To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 February 2016
Hyderabad
ఓర్లాండో, ఫ్లోరిడా: మూర్తి వి.ఏ.బొండాడ, Ph.D., P.E., F.ASCE, ట్రాన్స్ పోర్టేషన్ అండ్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టే డాక్టర్ బొండాడ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన డాక్టర్ బొండాడ.. ఫ్యాకల్టీ మెంబర్ గా, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా, ఫుల్ బ్రైట్ స్కాలర్ విజిటింగ్ ప్రొఫెసర్ గానూ సేవలు అందించారు. 50 ఏళ్ల కెరీర్ లో విద్యారంగంలోనూ, ఇండస్ట్రీపరంగా, వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ముఖ్యంగా ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్ విభాగంలో ఎనలేని సేవలు అందించారు. ట్రాఫిక్ ఇంజనీరింగ్, ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్, ట్రాన్సిట్, హైస్పీడ్ రైల్, లైట్ రైల్, ఆటోమేటెడ్ పీపుల్ మూవర్స్, మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టేషన్ ప్లానింగ్ ఏరియాల్లో డాక్టర్ మూర్తి బొండాడ కు 45 ఏళ్ల కన్సల్టింగ్ అనుభవం ఉంది. 1999 నుంచి 2003 వరకు ఫ్లోరిడా స్టేట్ బోర్డ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ లో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 2007-08లో సీనియర్ ఫుల్ బ్రైట్ రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నారు. 2013లో ఫ్లోరిడాలోని ఒర్లాండోలో జరిగిన ఇంజనీర్స్ వీక్ సెలబ్రేషన్స్ లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నారు.
గత 43 ఏళ్లలో ASCE జాతీయస్థాయిలో చేపట్టిన ఎన్నో కార్యక్రమాల్లో డాక్టర్ బొండాడ పాల్గొంటూనే ఉన్నారు. ఎన్నో టెక్నికల్ కమిటీల్లో సభ్యునిగా సేవలు అందించారు. 1981-85లో APM కమిటీలోనూ, 1985-89 మధ్య అర్బన్ ట్రాన్స్ పోర్టేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ, 1983-85, 1989-93 మధ్య HSGT కమిటీ ఫౌండర్ ఛైర్మన్ గా, 1993-99 మధ్య PT కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ASCE తరపున 1985లో ఆటోమేటెడ్ పీపుల్స్ మూవర్స్ అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సిరీస్ లు నిర్వహించారు. 1991లో HSGT సిస్టమ్స్, 1999లో అర్బన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్స్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. కేవలం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సులు నిర్వహించడమే కాదు.. కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ పై సంపాదకీయాలు రాశారు. ASCE చాప్టర్స్ అయిన డెట్రాయిట్, హారిస్ బర్గ్ లో ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ టెక్నికల్ గ్రూప్స్ కి ఫౌండర్ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఈయన అందించిన సేవలకు గాను ASCE ఫ్రాంక్ మాస్టర్స్ ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ అవార్డ్ ప్రదానం చేసింది. ASCE, ITE డాక్టర్ బొండాడ కు లైఫ్ ఫెలోషిప్ ఇచ్చాయి.
ఆంధ్రా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచలర్స్ డిగ్రీ చేసిన డాక్టర్.బొండాడ ఐఐటీ ఖరగ్ పూర్ లో సిటీ ప్లానింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్ లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ డిగ్రీ సంపాదించారు. 1973లో మిచిగాన్ లో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా మొదటిసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్టర్ బొండాడ... ఫ్లోరిడాలో రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ ఇంజనీర్ గా ఉన్నారు. ప్రస్తుతం డాక్టర్ బొందాడ ఫ్లోరిడా వింటర్ స్ప్రింగ్స్ లోని ట్రాన్స్ పోర్టేషన్ ఫర్ EPIC ఇంజనీరింగ్ అండ్ కన్సల్టింగ్ గ్రూప్ కి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వృత్తి పరంగా సత్తా చాటుతూనే మరో వైపు సామాజిక సేవ పై కూడా దృష్టి సారించారు. అమెరికా లో తెలుగు వారికి అండగా నిలిచే నాట్స్ తో కలిసి 2009 నుండి పని చేస్తూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.