
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
3 May 2018
USA
సిలికానాంధ్ర మనబడి ద్వారా 2017-2018 విద్యాసంవత్సరానికి గాను తెలుగు లో జూనియర్ (ప్రకాశం) మరియు సీనియర్(ప్రభాసం) కోర్సులు పూర్తిచేసిన 1933 మంది విద్యార్ధులకు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు . దీనిలో 1400 మండి విద్యార్ధులు జూనియర్ సర్టిఫికేట్, 533 మండి విద్యార్ధులు సీనియర్ సర్టిఫికేట్ కోర్సులో అర్హత కోసం పరీక్షలు రాశారు.
ఈ పరీక్షల నిర్వహణకు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల, పరీక్షల నియంత్రణాధికారి రెడ్డి శ్యామల , మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంచాలకులు శ్రీమతి గీతావాణి , ఆచార్య రమేశ్ భట్టు , ఆచార్య యెండ్లూరి సుధాకర్ రావు తదితరులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసి పరీక్షలు సజావుగా నిర్వహించటానికి ఎంతగానో సహకరించారు. సిలికానాంధ్ర మనబడి పరీక్షలు మరియు గుర్తింపు విభాగ ఉపాధ్యక్షులు శ్రీదేవి గంటి ఈ పరీక్షలు ఏర్పాట్లను సమన్వయ పరిచారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అలేఖ్య పుంజల మాట్లాడుతూ ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్నా, పిల్లలకు తెలుగు భాష నేర్పించటానికి కృషి చేస్తున్న తల్లితండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.
మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో 35 వేలమందికి పైగా తెలుగు బాలబాలికలు మనబడి ద్వారా తెలుగు నేర్చుకుంటున్నారని, 250 కి పైగా ఉన్న కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తున్న మనబడి విద్యావిధానానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు, అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ అర్హత కూడా లభించిందని, అంతే కాకుండా, ప్రతిస్టాత్మక 'Western Association of Schools and Colleges (WASC) గుర్తింపు పొందిన ఏకైక తెలుగు నేర్పే విద్యావిధానం మనబడి మాత్రమే అని తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరానికి అడ్మిషన్స్ ప్రారంభమైనాయని, నమోదు కొరకు http://manabadi.silionandhra.org ద్వారా ఆగస్ట్ 31 లోగా నమోదు చేసుకోవచ్చని మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణలో మనబడి కీలక బృంద సభ్యులు శాంతి కూచిభొట్ల, డాంజి తోటపల్లి, శరత్ వేట, శ్రీదేవి గంటి, భాస్కర్ రాయవరం తోపాటు మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, భాషాసైనికులు ఎంతో మంది సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
