To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
13 October 2014
Hyderabad
విడిపోయినప్పటికీ 3వేల సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన తెలుగు జాతి ఎప్పటికీ శాశ్వతమని, రాజకీయాలు, కులాలు, మతాలు వంటివి అశాశ్వతమైనవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం నాడు ఎలికాట్ సిటీలో స్ధానిక ప్రవాసాంధృడు చందూ శ్రీనివాస్ సమన్వయంతో, వారధి తెలుగు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మేరీల్యాండ్ ప్రవాసాంధ్రుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రతి ప్రవాసాంధృడు తమ ప్రాంతంపై దృష్టి సారిస్తే చాలని, అదే దేశాభివృద్ధికి కీలక బాటలు ఏర్పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు వాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడగలగటం ఎన్నో జన్మల తప: ఫలమని, ఇక్కడి తెలుగువారికి భాష పై మక్కువ చూస్తే ముచ్చట వేస్తోందని అన్నారు. ప్రతి తెలుగువాడు తన జీవిత లక్ష్యాల్లో, తమ ఊరి గురించో, తమ బాల్యం గురించో, లేదా తమ ఉద్యోగాల గురించో ఏదో ఒక రూపేణా తెలుగులో పుస్తకాలు రాయాలని అప్పుడు ప్రాచీన భాష అయిన మన తెలుగు ప్రపంచ భాషగా అవతరిస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే తమ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుందని, కేంద్రం నుండి రాయితీలు, రాష్ట్ర ప్రభుత్వం నుండి రాయితీలు చాలా ఆశాజనకంగా ఉండబోతున్నాయని, వీటిని ప్రవాసులు సద్వినియోగం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని బుద్ధప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
మేరీల్యాండ్ ప్రతినిధుల సభలో 15వ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రవాసాంధ్ర మహిళ కాట్రగడ్డ అరుణా మిల్లర్ మరో ముఖ్య అతిధిగా హాజరయి ప్రసంగించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో ఇకపై దీపావళిని అధికారిక పండుగగా గుర్తించేందుకు మేరీల్యాండ్ గవర్నర్ మార్టిన్ ఓ మాలీ ఆమోదముద్ర వేశారని, ఇది భారతీయులకు దక్కిన అరుదైన గౌరవమని ఆమె అన్నారు. అమెరికాలో భాజపా ప్రతినిధి అడపా ప్రసాద్ మాట్లాడుతూ గుజరాతీయులను ఆదర్శంగా తీసుకుని ప్రవాసాంధృలు నూతన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలుగువాడిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతానని స్పష్టం చేశారు. స్ధానిక ప్రవాసాంధ్ర ప్రముఖులు డాక్టర్ యడ్ల హేమ ప్రసాద్, డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య, డాక్టర్ జగన్ రాజులు మండలి బుద్ధప్రసాద్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాధవి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వారధి ప్రతినిధులు సుంకర రాజేష్, అమృతం కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అంతక ముందు, బుద్ధ ప్రసాద్ వాషింగ్టన్ లోని పెంటగాన్ తో పాటు సెనేట్ కార్యాలయాన్నిసందర్శించారు.