To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
28 December 2014
Hyderabad
భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందడుగు వేస్తోంది.. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్ లో జనవరి 16వ తేదీన భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది. ఒకే రోజు 10 వేల మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించనుంది.. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా రోగులకు ఉచితంగా మందులు కూడా ఇవ్వనుంది. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ సమావేశంలో మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాట్లపై సమీక్షించింది. బోర్డులో సభ్యులంతా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. కొందరు రోగులకు మందులు ఇచ్చేందుకు, విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తెనాలి శాసనసభ్యులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ హెల్త్ క్యాంప్ కు తన పూర్తి స్థాయి మద్దతు అందిస్తామని చెప్పినట్టు నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి తెలిపారు. అటు గుంటూరు జిల్లాలోని ఎన్.ఆర్. ఐ హాస్పిటల్ కు చెందిన వైద్యులు కూడా ఈ ఉచిత వైద్య శిబిరంలో మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారని వివరించారు. గుండె , ఉదరం, మూత్ర పిండాలు, నరాలు, కీళ్లు, మనో సంబంధ వ్యాధులతో పాటు అనేక రోగాలకు ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించనున్నారు. దీని కోసం కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ , పెయిన్ మెడిసన్, న్యూరలాజకల్, ఇంటర్నల్ మెడిసన్, అంకాలజిస్ట్, అర్ధోపెడిక్, కార్డియాక్ సర్జరీ, సైకియాట్రిస్ట్ , ఫిడియాట్రిక్ సెష్పలిస్ట్.. ఇలా ఎన్నో వైద్య రంగాల నిపుణులు ఈ ఉచిత వైద్య శిబిరానికి రానున్నారని మధు కొర్రరపాటి తెలిపారు. అమెరికా నుంచి వైద్య బృందం తెనాలికి చేరుకుని వైద్య సేవలు అందించనుందని ఆయన చెప్పారు. రోగులకు వైద్య పరీక్షలు కూడా అక్కడికక్కడే నిర్వహించనున్నారు. నాట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంప్... ఉచిత వైద్య శిబిరాన్ని , ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రారంభిస్తారని మధు కొర్రపాటి తెలిపారు. సేవే గమ్యం అనే నినాదాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా మరో సారి చూపబోతున్నట్టు నాట్స్ ప్రెసిడెంట్ రవి అచంట అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని తెనాలి పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని పేద రోగులంతా సద్వియోగించుకోవాలని నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి ఓ ప్రకటనలో తెలిపారు.