pizza
TANTEX Nela Nela Telugu Vennela 111th Sahitya Sadassu
మహోన్నత తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొరని స్మరించుకున్న టాంటెక్స్ సాహిత్య వేదిక
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

20 October 2016
USA

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం అక్టోబర్ 16వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగానిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 111 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.

బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా శ్రీమతి అనిపిండి మీనాక్షి శిష్య బృందానికి చెందిన చిన్నారులు చక్కగా అన్నమయ్య కీర్తనలు గానం చేసారు. డా. ఎం.డీ.ఎన్.రావు గారు "అమ్మ కవిత"ని చదివి వినిపించారు. ఇటీవలే స్వర్గస్తులయిన తమ తల్లిగారి జ్ఞాపకాలతో రాసిన కవితని చదువుతూ ఆమెకి నివాళి అర్పించారు. గతంలో 76వ నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పిస్కా సత్యనారాయణగారు "సీతని చూసి నవ్విన బలరాముడు" అన్న అంశం మీద ఆసక్తికరంగా ప్రసంగించారు. రామాయణ కాలంనాటి సీతని భారత కాలానికి చెందిన బలరాముడిని పద్యం ద్వారా కలిపి చక్కగా చెప్పారు. సాహిత్యవేదిక సభ్యులైన మాడ దయాకర్ గారు "భాష-ఏకాక్షరం" అంశం మీద మాట్లాడారు. మరే భాషలో లేని సోయగం తెలుగు భాషకు ఉందని చెప్తూ ఒక చిన్న అక్షరంతో ఎంతో భావాన్ని చెప్పగలమని ఉదాహరణలతో విశ్లేషించారు. "శ్రీ రమణ పేరడీలు" అంశం మీద శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు ప్రసంగిస్తూ కొన్నిటిని సభకు పరిచయం చేసారు. ప్రముఖులు ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుందో చెపుతూ కొన్ని చదివి వినిపించారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుందో చెప్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.

ప్రతి నెలా జరిగే నెలనెలా తెలుగు వెన్నెలలో అట్లూరి స్వర్ణగారు నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం బాగా సందడిగా జరుగుతుంది. ఈసారికూడా స్వర్ణ గారు అడిగిన ప్రశ్నలకు సభికులు తికమక పడ్డారు. చివరకు రెండు జట్టులకి ఒకే మార్కులు వచ్చి ఆట సరదాగా ముగిసింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 4 గంటల నుండి 6 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.

111వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాంటెక్స్ మరియు తానా మాజీ అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారిని పరిచయం చేస్తూ మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, శ్రీ కల్వల రావు, శ్రీ పులిగండ్ల విశ్వనాథం, శ్రీ ఎం.వి.ఎల్.ప్రసాద్, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ కలిసి ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందచేసారు.

డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు తెలుగు సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన విదేశీయుడు చార్లెస్ బ్రౌన్ గురించి ప్రసంగించారు. బ్రౌన్ పుట్టుపూర్వోత్తరాలను ఉద్యోగ భాద్యతలను పరిచయం చేస్తూ తెలుగు భాషకి గ్రంధ సేకరణ,పరిరక్షణ, ముద్రణ, వ్యాకరణ రచన, నిఘంటువు రచన, లఘు రచనల కోవల్లో ఆయన చేసిన అద్భుతమైన కృషిని విశదీకరంగా వివరించారు. మెకంజీ, లెయిడన్ వంటి వారు సేకరించిన రెండువేలకు పైబడిన తాళపత్రాలను మద్రాస్ గ్రంధాలయానికి తరలించడమే కాకుండా తనకు తానుగా సుమారు 2440 గ్రంధాలను కూడా ఈ గ్రంధాలయానికి అందించిన మహోన్నత తెలుగు భాషాభిమాని బ్రౌన్ దొర అని ప్రసాద్ గారు వివరించారు. తనకు పక్షవాతం వచ్చినా కూడా తెలుగును పరుగెత్తించిన నిబద్ధత కలిగిన విదేశీయుడు బ్రౌన్ దొర అని ఆయన తెలుగు భాషకు అందించిన సేవలు చిరస్మరణీయాలు అని తోటకూర కొనియాడారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో బ్రౌన్ స్మారక చిహ్నాల ఏర్పాటు, జయంతి-వర్థంతిల నిర్వహణ, విద్యార్థులకు బ్రౌన్ పేరిట ఉపకారవేతనాలు వంటి వాటిని అందించి బ్రౌన్‌కు ప్రభుత్వాలు నిజమైన నివాళి అర్పించాలని ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. కేవలం ప్రజలతో సంభాషిస్తూనే బ్రౌన్ తెలుగుని నేర్చుకుని, వ్యాకరణ సూత్రాలను రచించి, నిఘంటువును రూపొందించి వేమన శతకానికి ప్రాచుర్యం కల్పించి ఎన్నో శతకాలు,తాళపత్ర గ్రంధాలకు పుస్తకరూపం తీసుకు వచ్చిన అరుదైన వ్యక్తి బ్రౌన్ దొర అని ప్రసాద్ గారు కొనియాడారు.

ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, పాలేటి లక్ష్మి, వనం జ్యోతి, లోకేష్ నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, వరిగొండ శ్యాం, జలసూత్రం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 9, టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved