5 February 2023
Hyderabad
దేశము మారెనూ... కాలము మారెనూ.... అయినా మనిషి మారలేదు... ఆతని మమత తీరలేదు....
అన్న నాటి పింగళి పాటకు నిలువెత్తు ప్రతిరూపం విశ్వనాథ్ (ఏకవచనం అనుబంధానికి పరాకాష్ట). తెలుగు సినీ పరిశ్రమ తీరుతెన్నెలు ఎన్ని రకాలుగా రూపాంతరం చెందినా, తదనుగుణగంగా తమ పద్ధతులు మార్చుకోని (మార్చుకోలేని కాదు, మార్చుకోని) దర్శకులు ఇద్దరే - ఒకరు 'శ్రామిక బంధు ' ఆర్. నారాయణమూర్తి, రెండో వారు 'కళాకర్షుకుడు ' కే. విశ్వనాథ్. విశ్వనాథ్ అనగానే ఠక్కున గుర్తువచ్చే చిత్రం 'శంకరాభరణం' అయినా ఆయన అప్పటికే రెండు పదుల చిత్రాలు తీసి, దశాబ్దమున్నర పాటు దర్శకత్వపు శాఖలో పరిణితి సాధించిన మేటి దర్శకుడన్నది, ఆయన్ను ఎక్కించుకుని మోసి ఊరేగించిన బంగారు నందులే చెబుతాయి. అయినా విశ్వనాథ్ అనగానే 'శంకరాభరణం' గుర్తుకు రావడానికి కారణం, ఆ చిత్రానికున్న మేటి కళాత్మక విలువకు ఏ మాత్రం తీసిపోని కారణం - కాలం. ఇదే 'శంకరాభరణం' 60వ దశకంలో వచ్చి ఏ ఏయన్నారో, లేక ఇదే సోమాయాజులో నటించి ఉంటే ఆ కాలపు మరో ఉత్తమ చిత్రంగా నిలిచుండేదేమో గాని, ఇలా సినీ సాగర తీరాన భవిష్యత్ కాల ప్రవాహాలకు/ప్రభావాలకు ఎదురొడ్డి ఠీవిగా, గర్వంగా, తలయెత్తుకుని నిలబడగల/నిలిచిపోగల అచంచలమైన అచలమయ్యేది కాదు. దానికి కారణం ముమ్మాటికీ కాలమే. పరిశ్రమలో తన చుట్టూ మారిపోతున్న పరిస్థితులు, ప్రబలుతున్న వ్యాపార ధోరణలు, వస్తున్న కొత్త దర్శకులు, పెట్టుబడిని మించిన రాబడి రాబట్టడానికి వారు అనుసరిస్తున్న వినూత్న పోకడలు, వాటికి వయసు మీరిన నాటి అగ్ర నటుల సంపూర్ణ అండదండలు, వీటన్నిటి మధ్యలో, నెమ్మదిగా మారుతున్న(మార్చబడుతున్న) ప్రేక్షకుల అభిరుచులు - ఇవన్నీ 'శంకరాభరణం' గంజాయి వనంలో తులసి మొక్కగా పాతుకుపోవడానికి ప్రధాన కారణం. అప్పటి వరకూ తన సినీ ప్రస్థానంలో అక్కడక్కడా అడపాదడపా మాత్రమే (ఒక 'చెల్లెలి కాపురం' లోనో, ఒక 'సిరి సిరి మువ్వ ' గానో) శాస్త్రీయ కళలను - పాటలపరంగా, కవిత్వం రూపంలో, నాట్యాంశంగా - స్పృశించిన విశ్వనాథ్, 'శంకరాభరణం' వచ్చేసరికి ప్రబలుతున్న వ్యాపారాత్మక ధోరణుల మధ్య పూర్తిస్థాయి కళాత్మక చిత్రంగా చేయడానికి పూనుకోవడం, ఆ ప్రయోగన్ని ప్రేక్షకులు "వెరైయిటీ" పేరుతో అక్కున చేరుచుకోవడం, కాలం పరంగా అసంకల్పిత ప్రతీకార చర్యే. ప్రపంచ చరిత్ర పరంగా, అప్పటి వరకూ ఒక తీరుగా ఉన్న మనిషి పరిస్థితుల ప్రభావం వల్లే (తన చర్యల ద్వారా) ఎనలేని ప్రాభవం సంపాదించుకున్న దాఖలా రెండో ప్రపంచ యుద్దంలో విన్స్టన్ చర్చిల్ రూపంలో కనపడుతుంది. వీరు కాలానికి ఎదురీదిన వారు, కాలానికి కళ్ళెం వేసి చరిత్ర దారి మార్చ్గలిగిన వారు, కాలంపై జయకేతనం ఎగరేసిన వారు - వీరు కాలానికి అతీతుతులు, అందుకునే వీరి పనులు మీద కాలపు క్రీనీడ పడక ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి.
చిత్రమైన విషయం ఏమిటంటే 'శంకరాభరణం' ముందరే విశ్వనాథ్ కు విజయాల శాతం ఎక్కువగా ఉండడం. 'శంకరాభరణం' నుంచి ఎప్పుడైతే తన బాట మారి, ధోరణి మార్చుకున్నాడో అప్పటి నించి విజయాలు తన చిత్రాలతో దోబూచులాడినాయి. దానికి కారణం ఆ చిత్రాల నాణ్యత కానే కాదు. చిత్ర విజయం అనేది కేవలం విడుదలయిన సమయంలోనే కురిసే కాసుల పరంగా కాక, ఎక్కువ మంది, ఎక్కువ రోజుల పాటు, తరాల తరబడి చూడడం, ఆస్వాదించడం, ఆనందించడం, ఆదరించడం అన్నవి కొలమానాలుగా చూస్తే విశ్వనాథ్ సినిమాలు సాధించిన విజయాలు, బహుశ విజయ వారి 'మాయాబజార్ ', 'మిస్సమ్మ ' లకు తప్ప, మరే చిత్రాలకూ దక్కలేదన్నది నిర్వివాదాంశం. విడుదలైన సమయంలో 'స్వర్ణ కమలం' సరిగా విరబూయలేదు. కానీ నేడు సుమారు నలభై యేళ్ళయిన తరువాత, 'స్వర్ణ కమలం' పేరు తెలియని వారు లేరు/ఉండరు... ఆ చిత్ర భాషలోనే "నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం..... గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువరణ కమలం" గా విరగబూసింది వెల్లివిరిసింది. తాత్కాలిక విజయాలతో పని లేకుండా, శాశ్వత కీర్తిని సముపార్జించుకున్న విశ్వనాథ్ చిత్రాల విజయ రహస్యం ఒకటే - అజరామరమైన పాటలు. భగ్న ప్రేమికుడిగా ఏయన్నార్ మహోన్నత నటన తరువాతి కాలానికి తెలియకపోవచ్చు గుర్తుండకపోవచ్చు, కాని 'దేవదాసు ' అనగానే 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్', 'జగమే మాయ బ్రతుకే మాయ ' అన్న పల్లవులు మాత్రం పది కాలాలు పదిలాలు. అలాగే "సాగర సంగమం" అన్న పేరు వినగానే బావి మీద తాగి చిందులాడే కమల్ హాసన్ నృత్యం రాబోయే తరానికి స్ఫురణకు రాకపోవచ్చు, కాని "తకిట తధిమి తకిట తధిమి తందానా" అన్న పాట కాలంతో సంబంధం లేకుండా తెలుగు సినీ సంగీత కోవెలలో ఎక్కడో గంటలు కొడుతూనే ఉంటుంది. సుమతి శతకకారుడు చెప్పిన "జనులు ఆ పుత్రుని కనుగుని పొగడగ పుత్రోత్సాహము నాడు పుట్టును (ఆ తండ్రికి) సుమతీ" అన్నది ఇదే. విశ్వనాథ్ పాటలు అన్నవి ఒక దాశరధీ శతకం గానో ఒక వేమన శతకం గానో తెలుగు సినీ సాహితీ చరిత్రలో నిలిచిపోవడం అన్నది తధ్యం, సత్యం. ఈ శాశ్వతత్వం సంపాదించుకోవడానికి పాట అంటే విశ్వనాథ్ పడిన ఆరాటానికి ఫలితం, పరిశ్రమకు ఆయన పరిచయం చేసిన సరస్వతీ స్తన ద్వయం - వేటూరి సుందరరామ మూర్తి, చెంబోలు సీతారామ శాస్త్రి. 'అలలు కదలినా పాటే, ఆకు మెదిలినా పాటే' అన్నది ఒకరు, "నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే" అన్నది మరొకరు... విశ్వ-నాథుని అనుమతితో మాటగా ఉన్న వామనుడు పాటగా త్రివిక్రముడిగా యెదిగిపోయి కీర్తి భువనాలను, యశో గగనాలను ఆక్రమించేసుకుని, ఇంకో అడుగుకి చోటేది అని వెత్తుకుంటూ రస హృదయుల గుండెల్లో గూడు కట్టుకుని గుంభనంగా మిగిలిపోయాడన్న దానికి నిదర్శనం "మల్లె కన్న తెల్లన మా సీత సొగసు, వెన్నెలంత చల్లన మా సీత మనసు" పాటలో నటీనటులు ఎవరు అన్నది ఎంత మందికి తెలుసు/గురుతున్నారు అన్నదే....మాట ముంగిటే మిగిలిపోతుంది, పాట పల్లకీలో ఊరేగుతుంది... అందుకే విద్వన్మణి మాట విశ్వనాథుని పాట సర్వత్రా పూజ్యతే ...
పాటలో మాటకు ఎంతటి స్థానం ఉందో బాణీకి కూడా అంతటి సముచిత, సమ్మున్నత స్థానమే ఉంది. పాటకు అదే పల్లకీ ఉపమానంగా తీసుకోవాలంటే, మాట పల్లకీలో ముస్తాబై కూర్చున్న ముద్దుగుమ్మ ఐతే, ఆ చూడ చక్కనమ్మను నలువైపులా తిప్పికుని వచ్చేదే ఆ పాట బాణీ. విస్వనాథ్ పాటల బాణీల గొప్పతనం వాటి నిరాడంబరతలోనే ఉంది, అంటే పెద్దగా వాద్య సహకారం లేకపోయినా కూడా, పాట చక్కగా పాడుకోగల సౌలభ్యం కలిగి ఉండడం. గొప్ప (సినిమా) సంగీతం అంటే వాద్య అట్టహాసాలు, వాటి సమ్మేళణ భీభత్సాలు కావు... నేపథ్యంలో ఎటువంటి వాయిద్యమూ వినిపించకపోయినా కేవళం బాణీ బలంతో పాట వినేవాళ్ళ మనసుల్లో ముద్రించుకుపోవడం... "వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే" బాణీలోనే ఒక లయాత్మక తూగు, ఒక సొగసైన ఊగు ఉన్నాయి... వినడానికే కాక గుర్తు తెచ్చుకోవడానికీ, కుదిరితే కూనిరాగం తీయడానికీ, కాస్త గొంతు బావుంటే గట్టిగా పాడుకోవాడానికీ కూడా అనువైన బాణీలు ఇవి. "గోదారల్లె ఎన్నెట్టో గోదారల్లె, యెల్లువా గోదారల్లె, ఎన్నెట్టొ గోదారల్లె", "గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందువలన", "సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం విరిసే సుదతీ మీనాచ్చీ", "ఔర అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల"... ఈ కమ్మటి బాణీలకు ఏ/ఎంతటి వాద్య ఘోష మరింత శోభ తేగలదు? విశ్వనాథ్ కు అక్కడక్కడా వారు వీరు సంగీత సహకారం అందించినా, ఆయన అంతరంగం తెలుసుకుని ఆవిష్కరించగలిగినది మాత్రం ముమ్మటికీ మామ మహదేవనే. మెత్తటి పాదానికి సుతిమెత్తని జోడే తగినదని, మోహనమైన మాటకు లలితమైన రాగమే మంచి ముస్తాబని, అందమైన రచనకి ఆహ్లాదమైన వరసే సరిజోడీ అని, విశ్వనాథ్ పాట నిత్య నూతనంగా మిగిలిపోగల సొబగును తీర్చిపెట్టింది మామ బాణీ. చేసినవి మూడు చిత్రాలయినా విశ్వనాథ్ కోసము ఇళయరాజా చేసిన సుమధుర బాణిలూ విశ్వనాథ్ ముద్రనే వేసుకుని ఆయన పేరు మీదనే చెలామణీ అవుతాయే తప్ప, (సహజంగా వినిపించే) ఇళయరాజా పాటలుగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండవు. అందుకు ఉదాహరణగా "మనసు పలికే మౌన గీతం" పాట ఇళయరాజా చేసిన ఇంకే పాటలాగా ఉండకపోవడం, ఇళయరాజా ఆ తరువాత కూడా అటువంటి పాటను చేయకపోవడం. "నాద వినోదమే నాట్య విలాసము", హరికథ + చెక్క భజన + కోలాటాల తాళాలను మేళవించి రంగరించిన "రామా కనవేమిరా", లాలి పాటాలకే మకుటాయమానంగా మిగిలిపోయిన "లాలి లాలి లాలి లాలి" వంటి పాటలలో దర్శకుడి ఇచ్ఛ ఎంత సంగీత దర్శుకుడి స్వేచ్చ ఎంత అన్నది పాలు-నీళ్ళ న్యాయమే, అర్ధనారీశ్వర తత్వమే...
క్షీర సాగర మధనంలో హాలాహలం రేగి ప్రపంచాన్ని ఉక్కడగించే సమయంలో విశ్వనాథుడు ఆ విషాన్ని పుక్కిలి పట్టి, గొంతున నిలిపి అమృత ఆవిర్భావానికి ఎలా దోహదం చేశాడో, తన చిత్రాలలోని పాటల ద్వారా వ్యాపార వాణిజ్యాల చేదు వాస్తవాలను మింగుడు పడనీయక కళామృత ఉద్భవానికి దోహదం చేసిన సినీ వినీల విశ్వనాథుని కృషి అపూర్వం, అద్వితీయం, అజరామరం.
ఒడుపున్న పిలుపు, ఒదిగున్న పులుపు, ఒక గొంతులోనే పలికింది... అది ఏ రాగమని నన్నడిగింది? అది మన వూరి కోయిలమ్మ... నన్నడిగింది కుశలమమ్మా....
- Srinivas Kanchibhotla