
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 May 2017
USA
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం మే 21 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి. శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 118 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. డాలస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.
ముందుగా సాహిత్య వేదిక సభ్యులు అయినటువంటి డా.సుధా కలవగుంట ‘మూషిక వాహన’ విఘ్న నాయకునిపై ప్రార్థనా గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అటు తరువాత సాహిత్య వేదిక సభ్యులు అయినటువంటి శ్రీ. శ్రీనివాసులు బసాబత్తిన ‘రాఘవరావు మళ్ళీ కనిపించాడు’ అనే పుస్తకాన్ని పరిచయం చేసారు. అలాగే ‘రంగుటద్దాల కిటికీ’ కథల సంపుటి, శ్రీ శంకగిరి నారాయణస్వామిగారి రచనలో ‘వీరిగాడి వలస’ కథను క్లుప్తంగా పరిచయం చేసారు. ప్రవాస భారతీయుల జీవితాలను పరిశీలిస్తూ రాసిన కథల సంపుటి ఈ ‘రంగుటద్దాల కిటికీ’.ప్రవాసంలో ఉన్న తన కొడుకు, కోడలు దగ్గరకు వచ్చిన రాఘవరావు కథ ఈ ‘వీరిగాడి వలస’ ఆసక్తికరంగా ఉంది.
ఈ కార్యక్రమంలో గుంటూరు నుండి శ్రీ .బొగ్గరం ప్రసాద్ రావు గారు తమ స్వీయ రచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరు వృత్తి రిత్యా రీజనల్ జాయింటు డైరెక్టర్ గా ప్రభుత్వ కళాసాలల విద్యా సంస్థలో పనిచేయటమే కాకుండా,ప్రవృత్తి రిత్యా సాహిత్య సేవ,గ్రంధ పఠనం, తెలుగులో పద్య రచన చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమత్ శతకము, సీతారామ, చెన్నకేశవ, సుమాంజలి వంటి గ్రంధాలను కూడా రచించారు.వీరు భరత మాతపై ఒక పద్యము ‘శ్రీ కరమై శుభకరమై’..., అనీ, అటుతరువాత ‘జయము జయము’…. అంటూ తెలుభాషకు,తెలుగు సాహిత్యానికి, టాంటెక్స్ సాహిత్య సదస్సుపై మరొక పద్యాన్ని ఆలపించి ప్రేక్షుల మన్ననలు పొందారు.
సంస్థ పూర్వాధ్యక్షులు అయినటువంటి డా. ఊరిమిండి నరసింహా రెడ్డిగారు తెలుగు సిరిసంపదలు అయినటువంటి జాతీయాలు,నుడికారాలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ కార్యక్రమంలో ప్రేక్షకులను కూడా పాల్గొనేట్టు చేసి ఎంతో ఆసక్తి కరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు.
అటుతరువాత శ్రీ. చంద్రహాస్ మద్దుకూరిగారు శ్రీ.తిక్కవరపు పట్టాభి రామ రెడ్డి గారు రచించినటువంటి ‘ఫిడేలు రాగాల డజన్’ అనే పుస్తకాన్ని పరిచయం చేసారు. అంతేకాక ప్రతి నెలా ఆ మాసంలో పుట్టిన లేక గిట్టిన రచయితలను గుర్తు చేసుకుంటూ ‘మాసానికో మహనీయుడు’ అనే అంశం పై ఈ నెల మహనీయుల్లో ‘నా దేశం నా సంపుటి’ రచించిన గుంటూరు శ్రీ. శేషేంద్ర శర్మ గారిని, శ్రీ.వేటూరి సుందర రామూర్తి గారిని, శ్రీ.సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారిని స్మరించుకోవటం కార్యక్రమంలో ప్రత్యేక అంశం గా నిలిచింది.
అనంతరం “సరదాగా కాసేపు” ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని సాహిత్య వేదిక సభ్యులు అయినటువంటి శ్రీమతి. స్వర్ణ అట్లూరి నిర్వహించారు. ప్రేక్షకులను రెండు భాగాలుగా విభజించి టీం ఎ గాను, టీం బి గాను విభజించి ఎంతో అసక్తి గా ప్రశ్నలు అడిగారు. చివరకు టీం ఎ గెలుపొందింది.
వీటన్నిటితోపాటు శ్రీ.రామకృష్ణ నిమ్మగడ్డ ‘మెరుపు కన్య’ అనే స్వీయ కవిత ప్రేక్షకులకు వినిపించారు.
ఇక కార్యక్రమంలో అన్నిటికన్న ముఖ్య ఘట్టానికొస్తే విశ్వతపస్వి శ్రీ. రామడుగు నరసింహా చార్యులు గారు 118 వ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ‘సాహిత్యం లో సౌందర్యం’ అంశంపై వివిధ కవుల రచనలను విశ్లేషిస్తూ ప్రసంగించారు. వీరు వృత్తి రిత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రిత్యా ఆశుకవి,వక్త, గేయ రచయిత, గ్రంధకర్త, మరియు ఆధ్యాత్మిక వేత్త. వీరి భాషా ప్రావీణ్యం పదజాలం ప్రేక్షకులను ఆకట్టుకుంది.వారి అమోఘమైన పాండిత్య ప్రతిభకు, వాగ్ధాటికీ ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు.
ముఖ్య అతిథి ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ.కృష్ణారెడ్డి ఉప్పలపాటి కార్యవర్గ సభ్యులు శ్రీ.చినసత్యం వీర్నపు, శ్రీ.వేణు పావులూరి తదితరులు ముఖ్య అతిథిని దుశ్శలువాతో సన్మానించి ఙ్ఞాపికను బహుకరించారు.

