To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
06 October 2016
Hyderabad
క్యాలిఫోర్నియా - అమెరికా : భారతీయ సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ని కలిగించటానికి ఆవిర్భవించిన యీనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, ప్రవాస చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. భారతీయ కళలు, కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యం తో పాటు, మరెన్నో అంశాలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అందించడానికి ఏర్పాటైన యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, కాలిఫోర్నీయా రాష్ట్రం లోని మిల్పిటాస్ నగరంలో స్వంతగా భవనాన్ని సమకూర్చుకుంది. దాదాపు 65000 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలంలో నిర్మించబడిన 25,000 చదరపు అడుగుల భవనాన్ని పరిపాలన, బోధన ,పరిశోధన మరియు ప్రచురణల అవసరాల నిమిత్తం 5.5 మిలియన్ డాలర్ లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ భవనం కొనుగోలు చేయడానికి ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు - సమాజ సేవకులు - డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి 10 లక్షల డాలర్ల విరాళం అందించి తమ ఉదారతను చాటారు. హనిమిరెడ్డి గారి గౌరవార్ధం - సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ భవనానికి 'డా. లకిరెడ్డి హనిమిరెడ్డి భవనం ' అని నామకరణం చేసారు . ఎంతో వైభవంగా జరిగిన ఈ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గా విచ్చేసిన లకిరెడ్డి కుటుంబ సభ్యులు, సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ అభివృద్దికి ముందు ముందు కుడా తమ సహకారం అందిస్తామని తెలిపారు. డా. హనిమిరెడ్డి మాట్లాడుతూ, తాను సిలికానాంధ్ర ను 15 సంవత్సరాలనుండి చూస్తున్నానని, చెప్పిన పని చేసి చూపించే సత్తా వారికుందని, సిలికానాంధ్ర వారంతా ఒకే కుటుంబంలా కలిసి మెలిసి పనిచేస్తుంటారని, అందుకే వారు తలపెట్టిన పనికి తమ కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఒక మిలియన్ డాలర్ల విరాళం అందించామని అన్నారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వయోలిన్ విద్వాన్సులు శ్రీ అన్నవరపు రామస్వామి, చిత్రవీణ రవికిరణ్, డా.విక్రం లకిరెడ్డి , జయ ప్రకాశ్ రెడ్డి, మాధురి కిషోర్, స్మితా మాధవ్ వంటి కళాకారులు, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు, దాతలు హాజరయి, సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు.
సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, మన భారతీయతను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని మేళవించి పీజి, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను అందించబోతున్నామని, జనవరి 2017 నుండి తరగతులు ప్రారంభమౌతాయని, నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను తలపించే విధంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. చీఫ్ అకాడెమిక్ ఆఫీసర్ రాజు చమర్తి మాట్లాడుతూ, 10 సంవత్సరాల క్రితం 150 మంది విద్యార్ధులతో ప్రారంభమైన మనబడి ద్వారా ఇంతవరకు 25000 మందికి పైగా విద్యార్ధులకు తెలుగు నేర్పామని, ఈ విద్యా సంవత్సరంలో 7500 మంది కి పైగా విద్యార్ధులు ఇప్పటికే నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ భవనం కొనుగోలు చేయటానికి ముందుకొచ్చి సహాయం చేసిన విశ్వ విద్యాలయ వ్యవస్థాపక దాత లను యూనివర్సిటీ ముఖ్య ఆర్ధిక వ్యవహారాల అధికారి (CFO) దీనబాబు కొండుభట్ల సభికులకు పరిచయం చేసి సత్కరించారు. ఒక లాభాపేక్షరహిత (NPO) కు బాంక్ ద్వారా లోన్ లభించడానికి, డాక్టర్ హనిమిరెడ్డి గారి వంటి వారి నుంచి భారీ సహాయం లభించడానికి కార్య కర్తల అంకిత భావం మరియు జవాబు దారి తనం తో పాటు సిలికానాంధ్ర ఆర్ధిక ప్రణాళికలు పారదర్శకం గా ఉండడం ముఖ్య కారణమన్నారు. రాబోయే అయిదేళ్ళలో 100 మిలియన్ డాలర్ల ను విరాళాలు ద్వారా సేకరించి అత్యాదునిక విశ్వ విద్యాలయ ప్రాంగణాన్ని నిర్మించాలని ప్రణాలికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.విశ్వ విద్యాలయానికి సహకరించ దలచిన దాతలు, + 1 408 205 5527 కి ఫోన్ చేయ వలసిందిగా అభ్యర్ధించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అజయ్ గంటి ,రవి కుచిభోట్ల ,సంజీవ్ తనుగుల, శాంతి కూచిభొట్ల, శ్రీరాం కోట్ని, ప్రభా మాలెంపాటి,సాయి కందుల, రవి చివుకుల, ఫణీ మాధవ్ కస్తూరి, వంశి నాదెళ్ళ ,శాంతి అయ్యగారి ,గోపిరెడ్డి శరత్ వేట ,భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, యం జె తాటిపామల తదితరులు పాల్గొన్నారు.