To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
24 June 2016
Hyderabad
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, జూన్ 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 107 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.
కార్యక్రమంలో ముందుగా ప్రముఖ జానపద గాయని శ్రీమతి తేలు విజయ గారు చక్కని పల్లె పాటలు పాడి సాహితీ ప్రియులని అలరించారు. మరి కొన్ని గంటల్లో భారతదేశానికి తిరుగు ప్రయాణం చేయవలసి వచ్చినా కూడా తీరిక చూసుకుని ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. డాలస్ వాస్తవ్యులు వేముల లెనిన్ గారు పితృ దినొత్సవం, అలాగే మాతృ దినొత్సవం సందర్భంగా పద్యాలు వినిపించారు. డా. జువ్వాడి రమణ గారు మాట్లాడుతూ దాశరథి గారి "కోటి రతనాల వీణ నా తెలంగాణ" పాటని గుర్తు చేస్తూ అలా ఎందుకు రాసారో వివరించారు.
పూణేకి చెందిన స్పీచ్ థెరపిస్టు అజిత్ హరిసింఘానీగారు ఆంగ్లములో రచించిన పుస్తకాన్ని కొల్లూరి సోమశంకర్ గారు తెలుగులోకి “ప్రయాణానికే జీవితం” గా అనువదించారు. ఈ పుస్తకాన్ని సాహిత్యవేదిక సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు గారు సభకి పరిచయం చేసారు. భారతదేశపు రహదారులపై అందరూ ఎంత స్నేహంగా ఉంటారో, ఎంత చక్కని ఆతిథ్యమిస్తారో ఈ పుస్తకం చదివితే మనకి తెలుస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో మనం కూడా బైకు వెనక సీటులో కూర్చుని ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుతుంది” అని చెప్పారు.
ఈ నాటి 107వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోకకవి డా. అందె శ్రీ గారిని పరిచయం చేస్తూ సంస్థ సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద వేదిక మీదకు ఆహ్వానించగా, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి గారు అందెశ్రీ గారికి పుష్పగుచ్ఛం అందచేసారు.
ముఖ్య అతిథి డా. అందె శ్రీ గారు “ప్రకృతి-కవితాకృతి” అనే అంశం మీద ప్రసంగించారు. 2010లో మిసిసిప్పీ నది నుండి ప్రపంచయాత్ర మొదలుపెట్టి మళ్ళీ 2016లో మిసిసిప్పీతోనే పూర్తిచేసిన విశేషాలను హృద్యంగా పంచుకున్నారు. అందె శ్రీ గారు ప్రకృతి మీద తీయని పాటలను పాడుతూ రెండున్నర గంటలు ప్రసంగిస్తూ అందరినీ మంత్రముగ్థులని చేసారు. ఆ తర్వాత ప్రేక్షకులతొ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చాలా సరాదాగా సాగింది. చివరి దాకా ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమములో ఆహ్వానితులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘నెల నెలా తెలుగు వెన్నెల’ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రసంగాన్ని తొలిసారిగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న "టాంటెక్స్ తరంగిణి" రేడియో కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది.
వేసవిలో డాలస్ లోని పిల్లలకు, పెద్దలకు సంగీత శిక్షణ ఇవ్వడానికి వచ్చిన రామాచారి గారు కూడా సభలో ఉండడం విశేషం. భావితరాలకు తెలుగు భాషని పంచవలసిన అవసరం ఎంతో ఉందని రామాచారిగారన్నారు.
డా. అందెశ్రీ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు మండిగ శ్రీ లక్ష్మి, కోడూరు కృష్ణారెడ్డి మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, అట్లూరి స్వర్ణ, మార్తినేని మమత, మాడ దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ5, టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.