పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగానటిస్తున్న తాజా చిత్రం 'ఏ మంత్రం వేశావె'. శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 9న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత శ్రీధర్ మర్రి మాట్లాడుతూ ''నేను హైదరాబాద్‌లోనే పుట్టాను. కొనేళ్లకు మా కుటుంబం బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ చదివాను. మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్ కోర్సు చేశాను. కోల్‌కతా ఐ.ఐ.ఎంలో మేనేజ్‌మెంట్ కోర్సు చేశాను. ఇన్‌ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా 15 ఏళ్లు పనిచేశాను. తర్వాత యు.ఎస్.కు పని రీత్యా వెళ్లాను. చిన్నప్పట్నుంచి కథలు రాయడం.. పిల్లలతో నాటికలు వేయించడం అంటే ఆసక్తి ఉండేది. చదువు, ఉద్యోగం రీత్యా నా అభిరుచి పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపలేదు. ఇప్పుడు అంతా ఓకే అనుకున్న తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. మనచుట్టూ ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని కథ తయారు చేయాలని 'ఏ మంత్రం వేసావె' కథను డెవలప్ చేశాను. అందరూ టెక్నాలజీ మాయలో పడిపోయి అందరికీ మధ్య దూరం పెరిగిపోయింది. మన చుట్టూ ఉన్న వారి కంటే.. ఆన్‌లైన్ ఉన్నవారితో స్నేహాలు, సంబంధాలు ఎక్కువైయ్యాయి. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియా అనేది పర్సనల్ టీవీలా తయారైంది. టెక్నాలజీ కంపెనీలనేవి.. జనాల్ని వారికి ఎలా ఆకర్షించుకోవాలనే ఆలోచనతోనే వస్తువులను తయారు చేస్తాయి. నేను టెక్నాలజీ రంగంలో ఉండటం వల్ల నాకు ఆ విషయం బాగా తెలుసు. దీని ఆధారంగానే 2014లో కథను తయారు చేసుకున్నాను. హై కాన్సెప్ట్ మూవీ. ఇలాంటి కథను ఇతర నిర్మాతలెవరూ నమ్మరు. కాబట్టి నేనే నిర్మాతగా మారి సినిమా చేశాను. నేను నా వర్క్‌లో బిజీగా ఉండటంతో వీలైనప్పుడల్లా సినిమాను చేసుకుంటూ వచ్చాను. అందువల్ల సినిమా తయారు కావడానికి సమయం పట్టింది. రెగ్యులర్ ఫార్మేట్ కాదు కాబట్టి.. సినిమాను ఎలా రిలీజ్ చేయాలని ఆలోచించాను. కొంత మంది డిస్ట్రిబ్యూటర్స్‌ను కలిశాను. అలాంటి సమయంలో శివకుమార్‌గారు నన్ను కలిశారు. ఆయనకు నా కాన్సెప్ట్ నచ్చడంతో ఆయన సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. విజయ్‌దేవరకొండ పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో పోల్చితే 'ఏ మంత్రం వేసావె' డిఫరెంట్ మూవీ. ఇలాంటి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను చెప్పాలనుకున్న మెసేజ్‌ను సినిమా రూపంలో తీశాను. విజయ్‌దేవర కొండ చాలా మంచి వ్యక్తి. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. తను ఎంతో సపోర్ట్ చేశారు. తను ఇప్పుడు హీరోగా ఎంతో బిజీగా మారిపోయాడు. అందువల్ల సినిమా ప్రమోషన్స్‌లో తను సపోర్ట్ చేయలేకపోతున్నాడు. ఆ విషయంలో నాకు ఎలాంటి డిసప్పాయింట్‌మెంట్ లేదు. నేను డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రాలేదు. భవిష్యత్‌లో కూడా మంచి ఐడియాలజీ ఉన్న సినిమాలే తీయడానికి ప్రయత్నిస్తాను. నా వద్ద చాలా కథలున్నాయి'' అన్నారు.