pizza
P.Susheela Concert by Kala Vahini
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

26 October 2013
Hyderabad

ప్రేక్షకులను అలరించిన పి.సుశీల "ఇది మల్లెల వేళయనీ!"

కళావాహిని మరియు సుస్వర అకాడమి వారు సంయుక్తముగ సమర్పించిన "ఇది మల్లెలవేళయనీ" కార్యక్రమము, ఆదివారము అక్టోబరు 20వ తేదిన అర్వింగ్ లోని "జాక్ సింగ్లీ ఆడిటోరియము" లో వైభవముగా జరిగింది. గానకోకిల పద్మభూషణ్ డా. పి.సుశీల ముఖ్య అతిథిగా విచ్చేసి తమ మధుర గాత్రముతో సభని రంజింపచేశారు. స్థానిక గాయనీగాయకులు కూడా ఏ మాత్రము తీసిపోకుండా ఆపాతమధురాలను ఆలపించి ప్రేక్షకులను విశేషముగా అలరించారు. పాటలు పాడే ముందు ప్రతీ పాట లోతును మర్మాలను వివరిస్తూ డా. జువ్వాడి రమణ ప్రేక్షకుల మన్ననలు పొందారు.  

ముందుగ యలమంచిలి వీణ, కృష్ణశాస్త్రి కలమునుంచి జాలువారిన "ఇది మల్లెలవేళయనీ" గేయాన్ని ఆలపించి శరద్రుతువులో మల్లెలు విరజిమ్మారు. "స్వరములు ఏడైనా రాగాలెన్నో" అని సి.నా.రె ప్రవచించిన అందమైన పాటని ఆదూరి సృజన మరింత అందముగా ఆలాపించి అందరిని అలరించారు. “ఈ రేయి తీయనిది, ఇంతకు మించి ఇంకేమున్నది" అని ప్రేక్షకులకు అలనాటి ఆ తీపి ముచ్చట్లు గుర్తు కొచ్చేట్లు కడిమిశెట్టి పూజిత, నారాని రమేశ్ లు మధురముగ యుగళగీతాన్ని పాడి వినిపించారు."పాలకడలిలో శేషతల్పమున పవళించేవా దేవా" అని అందరు భక్తి భావములో మునిగిపోయేలా పెనుమర్తి జయ పాడారు. దాశరథి కలమునుంచి వెలువడిన అందమైన పాట, “మదిలో వీణలు మో్రగె" సాహితి పైడిపల్లి గొంతులో మరింత అందముగా ఒదిగిపోయింది. తరువాత శ్రీశ్రీ ప్రేమగీతం “ఆకాశ వీధిలో అందాల జాబిలి" ని మద్దుకూరి చంద్రహాస్, సాధు జ్యోతి చక్కగా ఆలపించి వెన్నెల కురిపించారు. తరువాత "మనసే అందాల బృందావనము" అనే పాటని సృజన, “ఓ జాబిలి వెన్నెలా ఆకాశము ఉన్నదే నీ కోసము" అనే పాటని పూజిత, “నీవు రావు నిదుర రాదు" అనే పాటని సాధు జ్యొతి , “ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియకానుక" అనే పాటని ఇయ్యున్ని శ్రీనివాస్ పెనుమర్తి జయ, “ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా" అనే పాటను సాహితి పాడి ప్రేక్షకులకు వీనులవిందు కలిగించారు. "అభినందన మందారమాల" అనే పాటని తూపురాని రవి, సృజన మధురముగా పాడుతూ ఉండగా ప్రేక్షకుల కరతాళధ్వనుల నడుమ శ్రీమతి సుశీల సభాప్రాంగణములోకి అడుగు పెట్టారు.

సుస్వర అకాడమిలో శిక్షణ పొందిన బాలబాలికల చిట్టిచిట్టి గొంతులనుంచి జాలువారిన తేనెచినుకుల అందరిని ఆకట్టుకున్నాయి. పిమ్మట రాయవరము భాస్కర్ గంధర్వగాయని సుశీల వైశిష్ట్యాన్ని వివరిస్తూ వేదికమీదకు ఆహ్వానించారు. సుశీలను సన్నుతిస్తూ రాసిన స్వీయగేయాన్ని మద్దుకూరి చంద్రహాస్, జ్యోతి సాధు తో కలిసి పాడి అందరిని ఆనందపరిచారు. ఇంతమంది అభిమానులను పొందటము, ఎన్నో పాటలతో వారిన ఇన్ని సంవత్సరాలుగా అలరించగలగటము తనకు ఆ భగవంతుడిచ్చిన వరము అని సుశీల విన్నవించారు. ఇటీవల ఆపరేషను జరిగి కోలుకుంటున్న ఎ.ఎన్.ఆర్ గారితోనూ, అన్నపూర్ణ సంస్థతోనూ తనకు ఉన్న సంబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఘంటసాల, లీల లాంటి గాయకులను, పెండ్యాల, సాలూరి లాంటి సంగీత దర్శకులను, జమున, ఎన్.టి.ఆర్ లాంటి నటులను వారితో తనకున్న అనుభవాలను ఎంతో ఉల్లాసభరితముగా సభికులకు వినిపించారు.

అనిపిండి మీనాక్షి గొంతుకలపగా, “నీవుండేదాకొండపై నా స్వామి", “జోరుమీదున్నావు తుమ్మెద", “మీర జాలగలడా నాయానతి" లాంటి ఎన్నో అజరామరమైన గీతాల పల్లవులను పాడి ప్రేక్షకులను పరవశింపచేసారు. “ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై", "గోదారి గట్టుంది గట్టుమీద చెట్టుంది”, "చిటపట చినుకులు పడుతూ ఉంటే" లాంటి పాటలు ఆలపించి - ఆ పాటలన్నీ నేనేనా పాడింది అని అమాయకముగా ప్రశ్నించారు. ఆంధ్ర దేశములో ఎందరో తల్లుల వొడిలో ఆ బాలరాముడే నిదురించేట్లు చేసిన ఆ అజరామర గేయము "వటపత్రశాయికి వరహాలలాలి", తో తమపాటల కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమానికి ముఖ్య దాతలుగా ఉన్న డా. మద్దుకూరి నీలిమ ఆ కళామూర్తిని సత్కరించారు. తానా, ఆటా, నాటా, నాట్సు, టాంటెక్స , సిలికానాంధ్ర, ఆలాపన, లిటిల్ మ్యుజిసియన్స్ తదితర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సుశీలను సన్మానించారు. చివరగా మల్లవరపు అనంత్ ఈ కార్యక్రమానికి విశేషంగా సహాయ సహకారాలందించిన కాజ సురేష్, నసీమ్ షేక్, ఎర్రబెల్లి రజనీకాంత్, బొడ్డు శేషా రావు, చలసాని శ్రీనివాస్, అశ్విన్ కౌత , తూపురాని రవి, దీప్తి రెడ్డి, అమిత్ డిగ్గికర్, శారద సింగిరెడ్డి , శ్రీలు మండిగ లకు కృతజ్ఞతలు తెలియ జేశారు. .


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved