To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
11 August 2015
Hyderabad
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో పీపుల్స్ మీడియా వారి సహకారంతో గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు సమర్పించిన ఈ-టీవీ పాడుతా తీయగా కార్యక్రమం లో అంతిమ పోరు ( గ్రాండ్ ఫినాలే ) ని ఆదివారం ఆగస్ట్ 9 తేదీన, ఇర్వింగ్, టెక్సాస్ లోని మెక్ ఆర్థర్ స్కూల్ లో నిర్వహించారు. చాలా ఏళ్ళుగా భారతదేశంలో విజయవంతంగా నిర్వహిస్తూ, ఎందరో ఔత్సాహికులైన కళాకారులను వెలికి తెచ్చిన ఘనత పాడుతా తీయగా కార్యక్రమానికి ఉంది. అలాగే అమెరికాలో తెలుగు సంగీత శిక్షణ పొందుతున్న ఉత్సాహవంతులైన బాల బాలికలను గుర్తించి మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో గత మూడేళ్ళుగా అమెరికాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి సిరీస్ 2013 లో డల్లాస్ లో జరిగిన నాట్స్ అమెరికా సంబరాలు లో కన్నుల పండుగ గా జరుపుకొన్నారు. ఈ సంవత్సరం కూడా నాట్స్ ఆధ్వ్యర్యంలో పీపుల్స్ మీడియా సహకారమతో డల్లాస్ లోనే జరగటం విశేషం.
ముందుగా అభ్యర్ధులు పంపిన ఆడియో , వీడియో క్లిప్పింగ్స్ పరిశీలించి బాలు గారు 17 మందిని పోటీకి అర్హులుగా ఎంపిక చేసారు . మొదటి విడత పోటీలు అమెరికాలోని వివిధ నగరాలలో జరగగా , చివరకు 5 గురిని శనివారం జరిగిన ఫైనల్స్ కు ఎంపిక చేసారు. అత్యంత ఉత్సాహంగా సాగిన పోటీలో చివరకు నలుగురిని ఎంపిక చేసి ఆదివారం జరిగిన అంతిమ పోరుకు అర్హులుగా నిర్ణయించారు
ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా బాలు గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్, ప్రసిద్ధ గాయకుడు మనో వ్యవహరించారు. కార్యక్రమ ప్రారంభంలో లో డా .బిందు కొల్లి గారు బాలు గారిని వేదిక పైకి ఆహ్వానించారు. తదుపరి బాలు గారు కార్యక్రమ స్పాన్సర్స్ ను పరిచయం చేసి పోటీని ఆరంభించారు. ఈ అంతిమ పోరును సాంప్రదాయ గీతాలు, సినీ గీతాలు, శాస్త్రీయ సంగీతం ఉన్న సినీ గీతాలు అనే విభాగాలలో నిర్వహించారు.
పోటీలో పాల్గొన్న బాల బాలికలు సంక్లిష్టమైన, సంస్కృత పదాలతో కూడిన పాత చిత్రాలలోని గీతాలను అత్యద్భుతంగా పాడి 'వారెవా' అనిపించారు. అమెరికాలో ఉంటూ తెలుగు నేర్చుకోవటమే గాక , శాస్త్రీయ సంగీతభరితమైన పాటలను అలవోకగా పాడి వినిపించినందుకు, బాలు గారు, మనో గారు, పట్నాయక్ గారు పిల్లలను అభినందించారు. పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విజేతలకు యుప్ టీవీ వారి తరపున వరుసగా 10,000, 5,000, 2,500 డాలర్లు నగదు బహుమతి , జ్ఞాపిక, సర్టిఫికెట్లు అందచేసారు .
తమ తుది ప్రసంగంలో బాలు గారు ఈ టీవీ పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికాలో సమర్పిస్తున్న పీపుల్స్ మీడియా వారిని, నిర్వహించిన నాట్స్ వాలంటీర్లను, పోషక దాతలను పేరు పేరునా అభినందించారు.
నాట్స్ సభ్యులు కోనేరు శ్రీనివాస్, నాట్స్ ఆవిర్భావం గురించి, హెల్ప్ లైన్ గురించి వివరించి, కార్యక్రమం విజయవంతం చేయడానికి తోడ్పడిన అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ బృంద సభ్యులు వెలమూరి విజయ్, కోగంటి రామకృష్ణ, కొల్లి వెంకట్, కొల్లి బిందు, వెంకట్ కొడాలి , ఉమా అట్లూరి , అన్నే అమర్, అన్నే శేఖర్, నూతి బాపు, గోవాడ అజయ్, మాదాల రాజేంద్ర, కావూరి శ్రీనివాస్, మర్నేని రామకృష్ణ, నిమ్మగడ్డ రామకృష్ణ, ధూలిపాళ్ల సురేంద్ర, కంచర్ల చైతన్య, వీరగంధం కిశోర్, వీణా యలమంచిలి కార్యక్రమం దిగ్విజయం కావడానికి విశేషం గా కృషి చేసారు.