To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
29 October 2015
Hyderabad
విన్నూత్నంగా 15వ సిలికానానాంధ్ర సాంస్కృతికోత్సవం
సిలికాన్ వ్యాలీలోని శాబో కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఆంధ్ర సాంస్కృతికోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. పద్నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగిడిన సిలికానాంధ్ర ఈ ఏటి సాంస్కృతికోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. వేయి మందికి పైగా విచ్చేసిన ప్రేక్షకులతో సభాస్థలి కిటకిటలాడగా ఎనిమిది గంటలపాటు కార్యక్రమం సాగింది.
కార్యదర్శి ప్రభ మాలెంపాటి సంధానకర్తగా 'మనిషి-ప్రకృతి ' మధ్య గల అవినాభావ సంబంధాన్ని వేదకాలం నుండి ఆధునిక కవుల వకు ఎలా వర్ణించారో చెప్పిన 'త్వమేవాహం' అంశంలో వంద మంది చిన్నారులు రాగయుక్తంగా, లయబద్ధంగా ఆధునిక గీతాలను ఆలపించారు. నలుగురు పిల్లలు పురోహితునితో కలిసి వేదాల్ని చదివారు. 'కళాకృష్ణ ' గారి ఆధ్వర్యంలో, సమిధ సత్యం సంధానకర్తగా జరిగిన 'ఆంధ్ర నాట్యం' లో బే ఏరియాలోని ప్రఖ్యాత నాట్య గురువులు వారి శిష్యబృందంతో పాల్గొని కన్నుల పండుగగా నాట్యం జరిపారు. కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి పల్లె రఘునాథరెడ్డి గారు 'ఆత్మీయ అతిధి 'గా విచ్చేసి కళాకృష్ణను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సాహిత్యానికి, కళలకు చేస్తున్న ప్రణాళికలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదనానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషిని అభినందించారు. హైద్రాబాదులోని త్యాగరాయ గానసభ నిర్వాహకులు, ప్రస్తుతం అమెరికాను సందర్శిస్తున్న కళా దీక్షితులు 'యువత-నవత ' ప్రధానాంశంగా కాశీవఝుల శారద, ఉపాధ్యక్షుడు తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకత్వంలో వెలువడిన సిలికానాంధ్ర సుజనరంజని ప్రత్యేక సంచికను విడుదల చేసారు.
స్నేహ వేదుల, సత్యప్రియ తనుగుల నేతృత్వంలో గత పదునాలుగు ఆంధ్ర సాంస్కృతికోత్సవాలలో జరిపిన బోనాలు, బతుకమ్మ, బాలనాగమ్మ నాటకం, మరుగుజ్జుల నాట్యం లాంటి కొన్ని ముఖ్యాంశాలను 'నివాళి ' పేరిట తిరిగి ప్రదర్శించారు. ఈ అంశం చివరగా ప్రస్తుత మరియు గత సిలికాంధ్ర కార్యవర్గ సభ్యులు వేదికను అలంకరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు సంజీవ్ తనుగుల మాట్లాడుతూ పదిమంది మదిలో మెలిసిన భావంతో మొదలై పాత కార్యవర్గ కృషితో ప్రపంచవ్యాప్తమైన సిలికానాంధ్ర సంస్థ నేటి యువతరాన్ని సాంస్కృతిక సైనికులుగా తీర్చిదిద్దాలన్నదే తమ కార్యవర్గ లక్ష్యమని అన్నారు. కోశాధికారి రవీంద్ర కూచిభొట్ల సారథ్యంలో, సపంతిక, సమీర్ మాండలిక సంగీత నిర్దేశంలో, అంతా పాతికేళ్లలోపు యువతీయువకులు రూపొందించిన పాతకొత్త సంగీతాలను మేళవించిన 'స్వరం-నవతరం' సంగీత కార్యక్రమం వీనులవిందుగా సాగింది.
ప్రఖ్యాత మూకాభినయ కళాకారుడు 'మైం మధు ' శిక్షణలో సిలికానాంధ్ర పిల్లలు ప్రదర్శించిన మూకాభినయం ప్రేక్షకుల మన్నలను చూరగొంది. ఆడిటోరియం అంతా లైట్లార్పేసి చిమ్మచీకటిలో, ఫ్లోరసెంట్ కాంతుల దుస్తులతో మానసారావు దర్శకత్వం వహించిన 'వినయకోత్పత్తి ' పేరుతో జరిపిన 'కాంతినృత్యం ' ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తిందింది. చివరగా దిలీప్ కొందిపర్తి కీచకునిగా నటించి, దర్శకత్వం వహించిన 'విరాటపర్వం' పౌరాణిక నాటకం అందరి ఆదరాభిమానాలు పొందింది. తగిన ఆహార్యంతో, భారీ సెట్టింగులతో, ఉత్తరగోగ్రహణ యుద్ధంలో నిజమైన ఆశ్వరథాన్ని వేదికపై నిలిపి ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో కట్టిపడేసారు.
ఆద్యంతం సన్నివేశాలకు సరితూగే తెరలను ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించటానికి బైట్ గ్రాఫ్ సంస్థతో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత సిలికానాంధ్ర విశ్వవిద్యాలం కోశాధికారి కొండుభట్ల దీనబాబు శ్రమించారు. సిద్ధార్థ నూకల, వంశీ ఇందవరపు రథసారథులుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంయుక్త కార్యదర్శి కిశోర్ బొడ్డు స్థానిక రెస్టారెంట్ల సహాయంతో విరామ సమయంలో బోజనాలను అందించారు. ఎనిమిది గంటలపాటు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ఉత్సవంలో 300 మంది కళాకారులు పాల్గొనగా, వంశీ నాదెళ్ళ, రవి చివుకుల, అనిల్ అన్నం, నిరుపమ చెబియం, శిరీష కాలేరు, భువనేశ్వరి సీరం రెడ్డి, శ్రీసుధ తగు రీతిలో సహకారం అందించారు.