To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
16 May 2016
Hyderabad
అమెరికాలో గుండెజబ్బుతో మరణించిన తెలుగువాడు సత్యనారాయణ చింతా కుటుంబానికి నాట్స్ అండగా నిలబడింది. ఆయన కుటుంబానికి $38,008.60 డాలర్ల చెక్కును నాట్స్ అందజేసింది. అలబామాలోని మాంట్గోమెరీలో ఉంటున్న సత్యనారాయణ చింతా ఫిబ్రవరి 5వ తేదీన చనిపోయారు. ఈయన గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తెలుగు కమ్యూనిటీ సభ్యుడైన సత్యనారాయణ చింతా డిగ్రీ తరగతి వరకు గుంటూరులో, విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. సత్యనారాయణకు భార్య, ఆరు, మూడు సం. ల వయసున్నఇద్దరు కుమారులు ఉన్నారు.
అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం, చూపించే కారుణ్యం, అతిథి సత్కారాలతో ఎంతోమంది మనసులను గెలుచుకున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన సత్యం హఠాన్మరణం ఆయన కుటుంబానికి, స్నేహితులకు పెద్ద షాక్ ఇచ్చింది. సత్యం ఇక లేరనే విషయం ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. కాని, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆయనను అభిమానించే వారి హృదయాలలో సత్యం ఎప్పటికీ నిలిచి ఉంటారు.
గత కొంతకాలంగా ఇండియాలో ఉంటున్న కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరు దూరమవుతుండడంతో ఆయన అంతిమ సంస్కారాలను అమెరికాలోనే చేయాలని సత్యం కుటుంబం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అలబామాలోని మాంట్గొమేరీలో ఫిబ్రవరి 10వ తేదీన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సత్యం అనారోగ్యం కారణంగా సుమారు ఎనిమిది నెలల పాటు ఇంటెన్పివ్ కేర్ యూనిట్ లో ట్రీట్ మెంట్ పొందారు. ఈ సమయంలో సత్యం కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నాట్స్ పిలుపునిచ్చింది. దీంతో ఎవరికి తోచిన సాయం వారు చేయడంతో నాట్స్ 38 వేల డాలర్ల విరాళాలు సేకరించింది. దీనికి సంబంధించిన $38,008.60 డాలర్ల చెక్కును నాట్స్ హెల్ప్ లైన్ తరఫున, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ రామకృష్ణ మరెన్ని, డల్లాస్ కోర్ టీం సభ్యులు రామకృష్ణ నిమ్మగడ్డ, బాపు నూతి, సత్యనారాయణ కుటుంబానికి అందించారు. ఇంటికి పెద్దదిక్కు కోల్పోయిన తమకు నాట్స్ అండగా నిలబడిందని సత్యనారాయణ కుటుంబం చెప్పుకొచ్చింది.. నాట్స్ అండతో తమ కుటుంబం కొంత కోలుకునే అవకాశం లభించిందని తెలిపింది.