To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
23 March 2017
USA
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "116వ నెలనెలా తెలుగు వెన్నెల" మరియు 38వ టెక్సస్ తెలుగు సాహిత్య సదస్సు శనివారం మార్చి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 116 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ నుండే కాకుండా హ్యూస్టన్, ఆస్టిన్, సాన్ ఆంటోనియో నుండి భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసారు.
సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు, పసందైన విందు భోజనం తరువాత శ్రీమతి ఆడూరి సృజన "సంగీత సాహిత్య సమలంకృతే", "స్వరములు ఏడైనా రాగాలెన్నో" పాటలను పాడి సభను ప్రారంభించారు. సాన్ ఆంటోనియో నుండి వచ్చిన శ్రీ సూరంపూడి శరత్, శ్రీ కరణం రామ్మోహన్ స్వీయకవితలని చదివి వినిపించారు. ఆస్టిన్ నుండి వచ్చిన శ్రీ మందపాటి సత్యం తన నవల "నిజమే కల అయితే" కి ప్రేరణ ఎలా కలిగిందో తెలియజేసారు. శ్రీ డొక్కా రాం ఆత్మానందం-ఆత్మారామం శీర్షికన తన స్వీయ కవితలని వినిపించారు. హ్యూస్టన్ నుండి వచ్చిన శ్రీ వంగూరి చిట్టెన్ రాజు పోతన భాగవతాన్ని భావితరానికి ఉపయోగపడేలా చేస్తున్న శ్రీ పుచ్చా మల్లిక్ గురించి చెప్పారు.
డాలస్ కి చెందిన శ్రీ వేముల లెనిన్ బాబు కవితా కుమారి ప్రస్థాన గీతిక శీర్షికన ఊహా సుందరి అయిన కవితా కుమారి జన్మస్థలం, ఆమె ప్రయాణం గురించి వివరిస్తూ మంచి పాటలని పాడారు. డా. ఊరిమిండి నరసింహారెడ్డి "మన తెలుగు సంపద" శీర్షికన కొన్ని పొడుపు కథలను సభతో పంచుకున్నారు. శ్రీ మాడ దయాకర్ నరసింహావతార ఘట్టం - పోతన నాటకీయత గురించి మాట్లాడారు. మెమొరియల్ డే వారాంతం జరగనున్న తానా సభల సూవనీర్ "తెలుగు పలుకు" ప్రధాన సంపాదకులు శ్రీ చేకూరి కేసీ ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలు కవితలు, కథలు, పద్యలు, వ్యాసాలు మొదలైనవి ఏప్రిల్ మొదటివారానికి చేరేలా పంపాలని కోరారు.
శ్రీ దొడ్ల రమణ గారు సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీమతి దేవగుప్తాపు పద్మ గారి "పద్మ పద్య వాహిని" పుస్తక పరిచయం చేసారు. పుస్తక పరిచయం తరువాత పుస్తకావిష్కరణ కూడా జరిగింది. శ్రీ విన్నకోట రవిశంకర్ గారి "వేసవి వాన" కవితా సంపుటిని శ్రీ బసాబత్తిన శ్రీనివాసులు పరిచయం చేస్తూ అందులోని రెండు కవితలు చదివారు. శ్రీ పాపినేని శివశంకర్ గారికి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని తెచ్చిన "రజనీగంధ" కవితా సంపుటిని శ్రీ మద్దుకూరి చంద్రహాస్ పరిచయం చేసారు. ఇందులోని ప్రతి కవిత మనకి ఒక కొత్త విషయాన్ని పరిచయం చేస్తుందన్నారు. శ్రీమతి కూచిభొట్ల లలితామూర్తి తమ తాతగారు రచించిన శ్రీగణేశ్వరీయం పుస్తక పరిచయం చేసి కొన్నిటిని పంచి పెట్టారు.
తేనీటి విందు తర్వాత సాన్ ఆంటోనియోకి చెందిన శ్రీ పోతన సాయికుమార్ రచించి దర్శకత్వం వహించిన "వైద్యో నారాయణ" నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులో శ్రీ పోతన సాయికుమార్, శ్రీ కరణం రామ్మోహన్, శ్రీ మేక సీ.ఎస్.రెడ్డి, శ్రీ సూరంపూడి శరత్, శ్రీ దొడ్డ సత్య, శ్రీ దేవగుప్తాపు బాబు, శ్రీ కోట వేణుగోపాల్, శ్రీమతి ఆదిత్య లక్ష్మి నటించారు. శ్రీ కన్నెగంటి చంద్ర సాహిత్యంలో విషాదం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. డా. కలవగుంట సుధ ఆధ్యాత్మ రామాయణం గురించి మాట్లాడారు. శ్రీ పూదూర్ జగదీశ్వరన్ సరస్వతి దేవి మీద ఒక పద్యం వినిపించారు. దాని తర్వాత ఇడ్లీ దండకం చదివి అందరినీ నవ్వించారు. డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కొన్ని విప్లవగీతాలను, ఒక జానపద గీతం ఆలపించారు. శ్రీ జలసూత్రం చందు స్వీయరచన పాటని పాడారు
116వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు. సింగిరెడ్డి శారద మాట్లాడుతూ సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పసందైన విందు భోజనం సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.