To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
14 September 2017
USA
గత 10 సంవత్సరాలుగా 27000 మందికి పైగా ప్రవాస బాలలకు తెలుగు నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి 2017-18 విద్యాసంవత్సరం అమెరికా -కెనడా దేశాలలో సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమైనాయి. అమెరికాలో 35 పైగా రాష్ట్రాలలో 250 కేంద్రాలలో ఈ విద్యాసంవత్సరం తరగతులకు వేలాది మంది విద్యార్ధులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో పాటు అమెరికా వ్యాప్తంగా ప్రతిష్టాత్మక WASC (Western Association of Schools and Colleges) గుర్తింపు లభించిన మనబడి తరగతులకు 27 కు పైగా స్కూల్ డిస్ట్రిక్ట్‌లలో వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ కు అర్హత సాధించిన తెలుగు నేర్పించే ఏకైక విద్యాలయం సిలికానాంధ్ర మనబడి.
క్యాలిఫోర్నియా సన్నివేల్ విభాగంలో తరగతులను ప్రారంభిస్తూ మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, భారత దేశానికి ఎంతో దూరంగా ఉన్నా, మాతృ భాష కి దూరం కాకూడదని, పుట్టిన ఊరిలో ఉన్న వారితో బంధాన్ని నిలిపి ఉంచేందుకు మన భాష ఎంతో ముఖ్యమని గుర్తించి మన పిల్లలకు తెలుగు నేర్పించాలన్న లక్ష్యంతో మనబడి ప్రారంభించామని, దశాబ్ది కాలంగా తమ పిల్లలను మనబడిలో చేర్పించి తెలుగు నేర్పిస్తున్న తల్లి తండ్రులకు, భాషాసేవయే భావితరాల సేవ ! అనే స్ఫూర్తితో తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, భాషా సైనికులకు కృతజ్ఞతలు తెలియజేసారు. వివిధ ప్రాంతాలలో తరగతులను మనబడి ఉపాద్యక్షులు శరత్ వేట, డాంజి తోటపల్లి, భాస్కర్ రాయవరం, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి తదితరులు పర్యవేక్షించారు.
అమెరికా వ్యాప్తంగా ఈ వారాంతంలో వివిధ ప్రాంతాలలో తరగతులు ప్రారంభమైన సందర్భలో, కూపర్టినో కేంద్రంలో మనబడి తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చెసిన ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగెశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలుగు భాషకు ప్రపంచపీఠం పై పట్టంకట్టడానికి మనబడి చేస్తున్న కృషిని అభినందిస్తూ, తల్లి తండ్రులకు ఉపాధ్యాయులకు మాతృభాష పట్ల మమకారాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అని ఆశువుగా తనదైన చమత్కారంతో తెలుగు భాష గొప్పదనం గూర్చి ఉత్తేజపూరిత ప్రసంగాన్నిచ్చారు.
మనబడి 2017-18 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు సెప్టెంబర్ 22, 2017 వరకు అందుబాటులో ఉంటుందని, రిజస్టర్ చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు manabadi.siliconandhra.org చూడాలని మనబడి ఉపాద్యక్షులు దీనబాబు కొండుభట్ల కోరారు.