To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
02 September 2015
Hyderabad
టాంటెక్స్ వేదికపై ‘స్వరాభిషేకం’: డాలస్ లొ 3500 మంది తెలుగు వారి అపూర్వ సంగమం
శనివారం, ఆగష్టు 29, 2015 ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతిష్టాత్మకంగా చేపట్టి తెలుగు కళామతల్లికి "స్వరాభిషేకం" మహాయఙ్ఞాన్ని ఆలెన్ ఈవెంట్ సెంటర్ లో దిగ్విజయంగా నిర్వహించింది. డాలస్ లో ఒక తెలుగు సంగీత విభావరి ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే ప్రప్రథమం. డాలస్ పరిసర ప్రాంతాలనుండి సంగీతాభిమానులు అధిక సంఖ్యలో ఈ సంగీత విభావరికి విచ్చేసి, జయప్రదం చేసారు.
టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సమన్వయకర్తగా ఈ కార్యక్రమం "నభూతో నభవిష్యతి" అన్నట్లు జరిగింగి. కార్యదర్శి ఆదిభట్ల మహేష్ ఆదిత్య విచ్చేసిన సంగీత ప్రియులను స్వాగతిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త వనం జ్యోతి కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులను పరిచయం చేసి, పోషక దాతలను బాలు గారి చేతులమీదుగా అభినందనల పుష్పగుచ్చాలను అందుకోవలసిందిగా అహ్వానించారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యం లో సగౌరవ సమర్పణ ఈ వినూత్న సంగీత విభావరి. ఈ టీవీ ద్వారా భారతదేశం లో నాలుగు లేదా అయిదు భాగాలుగా ప్రసారంకానున్న ఈ కార్యక్రమం లో శ్రీ ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యంతో పాటు ప్రముఖ నేపథ్య గాయనీ గాయకులు మనో, సునీత, ఎస్. పి. చరణ్, గీతామాధురి, మాళవిక, శ్రావణ భార్గవి, హేమచంద్ర, శ్రుతి, హారిక, కార్తిక్, ప్రవీణ్ తదితరులు పాల్గొని ఆహూతులను స్వర ఝరిలో ముంచెత్తారు. పాత కొత్తల మేళవింపుగా పాటల ఎంపిక ఆనాటి 'ఉండమ్మా బొట్టు పెడతా ' సినిమా లో సున్నిత భావాలను రమ్యంగా చెప్పిన 'చుక్కలతో చెప్పాలని ఉంది" లాంటి పాటలనుండి, ఈనాటి గబ్బర్ సింగ్ సినిమా నుండి "గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా" వరకూ ఉండి, విభావరి ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హేమచంద్ర పాడిన "రసికరాజ తగువారముగామా", బాలు గారు ఆలపించిన "చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో" కార్యక్రమం లో కొసమెరుపుగా నిలిచాయి.
అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, డాలస్ చరిత్ర లో 3500 మంది పైగా తెలుగువారితో అన్ని జాతీయ మరియు స్థానిక అనుబంధ సంస్థలతో కలిసి ఇంత మహత్తర కార్యక్రమాన్ని టాంటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేయడం, తాను ఈసంవత్సరానికిగాను ఎన్నుకున్న పది సూత్రాలలో ఒకటైన "సంస్థ పరిధిలో ఉన్న తెలుగు వారి మధ్య సఖ్యత పెంచడం" అనే సంకల్పం ఇలా కార్యరూపంలో కళ్ళముందు కనిపిస్తుంటే మహదానందంగా ఉందన్నారు. ఇంతటి భారీ కార్యక్రమం విజయవంతం కావాలంటే పోషకదాతలు, స్వచ్చంద సేవకులు ఎంత ముఖ్యమో, ప్రేక్షకులుగా మీ అందరి ఆదరణా అంతే అవసరం అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.
మధురంగా పాడటమే కాకుండా, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గాయని సునీత మాట్లాడుతూ, ఇంత పెద్ద సభాప్రాంగణం నిండుగా కళకళ లాడుతూ ఉండటమే కాకుండా, దాదాపు నాలుగు వేలమంది తెలుగువారు అన్ని వయసులవారూ ఉండటం మనసుకు ఎంతో ఆనందాన్నిస్తూంది అన్నారు.
ఈ-టివి తరపున టాంటెక్స్ అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి ని సన్మానిస్తూ బాలు గారు ఇంతటి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించినందుకు, ముఖ్యంగా విమానం దిగినప్పటినుండి ఇప్పటివరకూ వసతి సదుపాయాలూ, సౌకర్యాలు, వేళకు వేడి వేడి టీ - కాఫీలు, కమ్మని భోజనం ఏ లోటూ రాకుండా ఎంతో చక్కగా ఏర్పాటు చేసినందుకు గాయనీ గాయకుల తరపున, అలాగే ఈ-టివి బృందం తరపున అభినందించారు. "నేను ఒక చిన్న విద్యార్థిని మాత్రమే, నేనూ ఈ బృందం లో ఒక గాయకుడిని మాత్రమే", "నేను విశ్వ మానవుడిని, మీ గుండె నా ఇల్లు" అని బాలు గారు తన ఔన్నత్యాన్ని మరొక్కమారు ప్రదర్శించారు.
గాయనీ గాయకులు, పోషకదాతల గౌరవార్ధం ముందు రోజు టాంటెక్స్ వారు ఏర్పాటు చేసిన విందులో పోషకదాతలు ప్రతి ఒక్కరిని పేరు పేరునా గుర్తించి, బాలు గారి చేతులమీదుగా ఙ్ఞాపికలు అందజేసి వారి వదాన్యతను కొనియాడారు. డైమండ్, ప్రీమియర్, ప్రెజెంటింగ్ మరియు ఈవెంట్ స్పాన్సర్ విభాగాలుగా మొత్తం డెబ్బయి మంది పోషకదాతలు మరియు వందకు పైగా స్వచ్చంద సేవకులు పాల్గొన్న ఈ విందులో, టాంటెక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న 'స్వరమంజరి ' పాటల పోటీ లో పాల్గొంటున్న ఔత్సాహికులైన గాయనీ గాయకులకు, చిన్నారులకోసం టాంటెక్స్ నిర్వహించిన 'వసంత గాన సౌరభం ' లో పాల్గొన్న చిన్నారులకు, అలాగే డాలస్ నుండి ఈ-టివి వారి పాడుతా తీయగా లో పాల్గొన్న పిల్లలకూ ఆ గానగంధర్వుడి సమక్షంలో పాడే అవకాశం దక్కింది.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు సంయుక్తంగా గాయనీ గాయకులను సన్మానించారు. వందన సమర్పణ చేస్తూ కార్యవర్గ సభ్యులు గజ్జెల రఘు మాట్లాడుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సంగీత ప్రియులకు, పోషకదాతలకు, స్వచ్చంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన యువ రేడియో, టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.