To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
06 May 2015
Hyderabad
Dallas/Fort Worth మే 2, 3, 2015: మే మొదటి వారాంతంలో ఉత్తర టెక్సాస్ లోని కొప్పెల్ ప్రాంతంలో తెలుగు వికాసం వెల్లి విరిసింది. సిలికానాంధ్ర మనబడి నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలలో దాదాపు 90 మంది చిన్నారులు పాల్గొని అలరించారు. రకరకాల విభాగాలలో తెలుగు భాషా/విషయ జ్ఞానాలని పరీక్షించే “తిరకాటం”, తెలుగు పదాలలో సరైన అక్షరాలు వ్రాయడాన్ని పరీక్షించే “పదరంగం” ఆటల పోటీలు జరిగాయి. Dallas ప్రాంతీయ పోటీలలో విజేతలు జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారు. పిల్లల సరదాకోసం ఆడించిన “ఒక నిమిషం మాత్రమే (ఒనిమా)”, ఇంకా వినూత్నమైన “చదువుతా చక్కగా” పోటీలలో కూడ అనేకమంది బాలబాలికలు ఉత్సాహంతో ఆడి, రక్తి కట్టించారు. ఈ మహానగరంలో మనబడిలో మొత్తం 525 మంది పిల్లలు ఏడు తరగతుల పాఠ్యప్రణాళికలో వారంవారం తెలుగు నేర్చుకుంటున్నారు.
ఈ పోటిలకు ముఖ్య నిర్వాహకులైన కస్తూరి గౌతమ్, నారని రమేశ్ గార్లు మాట్లాడుతూ, “గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న తెలుగు మాట్లాట జాతీయ స్థాయి ఆటల పోటీలలో డాలస్ బాలబాలికలు విజేతలుగా నిలిచారు. ఈ సంవత్సరం కూడా డాలస్ ప్రాంతీయ పోటీలలో గెలిచిన ఉద్దండులు తప్పక జాతీయ పోటీలలో రాణిస్తారని మా విశ్వాసం” అని అన్నారు.
మనబడి కార్యక్రమాల స్థానిక వ్యవహర్త భాస్కర్ రాయవరం మాట్లాడుతూ “తెలుగు మాట్లాట పోటీలు పిల్లలకు నచ్చిన ఆటల ద్వారా వారికి మన భాషపై మక్కువను, ఆసక్తిని పెంచగలవు. నలుగురు తెలుగు పిల్లలు కలిస్తే సరదాగా ఆడుకునేందుకు అనువైన తెలుగు ఆటలను తెలుగు మాట్లాట ద్వారా అందిస్తున్నాము.” అని అన్నారు. మనబడి మరియు తెలుగుమాట్లాట గురించి, మరిన్ని వివరాలకు - manabadi.siliconandhra.org చూడవచ్చు.
ఈ పోటీలలో గెలుపొందిన బాలబాలికల వివారాలు:
బుడతలు (5-9 సంవత్సరాల వయసు)
తిరకాటం: (1) తుమ్మూరు హిమజ (2) మండల గౌతం
పదరంగం: (1) మండల గౌతం (2) పట్టస్వామి రాజేశ్వరి
సిసింద్రీలు (10-13 సంవత్సరాల వయసు)
తిరకాటం: (1) తుమ్మూరు తేజస్విని (2) ప్రణయ్ జి.
పదరంగం: (1) కస్తూరి ప్రణవ్ (2) తుమ్మూరు తేజస్విని
చిరుతలు (14-16 సంవత్సరాల వయసు)
తిరకాటం: (1) గజ్జెల వెన్నెల (2) గాదె ఆకర్ష్
పదరంగం: (1) గాదె ఆకర్ష్ (2) గజ్జెల వెన్నెల
ఈ కార్యక్రమాలకు చిన్ని వెంకటేశ్వర, యెనగండ్ల నాగ్, పాలూరి రామారావు, ముద్దన్న బుద్ధ, జొన్నాడ వెంకట్, సిద్ధార్థ కళ్యాణి, దివాకర్ల మల్లిక్, వడ్లమాని సుధ, కస్తూరి మైథిలి, ఇంకా అనేక మంది భాషా సైనికులు కృషి చేసారు. సిలికానాంధ్ర మనబడి ఊనికతో ప్రవాసంలో తెలుగుపై మమకారం, ఆసక్తి ఇంకా మరెంతో పెంపొందాలని ఈ కార్యక్రమాలకు హాజరైన అనేక మంది పిల్లల తల్లిదండ్రులు, తెలుగు వారు ఆకాంక్షించారు.