To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
19 April 2015
Hyderabad
అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రం, ఫీనిక్స్ ప్రాంతంలో సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవాలు గత శనివారం, ఏప్రిల్ 11వ తేదీన, ఫీనిక్స్ జెఫెర్సన్ ప్రిపరేటరీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఇక్కడ మనబడి మొదలుపెట్టిన మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ ఉత్సవం నిర్వహించి విజయవంతంగా జరుపుకోవటం గమనార్హం.
ముందుగా విద్యార్థుల శోభాయాత్ర, భాషా జ్యోతి, మఱియు వేద ప్రవచనాలతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు . ఫీనిక్స్ లో ప్రముఖ వైద్యులు డా. సుజాత గున్నాల దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన అనంతరం మనబడి చేస్తున్న అద్భుత కార్యక్రమాలను, తెలుగు బాషా సేవను కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనబడి విశ్వవ్యాప్త అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షులు శరత్ వేట, అమెరికాలోని తెలుగు పిల్లలందరకీ మాతృభాషని బోధించడానికి అవకాశం ఇస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అమెరికాలో మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట, బాలానందం, తెలుగుకు పరుగు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పరీక్షలు తదితర కార్యక్రమాల వివరాలు తెలిపారు. మనబడి ఫీనిక్స్ ప్రాంతం సమన్వయకర్త బాలాజీ వల్లభాపురపు మన మాతృభాషని ముందుతరాలకి అందిచాల్సిన బాధ్యతను మనబడి పోషిస్తున్న పాత్రని, మనబడి విద్యా క్రమములను వివరించారు.
ఈ కార్యక్రమంలో కేవలం బాలబడి మరియు ప్రవేశం తరగతి చదువుతున్న విద్యార్థులు విదేశాలలో ఉంటున్నప్పటికీ తెలుగు భాష పై ఉన్న ఉత్సుకత, సంస్కృతి పై అవగాహన చక్కగా ప్రదర్శించారు . తెలుగు సాంప్రదాయ, గాన, నృత్య, నాట్య, వాచకం లో ఉన్న మక్కువను చాటారు, చిట్టి పొట్టి గీతాలు, దేశ భక్తి, తెలుగు తల్లి గేయాలు అవలీలగా పాడారు. వివిధ నాటికలు ,నృత్య రూపకాలు ప్రదర్శించారు సుమతి శతక పద్యాలు చక్కగా ఆలపించారు. బాలబడి చిన్నారులు మనబడి గీతం ఆలపించి అందరిని ఆకట్టుకొన్నారు. విద్యార్థులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి అందరినీ అలరించారు. ఫీనిక్స్ ప్రాంత మనబడి సమన్వయ కర్తలు మాధవి పోలిశెట్టి, విద్య కంకిపాటి, రవి ఎర్రమిల్లి , బాలాజీ వల్లభాపురపు మరియు కార్యక్రమ సంధాన సమన్వయ కర్తలు అనుపమ దుగ్గిరాల, అనంత్ కలగర్ల లు ఈ ఉత్సవ విజయానికి అహర్నిశలూ శ్రమించారు.
ఈ ఉత్సవాన్ని శోభాయమానంగా జరుపుకోవటానికి సిలికానాంధ్ర మనబడి ఆర్ధిక విభాగ ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల, మనబడి సాంస్కృతికోత్సవ కేంద్రకార్యవర్గ సభ్యులు, స్నేహ వేదుల, మాధవి కడియాల, జయంతి కొట్ని, జవహర్ కంభంపాటి గార్లు, వివిధ మనబడి కేంద్రాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు ఎందరో భాషాభిమానులు సహకరించారు. చివరగా వందన సమర్పణ అనంతరం అందరికీ పసందైన విందు వడ్డించారు.