To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
31 May 2014
Hyderabad
దుబాయ్,పరిసర గల్ఫ్ లో వివిధ వ్యాపారాలు,సంస్థలూ నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న తెలుగు వారందరూ కలిసి తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ అండ్ ఎచివర్స్ మీట్ (TEAM-Dubai) లో కలుసుకుని, గల్ఫ్ వాణిజ్య,వ్యాపార రంగం, తెలుగు వారి పాత్ర మీద ఒక గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ప్రముఖ రచయిత, దర్శకులు, మోటివేషనల్ ట్రైనర్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ, తెలుగు వారు ఎక్కడికెళ్ళినా రాణిస్తారని, కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, పరస్పరం ప్రోత్సహించుకుంటూ ముందుకెళితే అందరికీ విజయం దక్కుతుందని, తెలుగు వాడి సత్తా అందరికీ తెలుస్తుందనీ తన సందేశంలో పేర్కొన్నారు.
గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అధినేత, ఈ కార్యక్రమ రూపకర్త కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ, టెక్నోఫాబ్ దుబాయ్ పేరిట ఒక ఫాబ్రికెషన్,ఇంజినీరింగ్ కంపెనీ స్థాపించి అనేక సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాధికల్పించామని, అలాగే తెలుగు వారందరికీ ఉపయోగ పడే రీతిలో గల్ఫ్ ఆంధ్ర టూర్స్ ద్వారా భారత దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలకు, షిరిడి, శబరిమల,తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు స్పెషల్ టూర్ పేకేస్ అందించడమే కాకుండ, గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ద్వారా తెలుగువారందరూ గర్వించేలా గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించి, ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్,సినీ దర్శకులు శ్రీ బాపు గారిని సత్కరించామని, ఈ కార్యక్రమానికి ఎస్ పీ బాలౌబ్రహ్మణ్యం,మనో,దర్శకులు రాఘవేంద్ర రావ్, బోయపాటి సీను, దేవి శ్రీ ప్రసాద్,సుమ, అలి, సాయికుమార్ వంటి ప్రముఖులు హాజరయ్యారని, వచ్చే సంవత్సరం మార్చ్లో గామా అవార్డ్స్ 2014 నిర్వహించబోతున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కిషోర్ బాబు, ఎస్ ఎస్ రాజు,KSN ప్రసాద్, కట్టా ప్రసాద్, సుంకర శ్రీవచవ, కిరణ్, గనేష్, ప్రమోద్ తదితరులు తమ తమ అనుభవాలు పంచుకున్నారు.