To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
28 January 2015
Hyderabad
డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రతి నెల నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 102 వ సదస్సు జనవరి 24, ఆదివారం, డాలస్ నగరంలోని దేశిప్లాజా స్టూడియోలో 2015 సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ప్రారంబించబడినది. అటు పిమ్మట, 2016 సంవత్సరానికి తెలుగు సాహిత్య వేదిక నూతన సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన బిళ్ళ ప్రవీణ్ ను దండ వెంకట్ సభకు పరిచయం చేసారు. బిళ్ళ ప్రవీణ్ గారి సారధ్యంలో నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాలు నూతన శోభ సంతరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసారు. బిళ్ళ ప్రవీణ్ స్పందిస్తూ, భాషా సాహిత్యాలకు పెద్ద పీట వేస్తున్న సాహిత్య వేదిక ఆశయాలను మరియు స్థానిక సాహిత్యభిమానులను అభినందిస్తూ, 2016 సంవత్సరంలో సహాయ సహకారాలని కోరుతూ ఆసక్తి వున్న వారిని ఆహ్వానించారు.
కార్యక్రమం ప్రారంభంలో ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించి, వడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి దొడ్ల నిర్జర, దొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను సభకు పరిచయం చేస్తూ, కథా రచయిత సి. రామచంద్రరావు 9 కథలు వ్రాసారని, వేటికవే సాటి అని చక్కగా వివరించారు. తదుపరి జలసూత్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని ఇలా సంక్రాంతికి సంబంధించి ఎన్నో విషయాలను ఆద్యంతం ఆసక్తిగా వివరించారు. మాడ దయాకర్ మాట్లాడుతూ మన తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని, శ్రీ శ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని ఎంతో హాస్య భరితంగా పేరడీ పరేడ్ నిర్వహించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి "పిచ్చి ప్రేమ" అనే సినిమా పై సమీక్ష రాయమంటే విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు. వేముల లెనిన్ తన కమ్మని గాత్రం తో అసాధారణ జ్ఞాపక శక్తితో "తల్లీ నిను దలంచి" అంటూ మాడుగుల నాగ ఫణి శర్మ గారు రచించిన గీతాన్ని వీనుల విందుగా పాడి వినిపించారు. డా. జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా. పుదూర్ జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు.
ఈ నాటి ముఖ్య అతిధిని కార్యక్రమ సమన్వయకర్త పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా, రాణి భట్రాజు గారు డా.సుధ గారికి పుష్పగుచ్చం అందచేసారు. తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, చిన్న తనం నుండి నాట్యం పై మక్కువ పెంచుకొని జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న తెలుగు మహిళ డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడుతూ, బ్రహ్మాండ పురాణంలో దేవతలు, గంధర్వులు, గుహ్వకులు, రాక్షసులు, సిద్ధులు, యక్షులు అనే వర్గాలు ఉన్నాయి, యక్షులలో ఇంకా రాక్షసులు, భూతాలు అనే ఉప వర్గాలు కూడా ఉన్నాయి, వాల్మీకి రామాయణం లో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. వేదమంత్రాలలో యక్ష శబ్ధం పరమాత్మ వాచకం గా ప్రయోగింపబడింది, తెలుగు సాహిత్యంలో యక్ష శబ్దాన్ని చాలా రకాలుగా మన పూర్వులు ఉపయోగించారు, యక్ష జాతి, యక్ష రాత్రి, యక్ష ప్రశ్నలు, యక్షరాజు, యక్షిణి, యక్ష గ్రహం, ఇలా ఎన్నో విధాలుగా యక్ష శబ్దం ప్రయోగింపబడింది అని తెలిపారు. మొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12 వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో శ్రీశైలం - శివరాత్రి - జాగరణ గురించి యక్ష గానాల గురించి ప్రస్తావించారు, 14 వ శతాబ్దంలో మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో యక్షగాన సమస్త పదాన్ని, ద్రాక్షారామ ప్రశంస సందర్భంలో ప్రస్తుతించారు అని తెలిపారు. 16 వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు ... " అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారు. ఆధునిక యుగంలో యక్షగానానికి పుట్టినిల్లు తెలుగు గడ్డ అని, క్రమేపీ తెలుగులో ఆదరణ తగ్గిపోవడం వలన పక్క రాష్ట్రం అయిన కర్ణాటక కు వలస పోయింది అని, తెలుగు యక్ష గాయకులు, సొంత గాత్రంతో కార్యక్రమాలు చేస్తే, కర్ణాటక వారికి రంగస్థలం బయట నుండి గాత్ర సాయం అందుతుంది అని తెలిపారు. డా . సుధ గారు , తమ పరిశోధనల నిమిత్తం తెలుగు రాష్టాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి లెక్కలేనన్ని గ్రామాలు తిరిగి, యక్ష గానాన్ని వృత్తిగా చేసుకొన్న కుటుంబాలను కలిసి, వారి అనుభవాలు గ్రంథస్తం చేసి, ఛాయా చిత్రాలు, దృశ్యమాలికలు తీసి వాటిని పదిలపరిచారు. వాటినన్నిటిని ఈ సభలో ప్రదర్శించి వివిధ యక్ష గాన ప్రక్రియలను స్వయంగా చూసే అవకాశం కల్పించారు. ఆ దృశ్యాలు అపురూపమైనవి, అజరామరమైనవి, వాటిని చూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. డా సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. సుధ గారు స్వయంగా గొప్ప కూచిపూడి కళాకారిణి కావడంతో వారికి తన పుట్టిల్లుకు వెళ్ళిన అనుభవం కలిగిందని చెప్పారు. ఆ అనుభవాలను సభలో పంచుకొని అందరి మనసులో యక్షగాన కళల పట్ల మరింత ఆసక్తి కలుగచేసారు. ఇలా మరుగున పడిపోతున్న కళలను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఒక గృహిణి, మాతృమూర్తి, అమెరికా లో స్థిరపడినా తెలుగు భాష, కళలపై ఎంతో మక్కువతో, తన చిన్న పిల్లలను ఇద్దరిని తన వెంట తీసుకొని, కాలినడకన ఎన్నో తెలుగు పల్లెలలో పర్యటించి, అలుపెరుగని బాటసారిలా, తెలుగు కళలను పరిరక్షించే సరస్వతి పుత్రికగా ఆవిడ చేసిన సేవలకు రాష్ట్రపతిచే పురస్కారం, లెక్కలేనన్ని అవార్డులు ఎన్నో తనను వరించినా, వీటన్నిటి కన్నా తెలుగు నేల మీద తొలి అడుగులు వేసిన యక్ష గానం ఇంకా విస్తరించేలా చేయడంలోనే నిజమైన ఆనందం అనే డా. సుధ గారిని ఆహూతులు అభినందించారు.
డా. కలవగుంట సుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్త జసదస్సు జరుపుకోవడం మహదానందంగా ఉంది అన్నారు. సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంది, మన స్థానిక కళాకారులను ఈ విధంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ5, టీవీ9, సీవిఆర్ న్యూస్, 6టీవీ, ఐనా టీవి, హంఔరా లకు కృతఙ్ఞతాభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద మరియు కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మి, గోవాడ అజయ్, తోట పద్మశ్రీ ,కొణిదల లోకేష్ నాయుడు మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు.