
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 May 2017
USA
అమెరికా, కెనడా మరియు స్కాట్ లాండ్ దేశాలలో దాదాపు 50 కేంద్రాలలో 1423 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో 99.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు క్యాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరం లో ఆదివారం నాడు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనం లో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవం లో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు ముఖ్య అతిధులు గా విచ్చేసి క్యాలిఫోర్నియా విద్యార్ధులకు ధృవీకరణ పత్రాలను అందజేసారు.
తెలుగు విశ్వవిద్యాలయం అందించే కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సులలో కూడా జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ స్థాయి పరీక్షలను సిలికానాంధ్ర తో కలిసి నిర్వహించడానికి సంబంధించిన అవగాహన పత్రాలపై పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంపద (SAMPADA - Silicon Andhra Music, Performing Arts & Dance Academy) అని పేరు పెట్టారు . ఈ పరీక్షలలో పాల్గొనగోరే విద్యార్ధులు సెప్టెంబర్ 10, 2017 లోపల sampada.siliconandhra.org ద్వారా, నమోదు చేసుకోవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి గారు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి గారు, పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల గారు, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు గారు, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్ గారు పాల్గొన్నారు.
మనబడి దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభసంవత్సరంలో మరొక విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక గుర్తింపుసంస్థ ఏ సీ ఎస్ వాస్క్ ( Accreditation Commission of Schools -Western Association of Schools & Colleges ) డైరెక్టర్ డా. జింజర్ హావనిక్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిధిగా విచ్చేసి, అమెరికా లోని 35 పైగా రాష్ట్రాలలోని 250 ప్రాంతాలలో నిర్వహిస్తున్న అన్ని మనబడి కేంద్రాలకు , వాస్క్ గుర్తింపునిస్తున్నట్టు ప్రకటించి, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మనబడి అద్యక్షులు రాజు చమర్తి కి అందజేసారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల,ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల, శరత్ వేట, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, సిలికానాంధ్ర మరియు మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు.








