మత్తకోకిల మూగవోయింది. గడిచిపోయిన మధుమాసపు తీపి గుర్తులు నెమరువేసుకుంటూ తెరమరుగైపోయిన కోకిల ఇక పూర్తిగా కనుమరుగు కూడా ఐపోయింది. విరబూసిన వసంతకాలంలో సుస్వరాలాపనతో ఆమనికి ఆహ్వానం పలికిన అ కుహూరుతం, కాలం మారిపోవడంతో తన గళాన్ని కూడా కట్టిపెట్టుకుని, కానరాని సుదూర తీరాలకి తరలిపోయింది. నేడు ఆ గొంతు వినిపించకపోయినా, నేడు వినిపించే గొంతులలో ఎక్కడన్నా ఇంత తీయందనము, అంత ఒడుపు, ఒదుగూ వినిపిస్తే తన ఊసు గుర్తు తెస్తూనే ఉంటుంది. "అరే! ఏం పలికింది", అన్న ఆశ్చర్యం, "వాహ్! ఏం పాడింది", అన్న అభినందన, "అబ్బ! అసలు ఎలా..." అన్న వాక్యం కూడా పూర్తి కూడా కాని అబ్బురం, ఆ కోకిల మూట కట్టుకుని పోయిన ఆస్తులు. పాటకి ఉన్న అజరామరత్వం, అమృతతత్వం అవే. పాడే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాని తాము పాడిపోయిన ఆ పాటల తాలూకు తీయందనాలు తరతరాలు వరకూ ఇక్కడే మిగిల్చిపోతారు. "నీ లీల పాడెద దేవా" అంటూ....
"పాడినవారు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి" అన్న పద బంధం ఒక పదిహేను ఇరవై యేళ్ళ పాటు పాటాకాశ వీధులలో స్వైరవీహారం చేసింది. ఎనభయ్యవ దశకంలో సినిమాలలో, బట్టలలో తీవ్రమైన పొదుపు పాటిస్తూ ఆట విడుపు కోసం ఇలా కనిపించి ఆడిపోయే ప్రత్యేక నర్తకీమణుల గొంతు అంటే, అది ఎస్ జానకిదే. అదే సమయంలో, సంక్లిష్ట స్వరభూయిష్ట భాషా పదబంధుర ఉచ్ఛ స్వరమిళిత శాస్త్రీయ కీర్తనలు పాడాలన్నా ఎస్ జానకే. ఒకే పాటలో మూడు తరాల - పిన్న, ప్రౌఢ, పెద్ద - గొంతులు మేళవించి పలికించాలన్నా, కబురు ముందర పెట్టేది ఎస్ జానకినే. ఇక మమూలు తేలికపాటి బాణీలు తనకి కాలక్షేపం బఠాణీలే. వైవిధ్యం ప్రవృత్తిని చేసుకుని, మాధుర్యం చిరునామాగా పెట్టుకుని, సునాయాసం అన్నది ఇంటి పేరుగా మార్చుకున్న ఎస్ జానకికి ఉబ్బస వ్యాధి ఉండేది అన్నది ఊహకి అందని ప్రకృతి వింత. గాలి ఎక్కువ దూరలేని గొంతు సందులలో తన ప్రాణ వాయువునే పూర్తిగా పంపి, పాటలెన్నిటికో ప్రాణ ప్రతిష్ట చేసిన ఎస్ జానకి లాంటి కళా అవధూతలు మనకోసం "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు"
సముద్రతీరంలో గాలి పాటలు పాడుకుంటూ ఇసుకలో ఆడుకుంటున్న ఆకతాయి పిల్లలు. అటుగా పోతున్న పెద్ద మనిషిని చూసి ఒక గుంటడు ఒక రాలుగాయి రాగం అందుకుంటాడు. నడుస్తున్న పెద్ద మనిషి ఆగి అది విని, వాడి దగ్గరకి వచ్చి, కూడా ఇంటికి తీసుకుపోయి, ఏది ఇందాక అన్న రాగం ఇంకో సారి అనమంటాడు. అసలే బేంబేలెత్తిపోతున్న పిల్లాడు అనుకోని ఈ ఆదరణకి తబ్బిబ్బయి, తనకి ఏ రాగం రాదంటూ ఏడుస్తూ, ఆ ఏడుపులోంచి ఒక అలాపన అందుకుంటాడు..... కాదు, ఎస్ జానకి అందుకుంటుంది. చిత్రం శృతిలయలు. ఏడుపు స్థాయిని అలాగే నిలబెట్టి అక్కడ నించి ఇంకో రెండు మెట్ల శృతిలో ఒక నిముషం పాటు స్వర సంచారం చేసి వచ్చే అద్భుతమైన ప్రస్థారం. చిత్రహింసలు పెట్టే మొగుడు. అతని చేతిలో నలిగిపోతున్న కళాకారిణి భార్య. ఆవేదననే నాట్యరాజుకి నివేదనని చేసి, ఆ ఆక్రోశం లోంచి అరుపుగా మొదలు పెట్టి ఆలాపన లోకి దించే గమనం. అది ఝరీ గమనం. సుర నది ఝరీ గమనం. జటల మూడు ముళ్ళ శృంఖలాలు తెంచుకుని జాలువారిన గంగా వెల్లువ ఆవేశం. చిత్రం ఆలాపన. స్థాయికి శిఖరాగ్ర సమానాలు ఇవి ఐతే, మరొక వైపు, లేత జంట, వలపుల పంట తొలి సారిగా పండిచుకునే వేళ. సిగ్గు, బిడియం, బెరకు, చిలిపితనం కలబోసిన స్వరం. మంద్రానికి మరో మెట్టు కిందనించి మొదలు పెట్టిన నిశ్వాసం నిట్టూర్పుగా మారి ఆవిరై పోతున్న కాలాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నం. స్వర అగాధపు లోతులకి వెళ్ళి ఆణిముత్యాన్ని వెలికి తీసిన "అలివేణి ఆణి ముత్యమా.... నీ కంట నీటి ముత్యమా...".
నిలకడకి నిలువెత్తు రూపమైన పి సుశీల ఒక వైపు అప్రతిహతంగా దూసుకుపోతున్న రోజుల్లో, ఆసరగా దొరికి, ఆలంబన అయ్యి, తన అల్లరి అగ్నికి స్వర-ఆజ్యం తోడయినట్టు, ఎస్ జానకి ప్రస్థానంలో ముఖ్యమైన మజిలీగా నిలిచింది ఇళయరాజా. జానకి గొంతుతో ఇళయరాజా చేయని ప్రయోగం లేదు, చేయించని విన్యాసం లేదు. ఒక మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఆ తరపు పాటలని, తన ప్రయోగలతో సినీ సంగీత గతినే మార్చిన అతనికి, ఆ ప్రయోగాల్లో ఏడు స్వరాల ఏడడుగులూ కూడా నడిచిన సహధర్మచారిణి ఎస్ జానకి. అప్పటి వరకూ ఎవరూ కనుగొనని కొత్త జానకిని ప్రపంచానికి పరిచయం చేశాడు ఇళయరాజా. "మావయ్య వస్తాడంట" తో మొదలు పెట్టి, "సిరిమల్లె సిరిమల్లె పువ్వా" అంటూ, "పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే" అని కొనసాగిస్తూ జానకి గొంతులోని జానపద ఊపుని, విరుపుని ఒక వైపు, "ఎదలో తొలి వలపే", "పరువమా చిలిపి పరుగు తీయకు", "మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి", "దా దా దా దాస్తే దాగేదా" వంటివి ఆమె గొంతులోని కౌమార్యాన్ని మరో వైపూ చిత్రిక పట్టినాయి. "నీ మీద నాకు ఇదయ్యో" అంటూ పంక్తి చివర ప్రతి సారి వచ్చే ఆ మూర్చనం, కొత్తగా కట్టిన ఇనప జారుడు బల్ల మీద ఒక ఉతుకు వేసి తీసిన పట్టు చీర కట్టుకుని జారినట్టు... ఇళయరాజా స్వరం, జానకి వరం... జానకి స్వరం, ఇళయరాజా వరం. చిత్రం "మూన్రం పిరై" (వసంత కోకిల). గీతం - పొన్మెని ఉరుగుతె (ఊరించే వయసిది). సిల్క్ స్మిత మీద ప్రత్యేక గీతం. పాటలో దరువుతో సమానంగా రొప్పు లని, గాలిపోత వాయిద్యాల శృతిని ఆలవోకగా అందుకుంటూ, ఇళయరాజా ప్రయోగాలని ఎన్నిటినో వడిసి పట్టి, పుక్కిలి పట్టి, చిరస్మరణీయాలు చేసింది జానకి.
తన ముందర మరే గాయనికి దక్కని, తనుకు మాత్రమే సొంతమైన కీర్తి, తన కీచు(లాంటి) గొంతుకకు శాశ్వతతత్వం. తన ముందు వరకు ఆడ గొంతు అంటే గుంభనంగా, ఒద్దికతోనే ఉండాలి అన్న కొలతలని కొలమానాలని ఖరాఖండిగా ఖండఖండలుగా తెగ్గోసిన పదును జానకి గొంతుకే సొంతం. తన తరువాత వచ్చిన గొంతులన్నీ ఒక విధంగా జానకి మూసవే. తీర్వ స్థాయి దాకా వెళ్ళి, అక్కడి నించీ ఇంకా పైన ఇంకొంచెం వంచితే ఇక పెళుసు గొంతు పుల్లలే విరిగిపోతుందేమో అన్నంత వరకూ తీసుకు వెళ్ళి, అక్కడ విన్యాసాలు చేసి విస్మయ పరచడం ఎస్ జానకి గొంతు సొంతం. ఆ విచిత్రమైన గొంతు నుండి వెలువడిన ఒక మామూలు గీతం - "మనసా తుళ్ళి పడకే అతిగా ఆశపడకే". జానకి సంగీత ప్రస్థానానికి చక్కని ప్రతిబింబం. గొంతు ఇలా ఉందేమిటి అనుకునే యుగంలో మొదలు పెట్టి, గొంతంటే ఇలాంటిదే కావాలి అన్న గొంతెమ్మ కోరికలు కోరుకునే దశదాక తీర్చిదిద్దుకున్న తన వృత్తి గమనం అసామాన్యం, అనితరసాధ్యం.
ఉచ్ఛ స్వరాల గాయని స్వర ఉచ్ఛైశ్రవము మీద స్వారీ చేస్తూ ఊర్ధ్వలోకాల మీద జయకేతనము ఎగరవేడానికి ఎగిరిపోతుండగా, ఈ గాంధర్వ లోక ప్రవేశానికి నీకేమి అర్హతుంది అని ప్రశ్నించే వారికి దీటైన జవాబు "నరవరా! ఓ కురువారా!" పాట మొదలుకునే అసమాన ఆలాపన. ఆ పై లోకాలే ఎస్ జానకికి హెచ్చు స్వరాలకి సరైన వేదిక. "ఉరుములలో అలికిడిగా వినిపించే ఈ మైనా, మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా"