To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
10 April 2017
USA
కాన్సాస్ సిటీ నగర ప్రాంతంలో నివసించే తెలుగు వారందరూ ఏప్రిల్ 1వ తారీఖున కాన్సాస్ నగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో హేవిళంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలు ఘనంగా, సాంప్రదాయ బధ్ధంగా జరిగాయి. మొత్తం వేడుకలలో అచ్చ తెలుగుతనం కొట్టొచినట్టు కనపడింది. సాంప్రదాయ బద్దమైన వేదిక అలంకరణలు, ఉగాది పచ్చడి, పిల్లలు, పెద్దల హడావిడి, పసందైన విందుతో కార్యక్రమం పండుగలా సాగింది. పురాణ శ్రవణం, ప్రార్థనా గీతాలతో ప్రారంభమైన వేడుకలు ఉత్సాహవంతమైన వాతవరణంలో, పాటలు, ఆటలు, నాటకాలు, కూచిపూడి,భరత నాట్య ప్రదర్సనలతో కూడిన మంచి కార్యక్రమాలతో 3 గంటలపాటు అందరికీ ఆనందాన్ని పంచాయి.
సంఘం అధ్యక్షురాలు శ్రీమతి దుర్గ తేళ్ళ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు అందచేసి, ఈ సంవత్సర కార్యవర్గాన్ని, బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ను పరిచయం చేసారు. గత సంవత్సర అధ్యక్షులు శ్రీకాంత్ రావికంటిని, బోర్ద్ చైర్మన్ అజయ్ కాసరబాద ను మెమెంటొలతో సత్కరించారు.
ఈ మధ్య జరిగిన జాతి వివక్ష సంబంధిత కాల్పుల నేపధ్యంలో, ఈ సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్టేట్ సెనేటర్ రాబర్ట్ ఓల్సన్ మరియు ఎఫ్ బి ఐ స్పెషల్ ఏజెంట్ హీథ్ యాంకి హాజరై సభ్యులకు విలువైన సమాచారాన్ని మరియు తమ పూర్తి మద్దతును ప్రకటించారు.