To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
06 December 2016
Hyderabad
సియాటిల్ లోని వాషింగ్టన్ తెలుగు సమితి (వాట్స్) ఆద్వర్యం లో జరిగిన ఏపీఎన్నార్టీఎస్ సదస్సుకు తెలుగు స్వచ్చంద సేవకులు, వ్యాపార వేత్తలు, ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు పాల్గొన్న ఈ సభలో… ఏపీలోని పారిశ్రామిక ప్రగతి, ప్రోత్సాహాల గురించి చర్చ జరిగింది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను రవికుమార్ వేమూరు అక్కడి ఎన్నారైలకు సమగ్రంగా వివరించారు. ప్రపంచ దేశాల్లోని ప్రవాసాంధ్రులను ఒక్క దరికి చేర్చేందుకే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీఎన్నార్టీఎస్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారమే కాకుండా, జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ప్రవాసాంధ్రులను ప్రోత్సహించడం, నవ్యాంధ్రకు విదేశీ పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలని ఆయన వివరించారు.
నవ్యాంధ్రలోని గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా ఆయా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కూడా ఆయన అక్కడి ప్రవాసాంధ్రులను కోరారు. ఏపీఎన్నార్టీఎస్ వెబ్ సైట్ ద్వారా సొంత గ్రామాలకు విరాళాలు అందించే వీలు కూడా ఉందని, అంతే కాకుండా రూ.100కోట్ల విలువైన ఆర్ఐడీఎఫ్ మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా 50శాతం నిధులను ఏపీఎన్నార్టీఎస్ సమకూరుస్తుందని తెలిపారు, బ్యాంకులతో అనుసంధానమై ప్రవాసాంధ్రులు అందించే నిధులకు పూర్తి పారదర్శకత ఉంటుందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా పలువురు వాట్స్ కార్యకర్తలు విరాళాలు పంపించే విధివిధానాలను, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను తెలుసుకున్నారు. వాట్స్ మరియు ఏపీఎన్నార్టీఎస్ ప్రతినిధుల మధ్య పల్లెల అభివృద్ధికి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఏపీఎన్నార్టీఎస్ తరఫున రవికుమార్ వేమూరు, వాట్స్ తరఫున ఆ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. అనంతరం ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు రవికుమార్ వేమూరు సమాధానాలు ఇచ్చారు. వాట్స్ సేవా మరియు అభివృద్ధి కార్యక్రమాలు గురించి తెలుసుకొన్న ఆయన… ఏపీఎన్నార్టీఎస్‌తో ఆ సంస్థ భాగస్వామి కావటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాట్స్ కార్యవర్గ సభ్యులు భాస్కర్ గంగిపాముల, రామ్ కోటి, షకీల్ పొగాకు, కల్యాణ్ కాకి, అనీల్ పన్నాల, కార్యకర్తలు వంశీ రెడ్డి , శ్రీనివాస్ అబ్బూరి, రామ్ పాలూరి, సునీల్ మరడ, ఏపీఎన్నార్టీఎస్ ప్రతినిధి పువ్వల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.