To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
03 June 2016
Hyderabad
'నార్త్ అమెరికా తెలుగు సమితి' తెలుగు వారందరినీ ఒక చొట చేర్చే సంబరం "నాటా2016" సభలు డలాస్ లోమే 27, 28, 29 న మూడు రోజుల పాటు సందడిగా జరిగిన సందర్భంలో సాహిత్యానికి ఒక ప్రత్యేక వేదిక అమరింది. ప్రవాస రచయితలూ కవులే కాక, భారత దేశం నుంచి కూడా రచయితలు, కవులు, కవయిత్రులూ ఈ వేదిక పైన పలు సాహిత్య ప్రక్రియల మీద,సాహిత్యంలో వస్తున్న మార్పుల గురించీ ప్రసంగాలు చర్చలూ చేశారు.
నాటా లిటరరీ కమిటీ ఛైర్ డా. ఇస్మాయిల్ పెనుకొండ, కో-ఛైర్స్ సుజాత బెడదకోట, బస్వి రెడ్డి ఆయులూరి, దయాకర్ మాడ, కమిటీ సభ్యులు శ్రీధర్ సిద్ధా, స్వర్ణ అట్లూరి, సురేష్ కాజ, నసీం షేక్, హరిచరణ ప్రసాద్, శ్రీ బసాబత్తిన మరియు కుమారి సాహితి కాజ ఈ సాహితీ సమావేశాల విజయానికి తమ వంతు పాత్ర పోషించారు. సాహితీ కమిటీ అడ్వైజర్స్ శ్రీ చంద్ర కన్నెగంటి, డా. శ్రీనివాస రెడ్డి ఆళ్ల, రమణ జువ్వాడి సాహిత్య వేదిక సభ్యులను వెన్ను తట్టి ముందుకు నడిపించారు.
రెండు రోజుల పాటు నాటా సాహిత్య వేదిక లో కథ, నవల, కవిత, సినిమా సాహిత్యం , ఈ నాలుగు విభాగాలు చోటు చేసుకున్నాయి. మొదటి రోజైన శనివారం "తెలుగు కథ-ఒక సమాలోచన" అంశం మీద రచయితలు ప్రసంగించారు. "సరైన దారుల కోసం కొత్త కథకుడి రచనా స్పూర్తి" అంశం మీద రచయిత మధు పెమ్మరాజు ప్రసంగించగా, "ఇండియన్ డయాస్పోరా లో తెలుగు డయాస్ఫోరా స్థానం" గురించి ప్రముఖ రచయిత గొర్తి సాయి బ్రహ్మానందం పలు ఆసక్తి కర విషయాలను వివరించారు. "కథలెందుకు చదవాలి" అనే అంశం మీద శ్యాం యానా పుస్తక రచయితగా ప్రసిద్ధులైన మెడికో శ్యామ్ కొత్త కోణాలు ఆవిష్కరించగా, "సమకాలీన కథపై ఇంటర్నెట్ ప్రభావం" అనే సరికొత్త అంశం మీద ప్రముఖ రచయిత్రి, సారంగ ఆన్ లైన్ పత్రిక ఎడిటర్ కల్పనా రెంటాల సాధికారిక ప్రసంగం చేశారు. ఆన్ లైన్ పత్రికలు పెరుగుతున్న నేపథ్యంలో పలు అంశాల్ని స్పృశించారు. అమెరికా హాస్య బ్రహ్మగా పేరొందిన హాస్య రచయిత వంగూరి చిట్టెన్ రాజు "అమెరికా కథా వస్తువుల్లో లోపిస్తున్న వైవిధ్యం" గురించి కొత్త కథకుల్లో ఆలోచనలు రేకెత్తించే విషయాలు సవివరంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగిన "తెలుగు కథ- దశ, దిశ" చర్చా కార్యక్రమం ఆద్యంతం అసక్తి గా సాగింది. ఈ చర్చలో కథా రచయితలతో పాటు సాహిత్యాభిమాని ప్రవాసాంధ్ర ప్రముఖులు, తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి గారు పాల్గొన్నారు. ఈ కార్య క్రమం మొత్తానికి ప్రముఖ రచయిత చంద్ర కన్నెగంటి సంచాలకులుగా వ్యవహరించారు.
ఆ తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఇదే వేదిక మీద "తెలుగు నవల" మీద ప్రసంగాలు సాగాయి. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ సుబ్రమణ్యం జొన్నలగడ్డ, సాహితీ సమన్వయకర్త ప్రవీణ్ బిల్లా 106వ నెల నెలా తెలుగు వెన్నెలను ఈ కార్యక్రమంలో భాగంగా జరిపిస్తూ, సాహిత్య వేదిక కు సహ భాగస్వాములుగా తమ సహాయ సహకారాలు అందించారు. "తెలుగు చారిత్రక నవల" అనే అంశం మీద రచయిత్రి డాక్టర్ మంథా భానుమతి, "నవల నడిచిన దారి" అంశం మీద దాసరి అమరేంద్ర ప్రసంగించగా, "తెలుగు నవల-సినిమా" అనే అంశం మీద రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి ప్రసంగించారు. రమణి గారి నవల "ఎందుకీ సందెగాలి" వంశీ రామరాజు ఆవిష్కరించి మొదటి ప్రతిని శ్రీ ప్రసాద్ తోటకూరకు అందజేసారు. ఈ సందర్భంగా విజయవాడ సాహితీ మిత్రులు ప్రచురించిన "కవిత-2015" కవితా సంకలనాన్ని కవి అఫ్సర్ ఆవిష్కరించి మొదటి ప్రతిని డా.ఇస్మాయిల్ పెనుకొండకు అందజేసారు.
రెండవ రోజు మే 29 ఆదివారం ఉదయం తెలుగు సాహిత్య ప్రత్యేక సంప్రదాయం అష్టావధానం తో ప్రారంభమైంది. శ్రీ నరాల రామారెడ్డి అవధానిగా వ్యవహరించగా పృచ్ఛకులుగా రమణ జువ్వాడి,సి.వి. సుబ్రహ్మణ్యం,విన్నకోట రవిశంకర్,పివి.సుబ్బారావు, సురేష్ కాజ,లెనిన్ బాబు,దయాకర్ మాడ, వంగూరి చిట్టెన్ రాజు వ్యవహరించి రక్తి గట్టించారు. మధ్యాహ్నం ప్రముఖ కవి, యునివర్సిటి ఆఫ్ టెక్సాస్ లో సీనియర్ తెలుగు లెక్చరర్ గా అఫ్సర్ మహమ్మద్ సంచాలన లో "తెలుగు కవిత-ఓ నూతన దృక్కోణం" చర్చా కార్యక్రమం లో కవులు కవయిత్రులు వివిధ అంశాలపై ప్రసంగించారు. "కవిత్వానికి ప్రేరణ" అంశం పై పాలపర్తి ఇంద్రాణి, "కవిత్వంలో ప్రయోగాలు" అంశం పై విన్నకోట రవి శంకర్,"కవిత్వంలో ప్రాంతీయత" అంశం పై వెంకటయోగి నారాయణ స్వామి,” భిన్న అస్తిత్వాలు- వస్తు రూపాలు" అంశం మీద ప్రముఖ స్త్రీవాద కవయిత్రి కొండేపూడి నిర్మల ప్రసంగించారు.
దాని తర్వాత "తెలుగు సినిమా పాటల్లో సాహితీ విలువలు" అంశం మీద ఆసక్తి కర చర్చా కార్యక్రమం జరిగింది. ప్రేక్షకులు కూడా పాల్గొన్న ఈ చర్చలో సినీ గీత రచయిత చంద్రబోస్, దర్శకులు వి.ఎన్ ఆదిత్య,మేర్లపాక గాంధీ, హరీష్ శంకర్, రచయిత్రి బలభద్ర పాత్రుని రమణి పాల్గొన్నారు.