To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
5 May 2016
Hyderabad
ఏప్రిల్ 30 వ తేదీన కెనడా లోని టొరంటో లో శ్రీ సత్య సాయి బాబా సెంటర్ టొరంటో -యార్క్ నందు జరిగిన మనబడి పిల్లల పండుగ వెల్లి విరిసిన తెలుగుదనం. 2007లో 150 మంది పిల్లలతో ప్రారంభమైన ‘మనబడి’ సంస్థ, ఇప్పుడు దాదాపు 6,500 మంది పిల్లలతో, ఎంతో విజయవంతంగా నడుస్తోంది. టొరంటో లోని నాలుగు సెంటర్లలో షుమారు 100 మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు . తెలుగు భాషా ప్రేమికులకు కన్నుల పండుగగా, అత్యంత రమణీయంగా పదహారణాల తెలుగు వినోదాన్ని, సినిమావాసన లేని తెలుగు సువాసనలను వెదజల్లారు, మనబడిలో తెలుగు నేర్చుకునే చిన్నారులు. సుమారు 500 మంది తెలుగువాళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి ఈ వేడుకలని తిలకించి ఆనందించారు. శ్రీ మంజునాధ సిద్దాంతి గారి వేదఘోష మధ్య శ్రీమతి మీనా మూల్పురి, శ్రీమతి గీతాలక్ష్మీ, శ్రీమతి ఉదయసాయిరాం, శ్రీమతి అనురాధ మరియు శ్రీమతి రమాదేవి గార్లు దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ కొండుభట్ల దీనబాబు గారు, సిలికానాంధ్ర మనబడి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షకులు, ఆచార్య M. కులశేఖర రావు గారు మరియు శ్రీచారి సామంతపూడి, తాకా అధ్యక్షులు విచ్చేసినారు. కెనడా మనబడి సమన్వయకర్త శ్రీ గంగాధర్ సుఖవాసి గారు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా అమెరికా నుంచి విచ్చేసిన, సిలికానాంధ్ర మనబడి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షకులు శ్రీ దీనబాబు గారు మాట్లాడుతూ వేలకొద్దీ భాషాసైనికులు, వందలకొద్దీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమిష్టి కృషి ఈ విజయానికి ప్రధానకారణమని, అందుకు మనబడి పాఠ్యప్రణాళిక ఊపిరి అని అన్నారు. ఈ మహాయజ్ఞంలో తమవంతుగా తోడ్పడుతూ, వారి పిల్లలకి మనబడిలో తెలుగునేర్పిస్తున్నందుకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా తరువాతి తరాలకు అందజేసే బృహత్ కార్యక్రమం మనబడి అని, వచ్చే సంవత్సరం కెనడా నుండి మనబడి లో చదివే విద్యార్ధుల సంఖ్య మరింత పెరగాలని సూచిస్తూ అందుకు కావలసిన సహాయాన్ని మనబడి తరఫున అందిస్తామని ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య తెలిపారు.
25 మంది ఉపాధ్యాయులు గత కొన్ని రోజులుగా తరగతిలోపాఠాలే కాక, అదనంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలలో పిల్లలకి శిక్షణను ఇచ్చారు. వారిచే తెలుగు జానపద, లలిత గీతాలను, దేశభక్తి గేయాలను, పద్యాలను,నాటకాలను, మంచి మాటల, పాటల, ఆటలతో మేళవించి తెలుగు రంగస్థల వైభవానికి చిన్నారులు తళుకులను అద్దారు. .ఈ పండుగలో చిన్నాపెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల సీతాకోకచిలుకల్లా,తెలుగుదనం వెల్లివిరిసేలా మిలమిలలాడే కొత్తబట్టలతో, ఆహూతుల కరతాళధ్వనుల మధ్య, శోభాయాత్ర చేసి వేదికమీదకు చేరి, వేదప్రవచనాలతో ఆశీస్సులు పొందారు. తరాల మధ్య బంధం నిలుపుతున్న భాషను పిల్లలకు నేర్పే స్ఫూర్తికి ప్రతీకలా “తెలుగుభాషా జ్యోతి”, మూడుతరాల కరాలు మారింది, వచ్చి చూసినవారి హృదయాలను చేరింది. తరువాత సాగిన బాలగానామృతం, బృందగానాలు, పద్యాలు హాస్య, పౌరాణిక, సాంఘిక నాటికలు వంటి కార్యక్రమాలు ఆద్యంతమూ అందరి మనసులను రంజింప జేసాయి. ఈ కార్యక్రమాల్లో అన్నిచోట్లా మనబడి ప్రస్తుత విద్యార్థులే వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం విశేషము. ఇందరు కార్యకర్తలు కెనడా లాంటి ఒక విదేశీ గడ్డ మీద ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చక్కని ప్రణాళికతో నిర్వహించడం, వారికి తమ మాతృభాష మీద ఉన్న ప్రేమను చెప్పక చెబుతుంది.