19 January 2017
Hyderabad
రవితేజ, రాశిఖన్నా, శీరత్‌కపూర్ నటించిన చిత్రం 'టచ్ చేసి చూడు'. విక్రమ్ సిరికొండ దర్శకుడు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు విక్రవమ్ సిరికొండ పాత్రికేయులతో మాట్లాడుతూ ''దర్శకుడిగా నా తొలి సినిమా 'టచ్ చేసి చూడు'. మనం చేసే పని మన కంటే గట్టిగా మాట్లాడుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమా కూడా నా కంటే గట్టిగా మాట్లాడుతుందని నమ్ముతున్నాను. జీవితంలో సమతూకం ఉండాలనేది సత్యం. దాన్నే నా సినిమా చెబుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే గొడవలవుతాయి. అలాగే రెండు దేశాలు మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే యుద్ధం జరుగుతుంది. ఓ డేడికేట్ పోలీస్ ఆఫీసర్ తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి పరమైన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడనేదే మా సినిమా. ఇది ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. రవితేజగారు ఇందులో ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకే క్యారెక్టర్‌ను రెండు డిఫరెంట్ పీరియడ్స్, బ్యాక్‌డ్రాప్స్ మధ్య చేశారు. ఇప్పటి వరకు రవితేజగారు చేసిన పోలీస్ క్యారెక్టర్స్‌కి, ఇందులో పోలీస్ క్యారెక్టర్‌కి తేడా ఉంటుంది. ఇందులో ఎమోషనల్ టచ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజగారు కనపడతారు. ఇందులో రవితేజగారి పాత్ర పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఇన్‌స్పైర్ చేస్తుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌ని. అనుకోకుండా రైటర్‌నయ్యాను. వినాయక్‌గారి దగ్గర 'ఠాగూర్' సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. కిషోర్ పార్థసాని (డాలీ) చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో రైటర్‌గా మారాను. కానీ ముందు నుండి నేను దర్శకుడు కావాలనుకునే ఇండస్ట్రీలో ఉన్నాను. 'టచ్‌చేసి చూడు' సినిమా కథ వక్కంతం వంశీగారిది. రవితేజగారు హైపర్ క్యారెక్టర్ చేశారు. ప్రయోగాత్మక సినిమా కాదు. కమర్షియల్ సినిమా చేయాలనే చేశాను. రైటర్‌గా నేను లవ్, ఎమోషనల్ సన్నివేశాలను బాగా రాయగలను. ఆ ఎలిమెంట్స్‌ను మిస్ కాకుండా ఉండేలా చూసుకున్నాను. బుజ్జిగారితో 2005 నుండి పరిచయం ఉంది. కాబట్టి ఆయన దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు'' అని తెలిపారు.