To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
10 December 2014
Hyderabad
ప్రవాస భారతీయ బాలలకు తెలుగు నేర్పే సిలికానాంధ్ర మనబడి కార్యవర్గ స్థాయి సమావేశం డల్లాస్ లో జరిగింది. గత 8 సంవత్సరాలుగా అమెరికా లోని నలభై రాష్ట్రాలతో పాటు యూకే, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్, కువైట్, సౌత్ కొరియా, హాంగ్ కాంగ్ వంటి పలు దేశాలలో పిల్లలకు చక్కగా తెలుగు వ్రాయడం, చదవడం, మాట్లాడడం ,పద్య పఠనం నేర్పిస్తున్న సిలికానాంధ్ర మనబడి ఈ విద్యా సంవత్సరం లో 4000 మంది విద్యార్ధులను చేర్పించే మైలు రాయిని అధిగమించిన సందర్భంగా ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకొన్నది . ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులై దాదాపు 400 మంది విద్యార్ధులు పట్టాలు అందుకోవటమే కాకుండా కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో మనబడి తెలుగు బోధన కు విదేశీ భాష హోదా లభించడం దృష్ట్యా రానున్న కాలంలో మరిన్ని రాష్ట్రాలలో ఈ హోదా లభించడానికి చేయవలసిన కృషి గురించి సమావేశంలో చర్చించినట్లు మనబడి అద్యక్షులు రాజు చమర్తి తెలిపారు.
మనబడి లో తెలుగు భాష బోధించడమే కాకుండా, మనబడి సాంస్కృతిక కార్యక్రమాల పేరిట జరిపే కార్యక్రమాల ద్వారా మన సంస్కృతీ, సంప్రదాయాల పట్ల పిల్లలకు అవగాహన కలిగించే విధం గా ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఈ సంవత్సరం జనవరి 25 నుంచి కాలిఫోర్నియా లోని సన్నివేల్ లో ప్రారంభమయ్యే సాంస్కృతికోత్సవాలు దాదాపు 15 రాష్ట్రాలలోని మనబడి ప్రదేశాలలో, వివిధ వారాంతాలలో నిర్వహించబడతాయని మనబడి ఆర్ధిక వ్యవహారాల అధికారి దీనబాబు కొండుభట్ల తెలిపారు. తెలుగు మాట్లాట జాతీయ పోటీల ద్వారా పిల్లలకు భాషా పాటవ పోటీలు, భాషా జ్యోతి, తెలుగు కు పరుగు , బాల రంజని (పిల్లల పత్రిక), బాలానందం (మనబడి విద్యార్ధులు నిర్వహించే రేడియో కార్యక్రమం) వంటి కార్యక్రమాల ద్వారా చేస్తున్న, చేయవలసిన కార్యక్రమాల గురించి మేధో మదనం చేసి రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు మనబడి అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షులు శరత్ వేట తెలిపారు.మనబడి ప్రాచుర్య విభాగం ఉపాధ్యక్షులు భాస్కర్ రాయవరం నాయకత్వం లో స్థానిక అంజప్పార్ చెట్టినాద్ రెస్టారెంట్ లో శనివారం సాయంత్రం జరిగిన ముఖాముకి సమావేశంలో, దాదాపు 100 మంది డల్లాస్ ప్రాంత మనబడి భాష సైనికుల ప్రశ్నలు మరియు సందేహాలను మనబడి నాయకత్వం నివృత్తి చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను వివరించడం జరిగింది .
మనబడి తల్లితండ్రుల సూచనలను పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో పాట్య ప్రణాళిక లో చేయాల్సిన మార్పులు గురుంచి ప్రణాళిక విభాగ ఉపాధ్యక్షురాలు శాంతి కూచిభొట్ల వివరించారు. రెండు రోజులు జరిగిన ఈ కార్య వర్గ సమావేశాన్ని ఉపాధ్యక్షులు ధనుంజయ్ తోటపల్లి సమర్ధవంతంగా నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరాని సిలికానాంధ్ర మనబడి ప్రాథమ్యాలను ఖరారు చేసారు. టెక్సాస్ లోని ఇర్వింగ్ మనబడి కేంద్రంలోని ఉపాధ్యాయులను,విద్యార్ధులను , కేంద్ర సమన్వయకర్త నాగ్ ఎనగండ్ల గారు మనబడి నాయకత్వానికి పరిచయం చేసి ఆ కేంద్రం లో జరుగుతున్న విద్యా బోధన తీరు తెన్నులను వివరించారు. ఈ సంవత్సరం అందుకున్న విజయాల స్ఫూర్తితో మనబడి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళాలని సమావేశం తీర్మానించింది.