To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
30 March 2016
Hyderabad
ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు అంతర్జాతీయ సంస్ధలు ముందుకు రావటం ముదావహమని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రత్యేకించి విదేశాలలో ఉన్న తెలుగు సంస్ధలు ఇక్కడి ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు స్పూర్తి దాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఉన్నత కుటుంబాలకు చెందిన వారు తాము ఆర్జించిన దానిలో కొంత భాగాన్ని సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి వినియోగించేందుకు ముందుకు రావాలని స్పీకర్ అన్నారు.
మంగళవారం శాసనసభలోని సభాపతి కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మెదక్ జిల్లా పాపన్న పేట మండలం లక్ష్మి నగర్ కు చెందిన కె .పూజిత కుటుంబానికి డాక్టర్ కోడెల రూ.9,50,000 చెక్కును అందచేసారు. బి.టెక్ చదువుతున్న పూజిత గత సంవత్సరం నవంబరులో రోడ్డు ప్రమాదానికి గురికాగా, ఆర్ధికంగా వెనుకబడిన ఆ కుటుంబం వైద్య ఖర్చులను భరించగలిగే స్ధితిలో లేదు. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), ప్రవాసాంధ్రులు పూజిత వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నాట్స్ ఇండియా కోఆర్డినేటర్ రతీష్ అడుసుమిల్లి అమెరికాలోని ప్రవాసాంద్రులను సమన్వయపరిచి హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.9,50,000 సమీకరింపచేసారు.
ఈ మొత్తం సొమ్మును ఇండియాలోని గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ ద్వారా పూజిత చికిత్స పొందుతున్న రవీంద్రనాథ్ జిఇ మెడికల్ అసోసియేషన్ (గ్లోబల్ హాస్పటల్) వారికి సభాపతి డా. కోడెల శివ ప్రసాద రావు చేతుల మీదుగా అందించడం జరిగింది. కార్యక్రమం లో కార్మిక శాఖ మంత్రి అచ్చె నాయుడు, ఎంఎల్ఎ గౌతు శివాజీ, రాజమండ్రి శాసనసభ్యుడు ఆకుల సత్యన్నారాయణ, ,గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) జనరల్ సెక్రటరీ వై. వెంకన్నచౌదరి, పూజిత తల్లి కళ్యాణి ,సోదరుడు కృష్ణప్రసాద్ లతో పాటు శాసనసభ కార్యదర్శి సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రైటప్: పూజిత కుటుంబానికి చెక్కును అందచేస్తున్న సభాపతి డాక్టర్ కోడెల, చిత్రంలో అచ్చెనాయిడు, శివాజీ, సత్యన్నారాయణ, రతీష్, వెంకన్న చౌదరి ఉన్నారు.