pizza
Manabadi west sadassu
ఆహ్లాదకరమైన బిగ్ బేర్ లేక్ వద్ద మనబడి పశ్చిమ సదస్సు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

11 August 2015
Hyderabad

ఆహ్లాదకరమైన బిగ్ బేర్ లేక్ వద్ద మనబడి పశ్చిమ సదస్సు

క్యాంప్ టాండా, బిగ్ బేర్ లేక్, కాలిఫోర్నియా, ఆగష్టు 7,8,9 – అమెరికాలో తెలుగు భాషాసేవకై విశేషకృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏటేటా ఉపాధ్యాయుల, సమన్వయకర్తల ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ సదస్సులు మూడు ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 3వ సదస్సు విభిన్న రీతిలో నిర్వహించారు. రద్దీ పట్టణ వాతావరణానికి దూరంగా, ప్రకృతి ఒడిలో, అందమైన బిగ్ బేర్ లేక్ ఒడ్దున, పొడుగాటి పైన్ వృక్షాల నీడన, నివాస గుడారల వసతిలో ఒక “తెలుగు కుటుంబ శిబిరం”లా ఈ సదస్సు, ఈ వారాంతం లాస్ ఏంజిల్స్ నగర సమీపంలోని బిగ్ బేర్ లేక్ వద్ద జరిగింది. దక్షిణ కాలిఫోర్నియా మనబడి సమన్వయకర్త మనబడి ఉపాధ్యక్షుడు తోటపల్లి డాంజీ దిశానిర్దేశంలో, రాణి ప్రసాద్ నేతృత్వంలో, బండ్లమూడి శ్రీధర్, రాణి శ్రీనివాస్, కంభంపాటి జవహర్, దర్భల కాంతి మరియు ఇతర దక్షిణ కాలిపోర్నియా బృందం ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్ధవంతంగా, విజయవంతంగా నిర్వహించారు. దోసా ప్లేస్ వారు అక్కడిక్కక్కడే వండి అందించిన పసందైన పదహారణాల తెలుగు భోజనం పాల్గొన్నవారందిరికి ఆనందం కలిగించింది.

లాస్ అన్జేలీస్, బే ఏరియా, శాక్రమెంటో, సాన్డియాగో, కాన్సస్, ఫీనిక్ష్, డెన్వర్ ఇంకా సింగపూర్ నుండి కూడా మనబడి ఉపాధ్యాయులు, సమన్వయకర్తలూ మరియు కీలక బృందంలోని సభ్యులు, మొత్తం నూట యాభైమంది పాల్గొన్నారు. అందరు స్వచ్చంద భాషాసైనికులని ఒకచోటికి తెచ్చి, వారి అనుభవాల ద్వారా, వివిధ కార్యాచరణ అంశాలని క్రోడీకరించి వాటిని భవిష్యత్ వ్యూహరచనలో పొందు పరుచడం, జట్టుబలం పెంచి “భాషాసేవయే భావితరాల సేవ” అన్న స్పూర్తితో ఎక్కువమంది పిల్లలు తెలుగు నేర్చుకోవాలన్న లక్ష్య సాధనే ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశ్యం అని, మనబడి డీన్ మరియు అధ్యక్షులు చమర్తి రాజు తెలిపారు.

ఈ సదస్సులలో ముఖ్యభాగంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడే సరికొత్త ప్రమాణీకరణ సరణి వివరాలు, ఉపాధ్యాయ ప్రశిక్షణ విధానాన్ని, ప్రాచీన భాషనుంచి ప్రపంచభాషగా తెలుగును తీసుకువెళ్ళే ఆశయం, పాటించవలసిన శిక్షణాప్రమాణాల గురించి పాఠ్యప్రణాళిక ఉపాధ్యక్షురాలు కూచిభొట్ల శాంతి, తోటపల్లి డాంజీ, రాయవరం విజయ భాస్కర్, ఓరుగంటి వేణుగోపాల కృష్ణలు వివరించారు. ఇంకొక ప్రధానాంశం, విద్యాసంవత్సరం చివరిలో నిర్వహించిన అభిప్రాయసేకరణలో దాదాపు వెయ్యిమంది తల్లిదండ్రులు ఇచ్చిన స్పందనని విశ్లేషించి చర్చించడం. అత్యంత కీలకమైన ఈ చర్య మనబడి దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రాచుర్యం విభాగం ఉపాధ్యక్షులు రాయవరం విజయభాస్కర్ చెప్పారు.

శుక్రవారం 7వ తేదీన సభ్యుల పరిచయాలతో మొదలయి శనివారం వరకూ, కార్యక్రమ అభివృద్ధి, ప్రాచుర్యం, పాఠ్యప్రణాళిక, అంతర్జాల సేవలు, అమెరికాలోని పాఠశాలలో తెలుగుకు ప్రపంచ భాషగా గుర్తింపు, ఆర్థిక వివరాలు, మొదలయిన విభాగాలను నిర్వహిస్తున్న సభ్యులు తమ ప్రయత్నాలను అందరితో పంచుకున్నారు. శనివారం సాయంత్రం నౌకా విహారం, జట్టు కట్టు సరదాలతో గడిచింది. ఆదివారం వివిధ అంశాలపై మేధామథనం సాగించారు. ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం, భాషాభిమానంతో పిల్లలకి తెలుగు నేర్పడానికి ముందుకు వచ్చేవారికి పాఠ్యప్రణాళికపై సరైన అవగాహన వచ్చి, మనబడి లక్ష్యాల సాధనలో దోహదపడుతుందని, కూచిభొట్ల శాంతి తెలిపారు. దేశవ్యాప్తంగా, ఎక్కడ పది తెలుగుకుటుంబాలు ఉంటాయో అక్కడ మనబడి ప్రారంభిస్తామని శరత్ వేట తెలిపారు. అనేక ఆర్ధికపరమైన అంశాల గురించి మరియు వినియోగాల గురించి ఆర్ధిక విభాగ ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల చక్కని వివరణ ఇచ్చారు. మనబడి పోర్టల్ గురించి కొట్ని శ్రీరాం, ప్రపంచభాష గుర్తింపు మరియు పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ పరీక్ష, స్నాతకోత్సవాల గురించి గంటి శ్రీదేవి, సాంస్కృతికోత్సవాలపై చమర్తి రాజు, తెలుగు మాట్లాట గురించి తోటపల్లి డాంజీ ప్రసంగించారు. ఒక చక్కటి కుటుంబ వాతావరణం కలిపించి అతిథులందరినీ ఆత్మబంధువుల్లాగ ఆదరించి వీడ్కోళ్ళు సమయంలో కళ్ళు చెమరింపజేసేలా నిర్వహించారు, అని సదస్సుకి వచ్చిన వారందరూ చెప్పారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved