
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
05 May 2015
Hyderabad
తెలుగు ను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చాలని పరితపిస్తూ, మాతృభాషను భవిష్యత్తు తరాలకి అందించడం కోసం కల్పించే ప్రాచుర్యం లో భాగంగా, ప్రవాసం లోని తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించే సిలికానాంధ్ర మనబడి మరో విశిష్ట ప్రాచుర్య కార్యక్రమం ద్వారా తెలుగు భాషాప్రేమికులను అలరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే 'గోల్డెన్ గేట్ రిలే ' పరుగు పందెం లో, భట్టారం నాగరాజు గారి నాయకత్వంలో శ్రీనివాస్ పిట్టా,పుట్టప్పయ్య మునియం ,భూమయ్య,గణేష్,గోపాల్,గాంధి ఆలపాటి,రాజు చమర్తి,దీనబాబు కొండుభట్ల,సత్య,సతీష్ మాసరపు,వీరభద్రరావు గుండు లు పరుగెత్తే బృందం లో సభ్యులుగా, అనిల్ అన్నం ,మాథుర్,కృష్ణ కొత్తపల్లి లు స్వచ్చంద సైనికులు గా ఏర్పాటయిన 15 మంది సభ్యుల బృందం, కలిస్తోగా నగరం నుంచి శాంతాక్రూజ్ నగరం వరకు గల 191 మైళ్ళు దూరాన్ని, కొండలు గుట్టలు,అడవులు,ఎండ,చలి,రాత్రిళ్ళు లెక్కచేయకుండా ౩౩ గంటలు నిర్విరామంగా పరిగెత్తి లక్ష్యాన్ని అధిగమించింది.పందెం లో పాల్గొనే బృందాన్ని అనుసరించే వాహనాలను, ‘మనబడి’, ‘తెలుగుకు పరుగు’ అనే తోరణాలతో అలంకరించటం అచ్చం తెలుగు వారినే కాకుండా , అమెరికన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.దారి పడుగునా ఎంతోమంది తెలుగు వారు ముందుకి వచ్చి,పరుగెత్తే సభ్యులకు హర్షాతిరేకాలతో వారి సంఘీభావం తెలియచేశారు.తెలుగు భాషను బ్రతకించుకోవటం సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ముఖ్యంగా మనబడి కార్యక్రమం ద్వారా అమెరికా మరియు ఇతర దేశాలలో పిల్లలకు తెలుగు నేర్పటానికి పడుతున్న శ్రమని అభినందించారు.
మనబడి ఆర్ధిక శాఖ ఉపాద్యక్ష్యులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ, ఇప్పటికే మనబడి ద్వారా పిల్లలకు తెలుగు బోధనే కాకుండా బాలానందం, సాంస్కృతికోత్సవాలు, తెలుగు మాట్లాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలలో స్ఫూర్తి నింపుతున్నామని. ఈ తెలుగుకు పరుగు కార్యక్రమం ద్వారా మనబడి కార్యకలాపాలు మరింతమంది కి చేరువవుతాయని భావిస్తున్నామని వచ్చే విద్యాసంవత్సరానికి 6000 మంది విద్యార్ధులకు తెలుగు నేర్పించే లక్ష్యంగా మనబడి బృందం పనిచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ భాషా సేవయే భావి తరాల సేవ అన్న స్ఫూర్తితో తెలుగు భాషకు ప్రపంచ వేదికపై పట్టం కట్టే బాధ్యతను మోస్తున్నందుకు ఆనందంగా ఉందని ,20 మంది తో ప్రారంభమైన మనబడి ఇప్పుడు 4100 మందికి పైగా విద్యార్ధులతో 400 మందికి పైగా భాషా సైనికుల బోధనలో యూరోప్,ఆస్ట్రేలియా, ఉక్రైన్,కువైట్,స్కాట్లాండ్,హంగ్ కాంగ్,సౌత్ ఆఫ్రికా వంటి ఎన్నో దేశాలకు విస్తరించిందని, వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరానికి ప్రవేశములు జరుగుతున్నవని,ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.





