|
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
23 March 2016
Hyderabad
చిన్నప్పటి నుంచి నాకు బాబాగారు అంటే మహాఇష్టం. 1986 నుంచి సాయిబాబా గుడిలో అతి చిన్న వయసు లోనే అర్చకత్వం స్వీకరించి బాబా సేవ లో నిమగ్న మైనాను. బాబా అంటే భక్తే కాదు... ఆయన చూపిన సేవా మార్గాన్ని కూడా ఆచరణలోకి తీసుకురావాలన్న ఆలోచన నాకు ఎల్లప్పుడూ ఉండేది. అయితే, నేను అనుకున్న విధంగా సేవ చేసే అవకాశం కోసం బాబాని ప్రార్ధించే వాణ్ణి. ఆ ప్రార్ధనల బలంతోనే , నా మనస్సులో ఉన్న ధర్మ సంకల్పాలతో నా స్నేహితులు, శ్రేయోభిలాషుల సహకారంతో 2014లో మహా శివరాత్రి నాడు సాయిదత్త పీఠాన్ని స్థాపించడం జరిగింది. మా సాయి దత్త పీఠానికి వాలంటీర్లు అందిస్తున్న సేవా సహకారాలే పీఠం ప్రజల మన్నలను, అభిమానాన్ని చూర గొనటానికి ముఖ్య కారణాలైనాయి.
భక్తి మరియు సేవా మార్గంలో భాగంగా నాలుగు సంకల్పాలతో ముందుకెళ్తున్నాము. నిత్య అన్నదానం, సత్సంగ్, చారిటీ, ఎడ్యుకేషన్ అనే నాలుగు సిద్హాంతాలతో సమాజానికి సేవచేస్తున్నాము . ఇందులో అతి ముఖ్యమైనది నిత్య అన్నదానం. సాయిదత్త పీఠానికి వచ్చి బాబాను దర్శించుకునే ప్రతి భక్తుడికి ప్రసాదం అందిస్తాము. ప్రసాదం అంటే రకరకాల పదార్ధాలు కాకుండా... కడుపు నిండేలా ఉదయం రోజుకో రకమైనఅల్పాహారం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భోజనంలా ప్రసాదాన్నిపెడతాము. అమెరికాలో ఉన్నవారికి అన్నదానం అవసరమా..! అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే, బాబాగారు సజీవంగా ఉన్న రోజుల్లో తన స్వహస్తాలతో భోజనం తయారు చేసి, వచ్చిన వారందరికీ వడ్డించే వారు. ఆ సమయంలో ధనిక, పేద బేధం లేకుండా అందరినీ సమానంగా చూసేవారు. ఆ సదుద్దేశాన్నే పాటిస్తూ అమెరికాలోనూ మా పీఠం లో నిత్య అన్నదానాన్ని నిర్వహిస్తున్నాము.
ఇక రెండోది సత్సంగ్. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. సాయిదత్త పీఠం ప్రారంభించినప్పటి నుంచి ప్రతి రోజు సామూహిక పూజలు , అభిషేకాలు ఏ రుసుమూ లేకుండా భక్తులు పాల్గొనేలా అవకాశాన్ని కల్పిస్తున్నాము. వివిధ దేవత మూర్తులకు సహస్రనామ పారాయణాలు, ప్రపంచశాంతి కోసం యజ్ఞాలు, హోమాలు నిర్వహిస్తున్నాము.
మూడోది చారిటీ. నిత్య అన్నదాన కార్యక్రమాలు పీఠం లో చేపడుతున్నాము. అయితే ఇది సాయిదత్త పీఠానికి వచ్చే వారికోసమే. మరి గుడికి రాలేని వారి కోసం ఎలా... ! అని ఆలోచించినప్పుడు ఓ ఆలోచన వచ్చింది. షెల్టర్లలో తలదాచుకునే ఇళ్లు లేని పేదవారికి ప్రతి ఆదివారం నాడు పండ్లు, పిజ్జాలు, ఇతర ఆహార పదార్ధాలు పంచిపెడుతున్నాము. ఆరు నెలలకోసారి రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విశాఖ లో హుద్ హుద్ వచ్చినప్పుడు విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపించాము. అంతటితో ఆగకుండా 15 ఆవులు, షెడ్ రేకులు కొని పేదవారికి పంచాము. చెన్నైలో వరదలు వచ్చిన సమయంలోనూ 5వేల డాలర్లు సేకరించి పంపాము.
నాలుగోది ఎడ్యుకేషన్. ప్రత్యేక హుండీలో వచ్చే డబ్బుతో అమెరికాలో చదువుకుంటూ మన సాంప్రదాయాలను పాటించే విద్యార్ధులకు స్కాలర్ షిప్ ఇవ్వాలనేది నాకున్న మరొక సంకల్పం. ఈ సంకల్పం కోసమే పీఠం లో ప్రత్యెక హుండీ ఏర్పాటు చేసాము. ఈ సిద్ధాంతాన్నే అన్నిదేవాలయాల్లోనూ వర్తింపజేసేలా చర్చలు జరుపుతున్నాము. అంటే ఒక ఏరియాలో చదువుకుంటున్న విద్యార్ధులకు అక్కడి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్థిక సాయం చేయాలనేది ప్రతిపాదన. అంతేకాదు, ఆర్థిక సహాయం పొందిన విద్యార్థి భవిష్యత్తులో ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే తాను కూడా మరొకరికి ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. 50 మంది విదార్దులతో సనాతన సాంప్రదాయ పద్ధతిలో సాయి దత్త గురుకులాన్ని నిర్వహిస్తున్నాము.
సాయి దత్త పీఠం లో అనూహ్యంగా వస్తున్న భక్తుల ఆదరణతో ప్రస్తుతమున్నమా పీఠాన్ని విస్తరింప చేయటం కోసం, ఫ్రాంక్లిన్ టౌన్ షిప్, న్యూ జెర్సీ లో 24.4 ఎకరాలలో విశాలమైన నూతన ఆలయం "షిర్డీ ఇన్ అమెరికా" కు శ్రీకారం చుట్టటం జరిగింది.ఈ స్థల సేకరణ కోసం అవసరమైన 1.3 మిలియన్ డాలర్లను స్థల సేవ అనే కార్యక్రమం ద్వారా సేకరిస్తున్నాము. బాబా గారి కోసం అనగానే 5వేల డాలర్లు, 10వేల డాలర్లు ఇచ్చే మనసున్న వాళ్లున్నారు. కాని, ఆ పద్దతిలో కాకుండా, ఇచ్చే స్తోమత, ఆసక్తి ఎంత ఉన్నా సరే.. ప్రతి ఒక్కరి నుంచి కేవలం 11 డాలర్లు మాత్రమే తీసుకుంటూ, 1,11,111 మంది భక్తులను ఆలయ స్థల సేకరణ లో భాగస్వామ్యులను చేయాలన్నలక్ష్యం తో ఒక్కకరినుంచీ 11 డాలర్ల విరాళాలు సేకరిస్తున్నాము. ఎంతో కష్టమైన ఈ సంకల్పం కోసం షిర్డీ లో పూజించిన బాబాగారి పాదుకలను సాయి రధం లో ఉంచి అమెరికా లోని అన్ని రాష్ట్రాలలో ఉన్న భక్తుల గృహాలలో పాదుకా పూజలు కొనసాగిస్తున్నాము. ప్రస్తుతం ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఈ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాము.
సాయి దత్త పీఠం ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా గత నాలుగు రోజులుగా జరుగుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా అఖండ అహోరాత్ర రుద్రపారాయణము, రుద్రహోమం, శివ పార్వతుల కల్యాణం, దీపోత్సవం, S.P బ్రదర్స్ తమ 11 మంది శిష్య బృందం తో ఆలాపించిన అద్భుత సాయి గానామృతం, సహస్ర కదళీఫల అర్చన , బాబా బాలక్ రామ్ భజన్స్ విశేష భక్తుల నడుమ నిర్విఘ్నం గా సాగాయి. స్మార్ట్ ఫోన్స్ కోసం ఉపేంద్ర చివుకుల చేతులమీదుగా సాయి దత్త పీఠం ఐ-ఫోన్, అన్ద్రొయ్డ్ ఆప్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం, LIVE బాబా (wax) చావడి లో SDP వాలంటీర్ రంగా గారి పర్యవేక్షణలో అమెరికా పరిస్థితులకు అనుగుణంగా ధుని ని ఏర్పాటు చెసాము. ఈ కార్యక్రమాలలో సహకారం అందించి విజయవంతం చేసిన నా SDP Family కి కృతజ్ఞతలు. ప్రతి భక్తుడు ఆ బాబా అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందాలని మనసారా ఆశిస్తున్నాను.
ఓం సాయి రామ్
|
|
|
|
|
|