాన్న గారి అభిమాని. అది విక్రమ్ లో స్పష్టంగా కనిపించింది. బాలకృష్ణ గారితో గోపీచంద్ గారు, చిరంజీవి గారితో బాబీ గారు పని చేస్తున్నపుడు సెట్ లో ఆ ఎనర్జీ కనిపించిది. తెరపై కూడా ప్రేక్షకులు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు సినిమాలు చేస్తున్నపుడు నాన్న గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

వాల్తేరు వీరయ్య వైజాగ్ వేడుకలో మీరు కనిపించలేదు ? ఫ్యాన్స్ నిరాశ చెందారు ?
కొంచెం అనారోగ్యం చేసింది. ఇంకా పూర్తిగా రికవర్ కాలేదు. వైజాగ్ అంటే నాకు ఇష్టం. ఆ ఈవెంట్ ని చాలా మిస్ అయ్యా.

బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో పని చేయడం గొప్ప అనుభవం. బాలకృష్ణ గారు చాలా పాజిటివ్ ఎనర్జీ తో వుంటారు. దేవుడ్ని బలంగా నమ్ముతారు. చిరంజీవి గారు చాలా ప్రశాంతత, సున్నితంగా వుంటారు. వారిద్దరి నుండి చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను.

మైత్రీ మూవీ మేకర్స్ తో పని చేయడం గురించి ?
మైత్రీ మూవీ మేకర్స్ మొదటి సినిమా శ్రీమంతుడులో పని చేశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు వారి జర్నీ అద్భుతం. చాలా మంచి సినిమాలు తీశారు. వండర్ ఫుల్ నిర్మాతలు. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు తీసురావడం మామూలు విషయం కాదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. నవీన్ గారు, రవిగారు చాలా పాజిటివ్ గా వుంటారు. ఎవరికైనా సహాయం చేసే గుణం వున్న నిర్మాతలు.

సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ?
సంక్రాంతి పండుగ నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత నా జీవితంలోకి వచ్చింది. తమిళ్ లో పొంగల్ అంటాం. అందరిలానే ఆ రోజు పూజ చేయడం, ఫ్యామిలీతో గడపటం ఇష్టం.

కొత్త సినిమాల గురించి ?
ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారితో ‘సలార్’ చేస్తున్నా.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved